Nizam Sugars : నిజాం షుగర్స్ తెరిపించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం- మంత్రి శ్రీధర్ బాబు
Nizam Sugars : ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని సబ్ కమిటీ ఇవాళ పరిశీలించింది. స్థానిక రైతులతో భేటీ అయ్యింది.
Nizam Sugars : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం శక్కర్ నగర్ లోని నిజాం చక్కెర కర్మాగారాన్ని శనివారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నేతృత్వంలోని సబ్ కమిటీ సందర్శించింది. నిజాం చక్కెర ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన సబ్ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు శనివారం ఛైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలో కమిటీ సభ్యులైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డితో పాటు స్థానిక నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే పి.భూపతి రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బోధన్ లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీని సందర్శించారు. కర్మాగారంలోని యంత్రాలను, డిస్టిల్లరీ యూనిట్ పరిశీలించి, ఫ్యాక్టరీకి సంబంధించిన వివరాల గురించి స్థానిక అధికారులు, నాయకులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. 2015 లో లే ఆఫ్ గా ప్రకటించబడి మూతబడిన ఈ ఫ్యాక్టరీని తిరిగి పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులతో చర్చించారు. అనంతరం రైతులు, రైతు సంఘాల నాయకులతో భేటీ అయిన కమిటీ సభ్యులు, వారి అభిప్రాయాలను సేకరించారు. ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల రైతులు హర్షం వెలిబుచ్చుతూ, కర్మాగారం పునరుద్ధరిస్తే చెరుకు పంటను సాగు చేసేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని కమిటీ దృష్టికి తెచ్చారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం
ఈ సందర్భంగా సబ్ కమిటీ ఛైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి నిజాం చక్కర ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయి పరిశీలన కోసం సబ్ కమిటీ హాజరుకావడం జరిగిందన్నారు. రైతులు, కార్మికుల శ్రేయస్సు కోసం నిజాం షుగర్స్ ను తప్పనిసరిగా తెరిపించి, లాభాల బాటలో పయనించేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్తామని భరోసా కల్పించారు. రైతులకు మేలు జరగాలన్నదే ప్రభుత్వ అభిమతమని, ఫ్యాక్టరీ పునరుద్ధరణతో పరిస్థితులు ఎలా ఉంటాయి, ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలేమిటీ అనే అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నామని, అవసరమైతే రైతులను హైదరాబాద్ కు కూడా పిలిపించి చర్చిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే వ్యవసాయ, పారిశ్రామిక నిపుణులతోనూ చర్చిస్తున్నామని తెలిపారు. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, పెట్టుబడి సాయం, వడ్డీ లేని రుణం వర్తింపజేసేలా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భరోసా కల్పించారు. ఫ్యాక్టరీని తెరిపించించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, అయితే రైతులు క్షేత్రస్థాయిలో నెలకొని ఉండే వాస్తవ పరిస్థితులను తెలుపుతూ పూర్తి స్థాయిలో సహకారం అందించాలని కోరారు.
ఔటర్ రింగ్ తరహాలో జిల్లాల్లో రోడ్డులు
ప్రజలు కోరుకున్న మార్పును చేసి చూపించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీలలో రెండు హామీలైన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు. ఈ నెల 27 న మరో రెండు హామీలైన రూ. 500 లకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. ఇదే కోవలో రైతులకు ఇతోధికంగా మేలు చేకూర్చాలనే ధృడ సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం అందుబాటులో ఉన్న అన్ని అంశాలను నిశితంగా పరిశీలన జరుపుతోందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలోనే జిల్లాలు, ముఖ్య పట్టణాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించే దిశగా ముందుకెళ్తోందన్నారు. దీనివల్ల వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల విస్తృతికి అవకాశం ఏర్పడుతుందని, తద్వారా రైతులతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు మెరుగుపడతాయని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చిన్న పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల స్థాపన కోసం మరో పది రోజుల్లోనే ప్రత్యేక పాలసీని తేనున్నామని మంత్రి వెల్లడించారు.