Hyderabad News : ఉప్పల్ లో గంజాయి గ్యాంగ్ హల్ చల్ - కాలనీవాసులపై కర్రలు, రాళ్లతో దాడి...!
Hyderabad Crime News : ఉప్పల్ లో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. ఓ యువకుడిపై దాడి చేస్తుండగా… అడ్డుకోబోయిన స్థానికులపై కర్రలు, రాళ్లతో దాడికి దిగింది. ఇందులో పలువురు గాయపడ్డారు.
Hyderabad Crime News : ఉప్పల్ లోని శాంతినగర్ లో గంజాయి బ్యాచ్ హల్ చల్ చేసింది. శాంతినగర్ లో కొందరు యువకులు క్రికెట్ ఆడుతూ ఉండగా.....గొడవ జరిగింది. ఈ గొడవలో గంజాయి సేవించిన బ్యాచ్ ఓ యువకుడి పై దాడి చేసింది.
కర్రలతో దాడి….
ఇదేంటని అడిగేందుకు వెళ్లిన స్థానిక బీఆర్ఎస్ నేత ఈగ సంతోష్ తో పాటు మరో ఏడుగురు వ్యక్తులపై ఈ గంజాయి ముఠా కర్రలు, రాళ్లతో విచక్షారహితంగా దాడికి దిగింది. స్థానికుల ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై కూడా గంజాయి బ్యాచ్ దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది.
ఈ ఘటనలో స్థానిక బీఆర్ఎస్ నేత ఈగ సంతోష్ తో పాటు మరికొందరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వీరంతా ఉప్పల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలా ఉంటే శాంతి నగర్ లో గంజాయి ముఠాల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ ముఠాలతో రాత్రి ఉద్యోగాలకు వెళ్లి వచ్చే మహిళలుతో పాటు కాలేజీ విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఒకవైపు గంజాయి,డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసి చర్యలు తీసుకోవాలని చెబుతున్నప్పటికీ......క్షేత్రస్థాయిలో గంజాయి,డ్రగ్స్ ముఠాలు హడలెత్తిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అర్థరాత్రి సమయాల్లో డ్రగ్స్ సేవించి యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. వారికి ఎవరైనా అడ్డు చెప్పినా.… ఇదేంటి అని ప్రశ్నించినా దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్ లో ఈ ఏడాదిలో అనేకంగా జరిగాయి.
గత కొంతకాలంగా నగరంలో గంజాయి,డ్రగ్స్ సరికొత్త రూపాల్లో అందుబాటులోకి వస్తున్నట్లు అధికారుల తనిఖీల్లో తేలింది.చాక్లెట్లు రూపంలో కూడా విద్యార్థులకు విక్రయిస్తునట్టు ఇటీవలే వార్తలు కూడా వచ్చాయి.ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా మరింత పెంచాలి అని నగరవాసులు కోరుతున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై, సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు.