Child Locked in Car : భద్రాద్రి జిల్లాలో విషాదం, కారులో చిక్కుకుని మూడేళ్ల చిన్నారి మృతి-bhadradri kothagudem district three old child locked in car died with suffocation ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Child Locked In Car : భద్రాద్రి జిల్లాలో విషాదం, కారులో చిక్కుకుని మూడేళ్ల చిన్నారి మృతి

Child Locked in Car : భద్రాద్రి జిల్లాలో విషాదం, కారులో చిక్కుకుని మూడేళ్ల చిన్నారి మృతి

HT Telugu Desk HT Telugu
May 22, 2024 06:37 PM IST

Child Locked in Car : అప్పటి వరకూ తల్లిదండ్రులకు ముద్దు ముద్దుగా మాటలు చెప్పిన మూడేళ్ల చిన్నారి విగతజీవిగా మారింది. ఇంటి ముందు ఉన్న కారులో చిక్కుకుని ఊపిరి ఆడక మృత్యువాత పడింది.

భద్రాద్రి జిల్లాలో విషాదం, కారులో చిక్కుకుని మూడేళ్ల చిన్నారి మృతి
భద్రాద్రి జిల్లాలో విషాదం, కారులో చిక్కుకుని మూడేళ్ల చిన్నారి మృతి

Child Locked in Car : ఆడుకుంటూ వెళ్లి ఆగి ఉన్న కారు ఎక్కిన చిన్నారి అంతలోనే విగతజీవిగా మారింది. బోసి నవ్వులతో కళ్లెదుటే చిందులు వేసిన పసి పాప మృత్యువాత పడటంతో ఆ తల్లిదండ్రుల శోకం సముద్రమే అయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో బుధవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కల్నీష అనే మూడేళ్ల చిన్నారి ఇంటి ముందు ఆడుకుంటూ వెళ్లి అక్కడే నిలిపి ఉంచిన కారు ఎక్కింది. ఎక్కిన వెంటనే కారు డోర్ మూసుకుపోవడంతో అందులోనే చిక్కుకుపోయింది. ఇంట్లో పనిలో ఉన్న తల్లిదండ్రులు, ఇతరులు ఎవరూ ఈ విషయాన్ని గమనించలేదు. దీంతో కాసేపటికి చిన్నారి కనిపించకపోయేసరికి చుట్టుపక్కల ఇళ్లలో వెతకడం ప్రారంభించారు. ఎంత వెతికినా కల్నీష ఆచూకీ దొరకలేదు. చాలాసేపటికి అనుమానం వచ్చి కారు డోర్ తీసి చూశారు. అంతే.. అప్పటికే సమయం మించిపోవడంతో ఆ చిన్నారి కారులో ఊపిరి ఆడక మృత్యువాత పడింది. దీంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. అప్పటి వరకు ముద్దు ముద్దు మాటలతో తమ కళ్ల ముందే ఆడుకున్న చిన్నారి అంతలోనే విగతాజీవిగా మారడంతో వారి శోకాన్ని ఆపడం ఎవరివల్లా కాలేదు. ముక్కుపచ్చలారని పాపాయి చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వారి ఇంటికి వచ్చి చిన్నారి మృతదేహాన్ని సందర్శించి తల్లిదండ్రులను ఓదార్చారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

yearly horoscope entry point

కాస్త ఏమరుపాటు ఘోర ప్రమాదానికి కారణం

అప్పుడప్పుడే నడక నేర్చి బుడి బుడి అడుగులతో సందడి చేస్తున్న మూడేళ్ల చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయి. ఫలితంగా ఆ తల్లిదండ్రులకు తీరని శోకమే మిగలడం విషాదకరం. ఎటు వెళుతున్నారో, వారి అడుగులు ఎటు పడుతున్నాయో తెలియని ఆ వయసులో తల్లిదండ్రుల అప్రమత్తత చాలా అవసరం. ఏదో పనిలో నిమగ్నమై ఆ పసి వాళ్లని వదిలేస్తే ఇలాంటి ఘోరమైన పరిణామాలనే చవిచూడాల్సి వస్తుంది. ఆ తల్లిదండ్రుల కాస్త ఏమరుపాటు ఫలితం జీవితంలోనే తీరని దుఃఖాన్ని నింపింది. ఇంటి ముందు ఆపి ఉంచిన కారు డోర్లు తెరిచి ఉండటం ఈ ప్రమాదానికి అసలు కారణమైంది. చిన్నారి లోపలికి ఎక్కగానే తలుపు మూసుకుపోవడంతో గాలి ఆడని పరిస్థితి నెలకొనడమే ప్రమాదానికి మరో కారణమైంది. ఈ పొరపాట్ల కారణంగా ముక్కుపచ్చలారని చిన్నారి అనంతలోకాలకు వెళ్లిపోయింది. అందుకే చిన్నారులున్న ఇళ్లలో ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం ఎంతైనా అవసరం.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి.

Whats_app_banner