Telangana ACB : తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 21 రోజుల్లో 12 కేసులు.. అవినీతి అధికారులకు చెమటలు!-telangana acb arrests corrupt officials in 12 cases in 21 days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Acb : తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 21 రోజుల్లో 12 కేసులు.. అవినీతి అధికారులకు చెమటలు!

Telangana ACB : తెలంగాణలో ఏసీబీ దూకుడు.. 21 రోజుల్లో 12 కేసులు.. అవినీతి అధికారులకు చెమటలు!

Basani Shiva Kumar HT Telugu
Nov 21, 2024 08:27 PM IST

Telangana ACB : తెలంగాణలో ఏసీబీ దూకుడు మీద ఉంది. అవినీతి అధికారులకు చెమటలు పట్టిస్తోంది. వరుసగా కేసులు నమోదు చేస్తూ.. అవినీతి అధికారుల ఆటకట్టిస్తోంది. అయినా.. అధికారులు మాత్రం మారడం లేదు. లంచాలకు మరిగి పేదల రక్తం పీలుస్తున్నారు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు.

ఏసీబీకి చిక్కిన వర్ని ఎస్సై
ఏసీబీకి చిక్కిన వర్ని ఎస్సై (@TelanganaACB)

ఏసీబీ.. ఈ మాట వింటే అవినీతి అధికారులు వణికిపోతున్నారు. ఏసీబీ అంత దూకుడు మీద ఉంది. కేవలం 21 రోజుల్లో 12 కేసులు నమోదు చేసి ఏసీబీ అధికారులు రికార్డ్ సృష్టించారు. బాధితులకు అండగా నిలుస్తున్నారు. తాజాగా.. తెలంగాణలో ఇద్దరు అవినీతి అధికారులను పట్టుకున్నట్టు ఏసీబీ వెల్లడించింది.

21 రోజుల్లో 12..

21.11.2024న సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆత్మకూరు పంచాయతీ కార్యదర్శి పి.సచిన్ కుమార్‌ను ఏసీబీ పట్టుకుంది. ఇంటి నంబర్ కోసం లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

21.11.2024న మహబూబాబాద్ జిల్లా సర్వే, భూ దస్తవేజుల కార్యాలయంలో పనిచేసే సీనియర్ డ్రాఫ్ట్స్‌మెన్ కళంగి జ్యోతి క్షేమ బాయిని ఏసీబీ పట్టుకుంది. భూమికి సంబంధించి టిప్పన్ రికార్డును ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసింది. రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కింది.

20.11.2024న హైదరాబాద్‌లోని మలక్‌పేటలో స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్‌లు (మహబూబ్ బాషా, సోమశేఖర్)ను ఏసీబీ పట్టుకుంది. బ్యాంక్ అకౌంట్‌ను అన్‌ఫ్రీజ్ చేయడానికి లెటర్ ఇచ్చేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. బాధితుడు రూ.50 వేలు ఇస్తుండగా ఏసీబీ పట్టుకుంది.

20.11.2024న హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో జీహెచ్ఎంసీ శానిటరీ ఉద్యోగులు ఎండీ సలీం ఖాన్, జి.గణేష్‌ను ఏసీబీ పట్టుకుంది. కాఫీ దుకాణంపై పన్ను విధించకుండా ఉండేందుకు వీరు రూ.60 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు రూ.25 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

19.11.2024న పెద్దపల్లి జిల్లా అంతరగాం మండల తహసీల్దార్ వి.రమేష్ ఏసీబీకి చిక్కారు. పోలీసులు పట్టుకున్న ట్రాక్టర్‌ను విడుదల చేయడానికి లంచం డిమాండ్ చేశారు. రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ ద్వారా రూ.12 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వారిని చూసి డబ్బులు బయటకు విసిరేసి పారిపోయాడు. అతన్ని పట్టుకున్నారు. గతంలో కూడా రమేష్‌ను ఏసీబీ పట్టుకుంది.

18.11.2024న గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో పంచాయతీ రాజ్ ఇంజనీర్ పాండురంగారావును ఏసీబీ పట్టుకుంది. రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

14.11.2024న కామారెడ్డి జిల్లా లోని లింగంపేటలో ఎస్సై పి.అరుణ్, స్టేషన్ రైటర్ రామస్వామిని ఏసీబీ పట్టుకుంది. రూ.10 వేలు లంచం తీసుకుంటూ వీరు ఏసీబీకి చిక్కారు.

13.11.2024న నిర్మల్ పురపాలక కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎంఏ షకీర్ ఖాన్ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

08.11.2024న నిజామాబాద్ జిల్లా వర్ణి ఎస్సై బి. కృష్ణ కుమార్ ఏసీబీకి చిక్కాడు. బాధితుడి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకుంది.

07.11.2024న మహబూబ్‌నగర్‌ జిల్లా విద్యాధికారి ఆటి రవీందర్‌ను ఏసీబీ పట్టుకుంది. పదోన్నతికి సంబంధించి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

05.11.2024న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి పుల్లయ్యను ఏసీబీ పట్టుకుంది. విద్యుత్తు మీటర్ కోసం ఎన్వోసీ ఇవ్వడానికి పుల్లయ్య లంచం డిమాండ్ చేశారు.

02.11.2024న ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల తహశీల్దార్, జండాగూడెం, పోచంలొద్ది గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.శేఖర్‌లను ఏసీబీ పట్టుకుంది. సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన చెక్కును ఇవ్వడానికి రూ.12 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Whats_app_banner