Bandi Sanjay : కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా గెలుస్తున్నా- బండి సంజయ్
Bandi Sanjay : పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి, మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఎంపీ బండి సంజయ్ అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అవుతుందన్నారు.
Bandi Sanjay : ఎగ్జిట్ పోల్స్ తరహాలోనే ఫలితాలు ఎగ్జాక్ట్ గా ఉంటాయని స్పష్టం చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్. ఎంపీ ఎన్నికలతో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు కాగా, కాంగ్రెస్ కు ఆశించిన ఫలితాలు రావని తెలిపారు. కరీంనగర్ లో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పది స్థానాల్లో గెలుస్తుందన్నారు. కొన్ని మీడియా సంస్థలు సొంత డబ్బా కొట్టుకోవడం చూస్తే నవ్వేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ కు 11, 12 ఎంపీ స్థానాలు వస్తాయని ఓ మీడియా ప్రచారం చేయడం చూసి జనం నవ్వుకునే పరిస్థితి ఉందన్నారు. బీఆర్ఎస్ కు అడ్రస్ లేకుండా పోతుండగా కాంగ్రెస్ కు ఆశించిన స్థాయిలో గెలువలేదని, మెజారిటీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.
బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదు
బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదంటున్నారు బండి సంజయ్. కరీంనగర్ నుంచి రెండోసారి ఎంపీగా తాను గెలుస్తున్నానని చెప్పిన బండి సంజయ్, మోదీ కేబినెట్ లో లో తనకు అవకాశం ఉంటుందా? ఉండదా? అనే దానిపై క్లారిటీ ఇవ్వలేకపోయారు. బీజేపీ ఏక్ నిరంజన్ పార్టీ కాదని అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు సమ్మతమే అన్నారు. మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. మోదీ ప్రధానమంత్రి కావాలని కోరుకుని ఎన్నికల బరిలో నిలిచానని తెలిపారు. మోదీ ప్రధానమంత్రి అయితే చాలు అనుకునే తనకు అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా శక్తి వంచన లేకుండా పని చేస్తానని చెప్పారు. పదవుల కోసం తాను పాకులాడే వ్యక్తిని కాదని పార్టీ కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కరీంనగర్ లో బీజేపీ గెలుస్తుందని సర్వే రిపోర్ట్ లు తేల్చడంతో కమలనాథుల్లో నూతనోత్సాహం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ కు చేరుకుని ముందస్తుగా బండి సంజయ్ కి శుభాకాంక్షలు తెలిపారు. సంజయ్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణుల హడావిడితో పండుగ వాతావరణం నెలకొంది. ఓట్ల లెక్కింపు ఫలితాలను చూసేందుకు ఎంపీ సంజయ్ కార్యాలయం వద్ద భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సంబరాలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో కౌంటింగ్ పూర్తయిన తర్వాత పరిస్థితిని బట్టి ఊరేగింపుపై నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి తెలిపారు.
HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి
సంబంధిత కథనం