Congress Majority : నల్గొండలో కాంగ్రెస్ సునామీ - 5 లక్షలు దాటిన మెజార్టీ, గెలిచిన మరిన్ని స్థానాలివే!
Telangana Loksabha Election Results 2024 : రికార్డు మెజారిటీ దిశగా నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి రఘువీర్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఆయన మెజార్టీ 5 లక్షల మెజార్టీని దాటారు.

Telangana Loksabha Election Results 2024 : పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో నల్గొండ సెగ్మెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రభంజనం సృష్టించారు. ఇప్పటికే ఆయన 5, 41,241 మెజార్టీ మార్క్ ను దాటారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయితే… ఓట్ల మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉంది. రఘువీర్ రెడ్డి జానారెడ్డి కుమారుడు. ఇయన సోదరుడు నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2011లో కడప లోక్ సభ ఉప ఎన్నికలో వైఎస్ జగన్ 5.43 లక్షల ఆధిక్యం సాధించారు. ఇప్పుడు ఆ రికార్డును రఘువీర్ రెడ్డి అధిగమించారు.
ఇక ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసాయం రఘురామిరెడ్డి విజయం సాధించారు. 4,56704 ఓట్ల తేడాతో విక్టరీ కొట్టారు. ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో కాంగ్రెస్ పార్టీకి 4 లక్షల మెజార్టీ దాటింది.
నల్గొండ లోక్ సభ నియోజకవర్గాని ఇప్పటి దాకా జరిగిన ఎన్నికల చరిత్రను గమనిస్తే... కాంగ్రెస్ కే ఎక్కువ విజయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్థానం కాంగ్రెస్ సిట్టింగ్ సీటు కూడా. బీఆర్ఎస్ నల్గొండలో ఇప్పటి వరకు 2014, 2019 ఎన్నికల్లో మాత్రమే రెండు సార్లు పోటీ చేసింది.
2014 ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ 2019 లో మాత్రం రెండో స్థానానికి చేరుకుంది. బీజేపీ పలు ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్క సారి కూడా నెగ్గలేదు. కాగా, కాంగ్రెస్ కు విజయాల రికార్డ్ ఉంది. 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సైతం ఆ పార్టీకి నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కేవలం ఒక్క చోట మాత్రమే ఎమ్మెల్యే ఉన్నా.. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం విజయం సాధించింది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది. బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డి రెండో స్థానంలో నిలిచారు.
ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో చూస్తే…. సూర్యాపేటలో మినహా.. మిగిలిన ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. నల్గొండ ఎంపీ సీట్ లో జరిగే పోటీ వార్ వన్ సైడ్ లా ఉంటుందని తొలి నుంచి ఆ పార్టీ శ్రేణులు పేర్కొంటూ వచ్చాయి. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు కుందూరు రఘువీర్ రెడ్డి ఈ సారి బరిలో ఉండటంతో వార్ వన్ సైడ్ అయిపోయింది. బీఆర్ఎస్ కు చెందిన ముఖ్య నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ముఖ్య క్యాడర్ ఆ పార్టీకి టాటా చెప్పి కాంగ్రెస్ కండువాలు కప్పేసుకున్నారు.
నల్గొండ లోక్ సభ నియోజకవర్గంలో గణనీయమైన ఓట్లున్న సీపీఎం, అదే మాదిరిగా సీపీఐలు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాయి. ఇన్ని పాజిటివ్ అంశాల నేపథ్యంలో…. కాంగ్రెస్ పార్టీ సూపర్ విక్టరీ కొట్టేసింది.
మరోవైపు భువనగిరిలో కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దాదాపు 204441 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిపై విక్టరీ కొట్టారు. పెద్దపల్లి, జహీరాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, మహబూబాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.