తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ponnam Prabhakar : కరీంనగర్ కాంగ్రెస్ ఓటమి- అభ్యర్థికి, కార్యకర్తలకు మంత్రి పొన్నం క్షమాపణ

Ponnam Prabhakar : కరీంనగర్ కాంగ్రెస్ ఓటమి- అభ్యర్థికి, కార్యకర్తలకు మంత్రి పొన్నం క్షమాపణ

HT Telugu Desk HT Telugu

04 June 2024, 22:41 IST

google News
    • Ponnam Prabhakar : కరీంనగర్ లోక్ సభ స్థానంలో ఓటమిపై సమీక్షించుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలకు, కార్యకర్తలకు పొన్నం క్షమాపణ చెప్పారు.
కరీంనగర్ కాంగ్రెస్ ఓటమి- అభ్యర్థికి, కార్యకర్తలకు మంత్రి పొన్నం క్షమాపణ
కరీంనగర్ కాంగ్రెస్ ఓటమి- అభ్యర్థికి, కార్యకర్తలకు మంత్రి పొన్నం క్షమాపణ

కరీంనగర్ కాంగ్రెస్ ఓటమి- అభ్యర్థికి, కార్యకర్తలకు మంత్రి పొన్నం క్షమాపణ

Ponnam Prabhakar : కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓడిపోవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు క్షమాపణ చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల కృషి ఫలితంగా 3 లక్షల 54 వేల ఓట్లు వచ్చాయని, ఓటమికి నియోజకవర్గ కన్వీనర్ గా బాధ్యత వహిస్తూ కార్యకర్తలను క్షమాపణ కోరారు. ఓటమిపై సమీక్షించుకొని భవిష్యత్తులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ కు కంచుకోటగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలపై కరీంనగర్ కాంగ్రెస్ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి పొన్నం మీడియాతో మాట్లాడుతూ కదనరంగంలో విద్వేషాలను మతపరమైన అంశాలను ఎన్నికలకు ఉపయోగించుకుని బీజేపీ గెలిచిందని విమర్శించారు. దేవుడి పేరుతో, అక్షింతలు పేరుతో ఓట్లు వేసిన వాళ్లు మారాలని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నారు. గెలిచిన అభ్యర్థి మతపరమైన విద్వేషాలు మాని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, రాబోయే ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గెలిచిన ఎంపీ మతపరమైన అంశాలకు , విద్వేషాలకు పరిమితం కావద్దని అభివృద్ధి పరిమితం కావాలని కోరారు. కరీంనగర్ లో కాంగ్రెస్ చెందిన వ్యక్తి ఎంపీగా లేకపోయినప్పటికీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందేలా కృషి చేస్తామని తెలిపారు.

ఫలితాలపై సమీక్ష లోపాలను సవరించుకుంటాం

రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాలలో కంటోన్మెంట్ ఉపఎన్నికలో గెలిచామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మిగిలిన స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చామన్నారు. ఓడిపోయిన 8 లోక్ సభ స్థానాల్లో శాసన సభ స్థానాల వారీగా సమీక్షించుకుంటామని లోటుపాట్లను సవరించుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మాజీ మంత్రులు దగ్గర కూడా బీఆర్ఎస్ కు మెజారిటీ రాని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో కరీంనగర్ ఎంపీగా చేసిన వినోద్ కుమార్ లక్ష ఓట్లు కోల్పోయి మూడో స్థానానికి పరిమితం అయ్యారని తెలిపారు. భవిష్యత్ లో మండలాలు మున్సిపాలిటీ లు, వార్డు మెంబర్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందన్నారు.

ఎన్నికల కోడ్ అయిపోగానే ఆరు గ్యారంటీలు అమలు

ఎన్నికల కోడ్ అయిపోగానే 6 గ్యారంటీ స్కీములను అమలు చేస్తామని స్పష్టం చేశారు పొన్నం ప్రభాకర్. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు ,అర్హులకు రేషన్ కార్డులు ,రైతు రుణమాఫీ , సన్నవరికి బోనస్ అందిస్తామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా ప్రజాపాలనలో ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యే గా గణేష్ 10 వేల పైచిలుకు మెజారిటీ తో గెలవడం 5 నెలల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రశంసగా భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ తలకిందులు చేస్తూ ఇండియా కూటమికి వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ కార్యకర్తలకు సంతోషాన్ని ఇచ్చాయని చెప్పారు. ప్రజాస్వామ్యం బతకాలని ఇండియా కూటమి సభ్యులను పెద్దఎత్తున గెలిపించిన వారికి ప్రజాస్వామ్యం పట్ల వారికున్న ప్రేమను స్పష్టం చేస్తుందన్నారు.

ప్రజా తీర్పును గౌరవిస్తున్నా... వెలిచాల రాజేందర్ రావు

ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోతే కుంగిపోయే మనస్తత్వం మాది కాదన్నారు కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు. ఓటమిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో గెలుపు కోసం ప్రయత్నం చేస్తానని చెప్పారు. కార్యకర్తలు ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని, అందరికీ నిత్యం అందుబాటులో ఉంటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకొని భవిష్యత్తులో అలాంటి తప్పిదాలు జరగకుండా ముందడుగు వేస్తానని చెప్పారు. నా శక్తి మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశానని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం నాపై అపారమైన నమ్మకం తో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపిందన్నారు. ఎన్నికల్లో రేయింబవళ్ళు చమటోర్చి కష్టపడ్డ నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ప్రాణ సమానులైన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.

HT Telugu Correspondent Karimnagar K.V.REDDY

తదుపరి వ్యాసం