Analysis: అయ్యో! ఏమిటి బీఆర్‌ఎస్ పరిస్థితి? కేసీఆర్ ఏం చేయబోతున్నారు?
‘తెలంగాణ అస్తిత్వంతో ముడిపడిన ప్రాంతీయ రాజకీయ శక్తి అయినందునే ‘‘అయ్యో! ఏమిటి బీఆర్‌ఎస్ పరిస్థితి?’’ ‘ఎలా ఉంటుంది భవిష్యత్తు?’ అని ఒకసారైనా అనుకోకుండా సగటు తెలంగాణ వాదులెవరూ ఉండలేరు!’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ నుంచి పొలిటికల్ అనలిస్ట్ దిలీప్ రెడ్డి విశ్లేషణ ఇదీ.
భారత రాష్ట్ర సమితి - బీఆర్‌ఎస్‌ను బాగుచేసే మరమ్మత్తు పనుల కోసం ఎన్నికల ఫలితాల దాకా వేచి చూడాల్సిన పనిలేదు. వెంటనే ప్రారంభించవచ్చు. దాదాపు పాతికేళ్ల ప్రస్తానంలో ఓటమెరుగని పార్టీకి దెబ్బ మీద దెబ్బ! రెండు వరుస ఎన్నికల్లో బోల్తాపడ్డ పార్టీని ఎలా బాగు చేస్తారు? ఏం చేస్తే బీఆర్‌ఎస్ బాగుపడి, బతికి, బట్టకడుతుంది? అన్నది పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఆధారపడి ఉంటుంది. మిగతా ఎవరైనా... నిమిత్తమాత్రులే!
తెలంగాణ అస్తిత్వంతో ముడిపడిన ప్రాంతీయ రాజకీయ శక్తి అయినందునే ‘‘అయ్యో! ఏమిటి బీఆర్‌ఎస్ పరిస్థితి?’’ ‘ఎలా ఉంటుంది భవిష్యత్తు?’ అని ఒకసారైనా అనుకోకుండా సగటు తెలంగాణ వాదులెవరూ ఉండలేరు!
పదమూడేళ్లు తెలంగాణ సాధనకు ఉద్యమ వేదికగా, రాష్ట్రం ఏర్పడ్డాక పదేళ్లు అధికారపక్షంగా ఓ వెలుగు వెలిగిన బీఆర్‌ఎస్ రాజకీయ దీపం ఇప్పుడు మసకబారింది. ఓట్ల గణాంకాల్లో ప్రజాదరణకు దూరమైంది. ఎన్నికల రాజకీయాల్లో వరుస ఓటములతో చతికిలపడింది. దీని వెనుక సవాలక్ష కారణాలు ఉండొచ్చు, కానీ ‘కేసీఆర్’ అన్న మూడక్షరాలకు మించిన ప్రభావకం ఇంకేమీ ఉండదు.
‘నిన్నటి పూర్వవైభవానికి ఎంతగా కేంద్ర బిందువో, నేటి దయనీయ పరిస్థితికీ అంతే కారకుడు కేసీఆర్! కనుకే, రేపటి పునరుద్దరణ కూడా ఆయన చేతుల్లో, చేతల్లోనే ఉంది’ అన్నది తిరుగులేని సత్యం! బీఆర్‌ఎస్ భవిష్యత్తుకు సంబంధించి రాగల తదుపరి నిర్ణయాలవైపు కేటీఆర్, హరీష్‌రావ్, ఆ మాటకొస్తే మరెవరైనా... నీలాగా, నాలాగా నిరీక్షించాల్సిందే!
మోటర్లు నీట మునిగి, పిల్లర్లు ఇసుకలో కృంగిన... కాళేశ్వరం కన్నా కూడా సంక్లిష్టమైన మరమ్మత్తిది! ఇదీ, ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి-టీఆర్‌ఎస్‌గా ఉండి, తదనంతర పరిణామాల్లో జాతీయ పార్టీ అయిన బీఆర్‌ఎస్ ఇవాళ్టి పరిస్థితి!
లోక్‌సభలో బాణీ వినిపించదా?
పూర్వరూపంలోని టీఆర్‌ఎస్ ఏర్పడ్డ తర్వాతి తొలి ఎన్నికల (2004) నుంచీ, లోక్‌సభలో ఆ పార్టీకి నిరవధికంగా ప్రాతినిధ్యం లభిస్తూ వచ్చింది. 2004లో అయిదుగురు గెలిచి, కే.చంద్రశేఖరరావు, ఏ.నరేంద్ర ఇద్దరు మంత్రులయ్యారు. ‘విపక్షంలో ఉండి పోరాడి కదా రాష్ట్రం సాధించాల్సింది, ప్రభుత్వంలో చేరారు ఎందుకు?’ అన్న వాళ్లకు కేసీఆర్ చమత్కారమైన సమాధానం చెప్పేవారు. ‘రేపు ఎట్టిపరిస్థితిలో తెలంగాణ ఏర్పడుతుంది. వాటా పంపకాలు జరిగేటప్పుడు దగ్గరుండి చూసుకోవాలంటే మనం పవర్ కారిడార్లో ఉండాల్సిందే’ అనే వారు.
ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు ఒక ప్రాంతీయ రాజకీయ శక్తికి లోక్‌సభలో గొంతు వినిపించడానికి ప్రాతినిధ్యం ఎంతటి అవసరమో ఆయనకి బాగా తెలుసు. పార్లమెంటు సాక్షిగా పోరాడి సాధించుకున్న రాష్ట్రానికి లోక్‌సభలో ప్రాతినిథ్యమే లేని పరిస్థితి వస్తే ఎట్లా?
2009లో కేసీఆర్‌తో పాటు విజయశాంతి గెలిచారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లోఅత్యధికంగా 11 మంది ఎంపీలు గెలుపొందారు. 2018 లో జరిగిన అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో 88/119 స్థానాలు గెలిచి గొప్ప విజయం సాధించిన ఆనాటి టీఆర్‌ఎస్, వెనువెంటనే వచ్చిన 2019 లోక్‌సభ ఎన్నికలపై గంపెడు ఆశలు పెట్టుకుంది. ‘సారు-కారు-పదహారు’ అని ప్రచారాన్ని ఎంతగా హోరెత్తించినా.. 9 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే సీటు గెలిచినా, అనూహ్యంగా బీజేపీ ఆ ఎన్నికల్లో నాలుగు లోక్‌సభ స్థానాలు గెలిచింది. ఆ ఊపు అలా కొనసాగి, నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భంగపడినా.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలు వచ్చేటప్పటికి బీజేపీ మళ్లీ పుంజుకుంది. రాష్ట్రంలో పాలకపక్షమైన కాంగ్రెస్‌తో పోటీ పడుతోంది. 17లో ఆధిక్య స్థానాలు నాకా నీకా అన్నట్టుంది వారిద్దరి మధ్య పోరు! బీఆర్‌ఎస్‌కు ఒక స్థానం కూడా రాదు, లోక్‌సభలో ఈ సారి ప్రాతినిధ్యమే ఉండదని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నాయకులు బల్లచరిచి చెబుతున్నారు.
ఆత్మశోధన జరగాలి
ఉద్యమ పార్టీగా గొప్ప చరిత్ర కలిగి, సంక్షేమాభివృద్ది కార్యక్రమాలను సమర్థంగా మేళవించిన తర్వాత కూడా కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఓడాము? అన్నది పార్టీ నాయకత్వం పరిశీలించాలి. ‘సమర్థంగా పాలించాం, మళ్లీ మేమే వస్తాం’ అనుకున్న దరిమిళా.. ఘోరంగా ఓడిపోవడానికి అనేక కారణాలున్నాయి. నియామకాలు జరుపక, ఉద్యోగాల్లేక యువత అల్లాడిపోయారు, ద్రవ్యోల్బణం, పన్నులతో నిత్యావసరాల ధరలు అసాధారణంగా పెరిగి జనం అలమటించారు.
ధరణి వల్ల దగాపడ్డామని భూయజమానులు నలిగిపోయారు. భావాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ లేదని, నిరసన తెలిపే వెసలుబాటు దొరకదని, ప్రశ్నిస్తే నిర్భందించే అప్రజాస్వామిక వాతావరణం ప్రబలుతోందని ప్రజా సమూహాల్లో బలంగా ప్రచారం జరిగింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత దాన్ని సమగ్రంగా సమీక్షించుకోకుండా, ఆత్మశోధన లేకుండానే బీఆర్‌ఎస్ పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల బరిలో దిగింది. ఉద్యమం, దాని పురిటి వాసన ఉన్నంత కాలం ఎన్నికలన్నింటినీ నల్లేరుపై బండి నడకలా సాగించిన బీఆర్‌ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలి ఓటమిని చవిచూసింది.
‘కాంగ్రెస్ బూటకపు హామీలను ప్రజలు నమ్మి అటువైపు మొగ్గారు తప్ప మమ్మల్ని వదిలించుకోలేదు. పాలిచ్చే ఆవును వదిలి తన్నే దున్నపోతును ఎన్నుకున్నారు’ అంటూ ప్రజల విజ్ఞతనే ప్రశ్నార్థకం చేసే స్థితికి బీఆర్‌ఎస్ నాయకత్వం వెళ్లింది. ఎన్నికల్లో వ్యక్తమైన ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ, తమ వైపు నుంచి జరిగిన తప్పిదాల వాస్తవాలను అంగీకరిస్తూ, నిజాయితీగా సమీక్షించుకుంటే పార్టీ పరిస్థితి ఇంకాస్త భిన్నంగా ఉండేదేమో!
స్థానికంగా శాసనసభ్యుల నిర్వాకాలు, ప్రజల్లో వారు కోల్పోయిన విశ్వాసం, నియోజకవర్గాల్లో ప్రబలిన నియంతృత్వ పోకడలు… వీటన్నిటికి సంబంధించిన నిజాలను ముచ్చటించుకొని తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఉంటే ప్రజలు మన్నించి ఉండే వారేమో!
ఇప్పటికైనా పార్టీని మెరుగుపరచుకోవడానికి ఈ క్షేత్ర పరిస్థితులన్నీ ఉపయోగపడేవే! కేసీఆర్ బిడ్డ కవిత ఇరుక్కున్న లిక్కర్ కేసు, మరో పక్క ఫోన్ ట్యాపింగ్‌తో సొంత పార్టీ ఎమ్మెల్యేలపైన, ఇత నాయకులపైనే నిఘా పెట్టడం, అది విపరీత పరిణామాలకు దారితీసిన వైనం... ఇవన్నీ పార్టీకి ఎంతో చెడ్డపేరు తెచ్చాయి. నిజాయితీతో కూడిన ఆత్మశోధనలో ఇవన్నీ ఎజెండా కావాలి.
చక్కటి అవకాశం
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు బీఆర్‌ఎస్ నాయకత్వానికి ఇప్పుడొక గొప్ప అవకాశం దొరికినట్టయింది. ఇంతకు ముందు ఆ అవకాశం లేదు. పుష్కరకాలానికి పైగా సాగిన ఉద్యమకాలంలో ఆ అవసరం లేకపోయింది. తెలంగాణ కోసం కలిసి వచ్చే వారంతా ‘మనవాళ్లే’ అనే సామూహిక భావన ఉండింది. అప్పటికదే సరైన పంథా!
ఇక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఎన్నికలు (2014) వచ్చి, నేరుగా ప్రభుత్వమే ఏర్పాటు చేశారు. అప్పుడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే అవసరం కానీ, సమయం కానీ పార్టీ నాయకత్వానికి కనబడలేదు. ఆ లోపం గత అసెంబ్లీ ఎన్నికల్లో కొట్టచ్చినట్టు కనిపించింది. దానికి తోడు... 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇతర పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో సహా వివిధ స్థాయి నాయకుల్ని పార్టీలోకి ఆకర్శించి-ఆహ్వానించిన తీరు మనందరికీ తెలిసిందే!
సుదీర్ఘకాలంగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వాళ్లు, కొత్తగా వచ్చి చేరిన వారి మధ్య కొంత అనారోగ్యకరమైన స్పర్థ ఏర్పడింది. ఎన్నికల రాజకీయాల్లో పార్టీకి అది ఎంతగానో నష్టం కలిగించింది. పనితీరు బాగు, పరిస్థితి మెరుగుతో ప్రజాదరణ పెంచుకోని సుమారు 20 నుంచి 30 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్టు కోస్తానని పార్టీ అధినేత, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు. కానీ, ఇద్దరు, ముగ్గుర్ని తప్ప మిగతా అందరికీ పాతవాళ్లకే టిక్కెట్లు ఖరారు చేశారు.
దాంతో, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తగ్గకపోగా పెరిగింది. సంస్థాగతంగా పార్టీ బలోపేతమై లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే వ్యవస్థ లేక నష్టపోయింది. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇంకాస్త ముందుకు జరగొచ్చు అంటున్నారు. అదే జరిగితే యేడాది సమయం ఉంటుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా నిర్మించుకొని, బలోపేతం చేసుకునే అవకాశం బీఆర్‌ఎస్ నాయకత్వానికి లభిస్తుంది.
అన్నీ ఆయనే....
భారత రాష్ట్ర సమితిని ఇకపై ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, అనే మౌలికాంశం నుంచి మళ్లీ జనాదరణతో పార్టీని పూర్తిస్థాయిలో పరిపుష్టం చేయాలి అనే వరకు అన్నీ కేసీఆరే! రాష్ట్రం సాధించుకున్నది ఆయన ఒక్క కుటుంబం కోసం కాదనే రాజకీయ ప్రత్యర్థుల విమర్శ, అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజల్లోకి బలంగా వెళ్లింది. కుటుంబం విషయంలో ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవాలి? అన్నది పూర్తిగా ఆయన నిర్ణయం, వ్యవహార శైలి పైనే ఆధారపడి ఉంటుంది.
ఉద్యమాన్ని ఉదృతపరచి, పోరాటాన్ని నిర్మించి, లక్ష్య సాధన తర్వాత ఫక్తు రాజకీయ పార్టీగా మలచి, దాన్ని టీఆర్‌ఎస్ నుంచి బీఆర్‌ఎస్‌గా మార్చిన కేసీఆర్… తెలంగాణతో విడదీయరాని అనుబంధమే! తెలంగాణ అస్తిత్వ పోరాట చరిత్రలో చెరిగిపోని సంతకమే! అయితే, సమకాలీన పరిస్థితుల్ని నిజాయితీగా అంగీకరిస్తూ… ఒక ప్రాంతీయ రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్/టీఆర్‌ఎస్ ను పునరుజ్జీవింప చేయాల్సిన బాధ్యత, కర్తవ్యం ఆయన మీదుంది.
- దిలీప్‌రెడ్డి,
పొలిటికల్ అనలిస్ట్, పీపుల్స్‌పల్స్ రీసెర్చ్‌సంస్థ,
Mail: dileepreddy.ic@gmail.com, Cell No: 9949099802
(Disclaimer: వ్యాసంలో తెలియపరిచిన వ్యూహాలు, అభిప్రాయాలు, విశ్లేషణలు వ్యాసకర్త వ్యక్తిగతం. హిందుస్తాన్ టైమ్స్‌వి కావు)