Ganja Transport : లారీ క్యాబిన్ లో సీక్రెట్ అర, గుట్టుగా 492 కేజీల గంజాయి రవాణా-చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
Ganja Transport : ఏపీలో గంజాయి కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలిస్తుండగా భద్రాద్రి జిల్లాల్లో పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 492 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
Ganja Transport : భద్రాద్రి జిల్లాలో గంజాయి వాసనలు రోజూ గుప్పు గుప్పుమంటున్నాయి. సినీ ఫక్కీలో గంజాయిని తరలిస్తున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ప్రతి రోజు కొత్త కోణంలో గంజాయిని తరలించేందుకు స్మగ్లర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎత్తున గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కొత్తగూడెం 3టౌన్ ఎస్సై పురుషోత్తం తన సిబ్బందితో కలిసి ఓల్డ్ డిపో రోడ్డు వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా మధ్యాహ్నం 2.00 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు Ashok leyland DCM వ్యాన్ MH20EL5732 లో క్యాబిన్ వెనుక భాగానికి సమాంతరంగా అనుమానం కలుగకుండా ప్రత్యేకంగా మరొక అరను తయారు చేసి అందులో ప్రభుత్వ నిషేధిత గంజాయి ప్యాకెట్లను అమర్చి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. వ్యానులో నిషేధిత గంజాయిని గుర్తించిన అనంతరం బయటకు తీసి తూకం వేయగా 492 కేజీలు ఉన్నట్లు తేలింది. దీని విలువ సుమారుగా రూ.1.23 కోట్లు ఉంటుందని తేల్చారు. జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి త్రీటౌన్ పోలీసులు ఈ గంజాయిని పట్టుకున్నట్లు త్రీటౌన్ సీఐ శివప్రసాద్ వివరాలను వెల్లడించారు.
ఏపీ టు మహారాష్ట్ర
మహారాష్ట్రకు చెందిన శుభమ్ శరత్ బండారీ, అంజత్ అబ్దుల్ షేక్ అనే ఇద్దరు వ్యక్తులు ఏపీలోని సీలేరు వద్ద పెద్దగొండి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి వద్ద గంజాయిని కొనుగోలు చేశారు. వీరు మహారాష్ట్ర షోలాపూర్ కు చెందిన యోగేష్ అనే వ్యక్తికి గంజాయి అందించేందుకు తరలిస్తుండగా కొత్తగూడెం త్రీ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులకి సోలాపూర్ కి చెందిన యోగేష్ డబ్బులు ఇచ్చి గంజాయిని తీసుకుని రమ్మని చెప్పగా, వీరిరువురు ఈ గంజాయిని వ్యానులో తరలిస్తున్నట్లుగా విచారణలో తేలింది. నిషేధిత గంజాయిని విక్రయించిన రాజు.. కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన యోగేష్, రవాణా చేస్తూ పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టుబడిన ఇద్దరు నిందితులను రిమాండ్ నిమిత్తం జైలుకు తరలించారు. నిషేధిత గంజాయిని రవాణా చేస్తున్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న త్రీ టౌన్, టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం