KTR : కూటములకు కాలం చెల్లింది, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా- కేటీఆర్-karimnagar brs leader ktr criticized congress bjp brs winning most mp seats ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Ktr : కూటములకు కాలం చెల్లింది, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా- కేటీఆర్

KTR : కూటములకు కాలం చెల్లింది, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా- కేటీఆర్

HT Telugu Desk HT Telugu
May 14, 2024 09:16 PM IST

KTR : ఎన్డీఏ, ఇండియా కూటములకు కాలం చెల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రాంతీయ పార్టీలే తమ హావా కొనసాగించబోతున్నాయని తెలిపారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో గెలుస్తోందన్నారు.

కేటీఆర్
కేటీఆర్

KTR : పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటములకు కాలం చెల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. ప్రాంతీయ పార్టీల హావానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పుట్టించామని.. తెలంగాణాలో ఆ రెండు పార్టీల కంటే ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్, బీజేపీ పారాషూట్ నేతలకు టికెట్లు ఇచ్చాయని విమర్శించారు. ఆ రెండు పార్టీల అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత, మా అభ్యర్థుల పట్ల సానుకూలత బీఆర్ఎస్ కు కలిసి వచ్చి మంచి ఫలితాలు సాధించబోతున్నామని తెలిపారు. హన్మకొండ, రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, తోట ఆగయ్యతో కలిసి సిరిసిల్లలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎన్నికల్లో అనుసరించిన తీరుపై మండిపడ్డారు. 17 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీకి దీటుగా బీఆర్ఎస్ పోటీ ఇచ్చిందని తెలిపారు. ఆ రెండు పార్టీల రాజకీయం చూస్తే దిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు అన్నట్లుందని విమర్శించారు. కాంగ్రెస్ కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి లాంటి ఆరేడు స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీజేపీ సహకరించిందని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించడానికి కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి ఎక్కువ కష్టపడ్డారని తెలిపారు. ఆ రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా దేశంలో బిజేపి నేతృత్వంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలకు స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం లేదన్నారు. ప్రాంతీయ పార్టీలే తమ హవా కొనసాగించబోతున్నాయని తెలిపారు. ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తులుగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. రెండు జాతీయ పార్టీలు సన్నాయి నొక్కులు నొక్కడానికి... కేసీఆర్ ను విమర్శించడానికి మాత్రమే పరిమితమని తేలిందన్నారు. చివరకు తమ పార్టీ నాయకులను కొందరిని గుంజుకున్నా గులాబీ సైన్యం పటిష్టంగా పనిచేసిందన్నారు.

టైం పాస్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఐదు నెలలు టై పాస్ చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కొన్నిరోజులు శ్వేత పత్రాలతో మరికొన్ని రోజులు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డపై ఇంకొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ తో ప్రజల దృష్టిని మళ్లించడానికి చిల్లర మిల్లర రాజకీయాలు చేసిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పరిస్థితి బాగుండదన్నారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ పై అసాధారణమైన వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని 420 హామీలు అమలు చేయకపోతే ప్రజాక్షేత్రంలో దారుణమైన పరాభవం కాక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కొత్త జిల్లాలను రద్దు చేయాలని...కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేయాలని చేస్తున్న చిల్లర ప్రయత్నాలు ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను చూపించాయని తెలిపారు. వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. బోనస్, కరెంట్, రైతుబంధు విషయంలో చేసిన మోసంతో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి వచ్చిన వ్యతిరేకత ఓట్ల రూపంలో కనబడే అవకాశం కనిపిస్తుందన్నారు. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టు వేసినప్పటికీ నమ్మలేని పరిస్థితి వచ్చిందన్నారు. కోటి 67 లక్షల మంది మహిళలకు వందరోజుల్లో రూ. 2500 ఇస్తా అని ఇవ్వకపోవటంతో మహిళలు కోపంగా ఉన్నారని తెలిపారు. చివరకు మంచినీళ్ల విషయంలో కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి తేవటం మహిళల్లో ఆగ్రహానికి కారణమైందన్నారు. అన్ని వర్గాలు కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఉన్నాయని తెలిపారు. బీజేపీ మీద కూడా ప్రజల్లో సానుకూలత లేదని నలుగురు ఎంపీలు ఉండి పదేళ్లు రాష్ట్రానికి ఏం చేయలేదన్న కోపం ప్రజల్లో ఉందన్నారు. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాలు, సిలిండర్ ధరల పెంపు కారణంగా ప్రజల్లో మోదీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందని తెలిపారు. బీఆర్ఎస్ సామాజిక న్యాయాన్ని పాటించి 12 జనరల్ స్థానాల్లో 50 శాతం బీసీలకే టిక్కెట్లు ఇచ్చామని చెప్పారు. సామాజిక సమతుల్యతతోపాటు ప్రజలతో సంబంధాలు ఉన్న వారికే టిక్కెట్లు ఇవ్వడంతో మంచి ఫలితాలు వస్తాయని బావిస్తున్నామని తెలిపారు.

తెలంగాణకు గులాబీ సైన్యం శ్రీరామరక్ష

బీఆర్ఎస్ కు కార్యకర్తలే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలందరికీ అర్థమయ్యిందన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందని భావించారని చెప్పారు. ఎవ్వరెన్ని కుట్రలు చేసినా గులాబీ సైన్యం శక్తివంచన లేకుండా పని చేయడంతోనే ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు పార్టీ నాయకులందరి గుండెల నిండా ఆత్మవిశ్వాసం కనబడుతోందని తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు సన్నాయి నొక్కులు నొక్కుతూ, కేసీఆర్ ను తిట్టేందుకే ఉన్నాయని ప్రజలు గ్రహించారని తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించిన గులాబీ సైనికులకు ప్రత్యేక ధన్యవాదాలు.. ఊహించని విధంగా ఐదు నెలల క్రితం ఓటమి పాలైనప్పటికీ తిరిగి ఎంతో కష్టపడి పనిచేసిన వారికి కేటిఆర్ కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల నుంచి వచ్చిన ఆదరణతో పార్టీ పదికాలాల పాటు ఉంటుందన్న ఉత్సాహం జోష్ వచ్చిందన్నారు. ఈ జోష్ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ ఎన్నికలకు బలమైన పునాది కానున్నదని తెలిపారు.

HT Telugug Corresponden K.V.REDDY, Karimnagar

WhatsApp channel