Union Minister Bandi Sanjay : తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది - బండి సంజయ్-union minister bandi sanjay kumar comments on brs party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Union Minister Bandi Sanjay : తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది - బండి సంజయ్

Union Minister Bandi Sanjay : తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయింది - బండి సంజయ్

HT Telugu Desk HT Telugu
Published Jun 14, 2024 09:10 PM IST

Union Minister Bandi Sanjay On BRS : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందన్న ఆయన.. కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని దుయ్యబట్టారు.

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తో తరుణ్ చుగ్
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తో తరుణ్ చుగ్

Union Minister Bandi Sanjay On BRS : తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని... కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం బిజేపి అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. అందుకు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని తెలిపారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ తో భేటీ అయ్యారు. తరుణ్ చుగ్ ను మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణలో పార్టీ బలోపేతంపై చర్చించారు.

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై అరగంటకుపైగా చర్చించారు. తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలను గెలిచిన బీజేపీ 35 శాతానికిపైగా ఓట్లు సాధించడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన తరుణ్ చుగ్ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు.

కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నిరాశను ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందన్నారు.

బండిపై తరుణ్ చుగ్ ప్రశంసలు…

ఎంపీగా, బిజెపి రాష్ట్ర అద్యక్షునిగా ఆ పదవులకే బండి సంజయ్ వన్నె తెచ్చారని అభిప్రాయపడ్డారు తరుణ్ చుగ్. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ ఆ శాఖకు మంచి పేరు తీసుకురావడంతోపాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

కరీంనగర్ ఎంపీ గా రెండోసారి ఎన్నికై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి చేపట్టిన బండి సంజయ్ కి నేతల నుంచి అభినందనల పరంపర తీవ్రంగా కొనసాగుతుంది. తరుణ్ చుగ్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి పలువురు నాయకులు, కార్యకర్తలు, అధికారులు సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారులుఋ సైతం సంజయ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, బీవీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి.ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, వీరేందర్ గౌడ్, జె.సంగప్పతోపాటు వివిధ మోర్చాలకు చెందిన నాయకులు సంజయ్ ను కలిసిన వారిలో ఉన్నారు.

రిపోర్టింగ్ - HT Telugu ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి.

Whats_app_banner