Phone Tapping Case : కరీంనగర్ లో ఫోన్ ట్యాపింగ్ లింకులు..! కలవరపడుతున్న గులాబీ పార్టీ నేతలు
Phone Tapping Case Updates : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ గా అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ ముఖ్య నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో భాగమైన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Phone Tapping Case : గులాబీ గూటికి(BRS) నిలయమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్తబ్దత ఏర్పడింది. రెండు దశాబ్దాల క్రితం పురుడు పోసుకున్న పార్టీ దశాబ్దకాలం పాటు రాష్ట్రాన్ని పాలించింది. అలాంటి పార్టీ అధికారం కోల్పోయి కేవలం నాలుగు నెలలు గడవకముందే ఎదురీత చేయాల్సి వస్తోంది. తాజా పరిణామాలు చూస్తుంటే… పార్టీ శ్రేణులు కలవరపాటుకు గురవుతున్నాయి.
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై పెద్దగా ధీమా లేని బీఆర్ఎస్…. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో మరింత కుదేలయ్యే పరిస్థితి నెలకొంది.ఎదురుదాడికి ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రజల్లో ఇప్పటికే పార్టీ ఇమేజీ డ్యామేజీ అయిందని పార్టీ వర్గాలు అంతర్గతంగా చర్చించుకుంటున్నాయి.
ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని ఇతర జిల్లాల కంటే కొంత మెరుగ్గా ఉన్నా ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్... మరోవైపు బీజేపీ ముఖ్య నేతల ఎదురుదాడితో బీఆర్ఎస్ బేజారవుతోంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు ఒకవైపు నేతలు తంటాలు పడుతుంటే పులి మీద పుట్రలా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొత్తం సూత్రధారి పార్టీ అధినేత కేసీఆర్ అంటూ ఇంటెలిజెన్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నేరాంగీకర ప్రకటన చేయడం మరింత కలకలం రేపుతోంది.
రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్ ఉంటుందా అన్న దానిపై ఇప్పుడు శ్రేణుల్లో చర్చ సాగుతోంది. కీలకమైన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు ముగిసినా ద్వితీయ శ్రేణి నేతలు భారీ ఆశలు పెట్టుకున్న పంచాయతీరాజ్, మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్న తరుణంలో ఈ పరిణామాలు చోటు చేసుకోవడంతో పార్టీలో ఇంకా కొనసాగితే రాజకీయ భవిష్యత్ ఏమిటన్న దానిపై తర్జనభర్జన పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాతో పోన్ ట్యాపింగ్ లింకులు….
కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురి ఫోన్లను ట్యాపింగ్ చేసి కేసీఆర్ కు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేశామంటూ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పేర్కొనడంతో పలువురు నేతలు ఉలిక్కి పడ్డారు. కోరుట్లలో జువ్వాడి నర్సింగరావు ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ ఆ జాబితాలో పేర్కొనడంతో నర్సింగారావు సోమవారం మీడియా ముందుకు వచ్చి ఈ వ్యవహారంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, డీజీపీని కోరుతానన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ కేటీఆర్ కు సన్నిహితుడు కావడం వల్లే ట్యాపింగ్ చేశారని.. అందుకే తాను కోరుట్లలో ఓటమి పాలయ్యానని మండిపడ్డారు. సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేయడం ద్వారా తెర వెనుక కేటీఆర్ కూడా సూత్రధారేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిపై సంజయ్ మంగళవారం ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసినా త్వరలోనే మరిన్ని వివరాలు బయటకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
కవ్వంపల్లి సత్యనారాయణ, గడ్డం వంశీకృష్ణ సహా పలువురి పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తుండగా… తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారంటూ బీజేపీ నేత బండి సంజయ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ ను వెంటనే అరెస్టు చేయాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేయడంతో ప్రభుత్వం ఇప్పుడేం చేయనున్నది అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ పోషించిన పాత్రపై లోక్ సభ ఫలితాల తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించే పక్షంలో మరిన్ని చర్యలు తప్పవనే అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఢీలాపడ్డా గులాబీ శ్రేణులు….
అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటలేక అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ ఒక్కసారిగా ఢీలాపడింది. పలువురు ముఖ్య నేతలు కాంగ్రెస్ లో చేరడం, ఎమ్మెల్యేలు సైతం ఏదో అవసరాల పేరిట సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కావడం బీఆర్ఎస్ ను ఇంకా ఇరకాటంలోకి నెట్టింది. దీనిని కప్పిపుచ్చుకునేందుకు పలు రకాల పుకార్లను ప్రచారం చేసే ప్రయత్నం చేసినా ప్రజల్లో మాత్రం స్పందన లభించలేదని తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నారు. కాళేశ్వరంపై విచారణకు ఆదేశించడం, ఫోన్ ట్యాపింగ్ లో పాల్గొన్న అధికారులను జైలుకు పంపించి సమగ్ర విచారణకు ఆదేశించడం బీఆర్ఎస్ ను అయోమయానికి గురి చేస్తోంది. పాలనా వ్యవహారాల్లో రాజకీయ అవసరాల కోసం ఆయా సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మెడకు గుదిబండలా మారే ప్రమాదం ఉందనే ఆందోళన పలువురు నేతల్లో కనిపిస్తోంది. దీనిని తప్పించుకునేందుకు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడమే ఉత్తమంగా మరికొందరు ముఖ్య నేతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మున్సిపల్ ఎన్నికల నాటికి ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకవర్గాలన్నీ కాంగ్రెస్ లో చేరే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తరువాత బీఆర్ఎస్ పార్టీలో నిశ్శబ్ద వాతావరణం అలుముకుంది. ముఖ్యనేతలు పోలింగ్ గురించి పెద్దగా చర్చించడానికి ఆసక్తి చూపకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. రెండు నియోజకవర్గాలు మినహా మిగతా ఐదు నియోజకవర్గాల్లో పోటీ ఇవ్వలేమన్న భావన ఉంది. ఆవిర్భావం నుంచి 2018 ఎన్నికల వరకు బీఆర్ఎస్ హడావిడి కనిపించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఊహించని షాక్ తగిలింది. అప్పటి నుంచి వరుసగా అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడం లేదు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది, అయితే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నం చేసి బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్ బరిలోకి దిగారు. రెండు నెలల పాటు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఖచ్చితంగా గెలువాలనే పట్టుదలతో సాగారు. బీజేపీ నుంచి బండి సంజయ్. కాంగ్రెస్ నుంచి రాజేందర్ రావు పోటీ చేశారు. అయితే పోలింగ్ అనుకూలంగా లేదని నేతల్లో చర్చ సాగింది. దీంతో ముఖ్య నేతలు ఈ విషయం గురించి చర్చించటం లేదు.
బలమున్నా బలహీనంగానే..
ఈ నియోజకవర్గంలో ముగ్గురు ఎమ్మెల్యేలు, బలమైన నేతలు ఉన్నా గట్టిగా పోటీ ఇవ్వలేకపోయామనే భావన వ్యక్తమవుతోంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు ఉండగా సిరిసిల్ల, హుజురాబాద్ నియోజకవర్గాల్లోనే బీఆర్ఎస్ కి అనుకూలంగా ఓట్లు పడ్డాయని చెబుతున్నారు. మిగతా ఐదు నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదని తెలుస్తోంది.
కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో కూడా అనుకున్న స్థాయిలో ఓట్లు బీఆర్ఎస్ కి రాలేదనే చర్చ సాగుతోంది. పోలీంగ్ కు ముందు చొప్పదండి, సిరిసిల్ల, హుస్నాబాద్, మానకొండూరు, హుజురాబాద్ లో మెజార్టీ ఓట్లు వస్తాయని అంచనా వేయగా, పోలింగ్ సరళి అందుకు విరుద్ధంగా మారిందన్న టాక్ వినిపిస్తోంది.
హుస్నాబాద్ లో, కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ నెలకొన్నట్లు తెలిసింది. మానకొండూరు, చొప్పదండిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోరు సాగింది. దీంతో అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ కు ఓట్లు రాలేదనే అభిప్రాయం ఉంది. అయినా బీఆర్ఎస్ పై అభిమానంతో మెజారిటీ వర్గాలు సైలెంట్ గా తమకు ఓట్లు వేసి గెలిపిస్తారనే ధీమాను కనబరుస్తున్నారు.
త్రిముఖ పోరులో తమకే లాభం జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు ధీమాతో ఉన్నారు. అయితే క్షేత్రస్థాయిలో నివేదికలు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే వినోద్ కుమార్ ఓటమి చవిచూశారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితిల్లో ఎలాంటి ఫలితం వస్తుందనే విషయమై పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి పార్టీ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా మారింది.
రిపోర్టింగ్ - HT Telugu ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి.
సంబంధిత కథనం