Phone Tapping Case : మూడోసారి బీఆర్ఎస్ కు అధికారమే లక్ష్యంగా పనిచేశాం- భుజంగరావు వాంగ్మూలంలో సంచలనాలు
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడోసారి బీఆర్ఎస్ అధికారమే లక్ష్యంగా పనిచేశామని, బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్మెంట్లు చేశామని ఇంటెలిజెన్స్ మాజీ ఏఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
Phone Tapping Case : తెలంగాణలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, ప్రముఖుల లక్ష్యంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన అధికారులు ఒక్కొక్కరిగా నోరు విప్పుతున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కృష్ణరావు వాంగ్మూలంలో... బీఆర్ఎస్ పార్టీ నేతల ఒత్తిడితో ఆ పార్టీ నేతలతో పాటు బీఆర్ఎస్ ను విమర్శించే వారిపై నిఘా పెట్టినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిపై ట్రోలింగ్ తో సహా వ్యాపారుల బెదిరింపులు, ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు డబ్బు ఎన్నికల అధికారులకు పట్టించడం వ్యవహారాలన్నింటికి ఫోన్ ట్యాపింగ్ మూలమని రాధా కృష్ణరావు ఒప్పుకున్నారు. దీంతో 2022లో జరిగిన ఎమ్మెల్యే కొనుగోలు కేసును అడ్డం పెట్టుకుని ఎమ్మెల్సీ కవితను దిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని రాధాకృష్ణరావు తెలిపారు. తాజాగా ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్మెంట్లు
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు పక్కా ప్రణాళిక వేశామని ఇంటెలిజెన్స్ మాజీ ఏఎస్పీ భుజంగరావు వాంగ్మూలం ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్మెంట్లు చేశామని ఒప్పుకున్నారు. ఎన్నికల సమయంలో రెండు ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి భారీగా డబ్బును టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించామన్నారు. రియాల్టర్ సంధ్యా శ్రీధర్ రావు రూ.13 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్స్ కొనుగోలు చేసేలా చేశామన్నారు. ఎవరైనా తమ మాట వినకపోతే కేసులతో ఇబ్బంది పెడతామని హెచ్చరించామని భుజంగరావు స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేశామన్నారు. ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాల నేతలు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామని ఒప్పుకున్నారు. అలాగే వీరి వాహనాలను ట్రాక్ చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఉపఎన్నికల సమయంలో బీజేపీ, కాంగ్రెస్ మద్దతుదారుల ఫోన్లు ట్యాపింగ్ చేశామన్నారు. ఈ వ్యవహారం అంతా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, ఎస్వోటీ, టాస్క్ ఫోర్స్ సాయంతోనే చేశామని భుజంగరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు.
పేపర్ల లీకేజీ వ్యవహారంలో
దీంతో పాటు తెలంగాణలో సంచలనమైన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై అప్పటి మంత్రి కేటీఆర్ ను విమర్శించిన వారి ఫోన్లను ట్యాప్ చేశామని ఇంటెలిజెన్స్ మాజీ ఏఎస్పీ భుజంగరావు తెలిపారు. కామారెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డిపై పై నిఘా పెట్టామని పేర్కొన్నారు.
రాధా కృష్ణరావు వాంగ్మూలం
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణ రావు.. రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అంగీకరించినట్లు తెలిసింది. అలాగే ఎవరి ఫోన్ల ట్యాప్ చేశారో ఆ జాబితా బయటకు వచ్చింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ పోలీస్ రాధా కృష్ణరావు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలువురు రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని విస్తృతంగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో ఇటీవల అరెస్టైన రాధా కృష్ణరావు తన వాంగ్మూలంలో కీలక అంశాలు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్
ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నిఘా పెట్టిన వారిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు (కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలు ఉండడంతో), స్టేషన్ ఘన్ పూర్ అప్పటి ఎమ్మెల్యే రాజయ్య(కడియం శ్రీహరితో విభేదాలు), తాండూరు ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి దంపతులపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎన్టీవీ నరేంద్ర చౌదరి, ఏబీఎన్ రాధాకృష్ణ, నాగార్జునసాగర్‌కు చెందిన జానా రెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి సహా పలువురు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులపై నిఘా పెట్టారు. గద్వాల సరిత తిరుపతయ్య, కోరుట్ల జువ్వాడి నర్సింగరావు, అచ్చంపేటకు చెందిన వంశీ కృష్ణ వ్యవహారాలపై నిఘా పెట్టి వీరి సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించారు.
సంబంధిత కథనం