తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Gang War : కరీంనగర్ జిల్లాలో గ్యాంగ్ వార్ కలకలం, భూవివాదంలో రౌడీ షీటర్ దారుణ హత్య

Karimnagar Gang War : కరీంనగర్ జిల్లాలో గ్యాంగ్ వార్ కలకలం, భూవివాదంలో రౌడీ షీటర్ దారుణ హత్య

HT Telugu Desk HT Telugu

29 May 2024, 20:03 IST

google News
    • Karimnagar Gang War : కరీంనగర్ జిల్లాలో గ్యాంగ్ వార్ కలకలం రేపుతోంది. భూవివాదంలో రెండు గ్యాంగ్ ల మధ్య వివాదం చెలరేగి ఓ రౌడీ షీటర్ లో మరో వర్గం వెంటాడి హత్య చేసింది.
కరీంనగర్ జిల్లాలో గ్యాంగ్ వార్ కలకలం
కరీంనగర్ జిల్లాలో గ్యాంగ్ వార్ కలకలం

కరీంనగర్ జిల్లాలో గ్యాంగ్ వార్ కలకలం

Karimnagar Gang War : కరీంనగర్ జిల్లాలో గ్యాంగ్ వార్, హత్య కలకలం సృష్టిస్తుంది. మానకొండూర్ మండలంలో ఇద్దరు రౌడీషీటర్ల మధ్య భూ వివాదం ఒకరి ప్రాణాలు తీసింది. పచ్చునూర్ కు చెందిన యువకుడు గోపు ప్రశాంత్ రెడ్డిని కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హత్య చేసింది మరో గ్యాంగ్. వెంటాడి వేటాడి హత్య చేసి మానకొండూర్ మండలం వెల్ది-పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి గ్రామాల మధ్య మానేర్ వాగులో శవాన్ని పడేశారు. 12 గంటల తర్వాత పోలీసులు శవాన్ని గుర్తించారు.

హత్యకు ముందు ఫోన్లో మాటల యుద్ధం

పచ్చునూర్ కు చెందిన ప్రశాంత్ రెడ్డి అదే గ్రామానికి చెందిన నన్నపనేని రమేశ్ అలియాస్ జానీతో ఓ భూమి సెటిల్మెంట్ వ్యవహారంలో గొడవలు జరుగుతున్నాయి. భూవివాదంలో తలదూర్చిన ఇద్దరు ఒకరినొకరు నిన్ను చంపుతా అంటే నిన్నే చంపుతా అంటూ ఛాలెంజ్ చేసుకున్నారు. ఫోన్ లో ఇద్దరు హెచ్చరికల ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వెంబడించి బావిలో పడ్డా వదలకుండా హత్య

ప్రశాంత్ రెడ్డి తనను చంపుతాడనే భయంతో రమేశ్ తన ఫ్రెండ్స్ సహకారంతో ప్రశాంత్ ను అంతమొందించాలని పక్కా ప్రణాళిక రూపొందించాడు. మూడు రోజులుగా ఆయన ఇంటి పరిసరాల్లో రెక్కీ నిర్వహించారు. ప్రత్యర్థుల వ్యూహాన్ని పసిగట్టిన ప్రశాంత్ అప్రమత్తమై పక్క గ్రామమైన ఊటూరులో ఓ మిత్రుడి వద్ద తలదాచుకున్నాడు. పక్క గ్రామంలో ఉన్నాడని తెలుసుకుని రమేష్ గ్యాంగ్ అక్కడికి వెళ్లి ప్రశాంత్ ను వెంబడించి వేటాడారు. భయంతో పరుగెత్తిన ప్రశాంత్ పాడుబడ్డ బావిలో పడిపోయాడు. బావిలో పడ్డ ప్రశాంత్ పై బండరాళ్లు వేసి దాడి చేశారు. తాడు సహాయంతో బయటకు తీసి కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. చిత్రహింసలకు గురిచేసి గొంతుకోసి హత్య చేసి పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి కరీంనగర్ జిల్లా వెల్ది గ్రామాల మధ్య మానేర్ వాగులో పడేశారు.

హంతకుల కోసం పోలీసుల గాలింపు

ప్రశాంత్ రెడ్డిని కొందరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని తెలిసి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా 12 గంటల తర్వాత శవమై తేలడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. రౌడీ షీటర్ల గ్యాంగ్ వార్ మర్డర్ కు దారి తీయడంతో ప్రశాంతంగా ఉన్న పచ్చునూరు గ్రామం ఒక్కసారిగా ఉల్లిక్కిపడింది. థ్రిల్లర్ సినిమాను తలపించేలా సాగిన హత్యోదాంతంపై పోలీసులు సీరియస్ గా స్పందించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ నేతృత్వంలో మానకొండూర్ సీఐ రాజ్ కుమార్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పచ్చునురు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసి హత్య జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు. హంతకుల కోసం ప్రత్యేక టీమ్ తో గాలింపు చర్యలు చేపట్టారు. హంతకులను త్వరలోనే పట్టుకుంటామని ప్రకటించారు.

తల్లిదండ్రులు లేక రౌడీగా మారిన ప్రశాంత్

పచ్చునూరుకు చెందిన గోపు రమ, రఘునాథరెడ్డికి ఇద్దరు కొడుకులు, పెద్దకొడుకు శ్యాంసుందర్ వరంగల్ లో ఉంటున్నాడు. చిన్నకొడుకు ప్రశాంత్ రెడ్డి (23) ఇంటర్ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నాడు. పదేళ్ల క్రితం తల్లి రమ, ఆరేళ్ల క్రితం తండ్రి రఘునాథరెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. తల్లిదండ్రులను కోల్పోయిన ప్రశాంత్ రెడ్డి ఒంటరిగానే ఇంటివద్ద ఉంటూ గంజాయితో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. సోదరుడి తీరుతో విసుగుచెందిన శ్యాంసుందర్ రెడ్డి ఇల్లు, గ్రామం వదిలి వరంగల్ లో ఉంటున్నాడు. ఒంటరిగా ఉంటున్న ప్రశాంత్ భూ వివాదాల్లో తలదూర్చి సెటిల్మెంట్ లు చేసే క్రమంలో మరో గ్యాంగ్ తో విబేధాలు ఏర్పడి హత్యకు దారి తీసిందని స్థానికులు భావిస్తున్నారు. హత్యపై మాట్లాడేందుకు సోదరుడు నిరాకరించారు.

HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి

తదుపరి వ్యాసం