TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు, వందకు చేరిన అరెస్టులు-tspsc paper leak case police arrested man returned from new zealand ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు, వందకు చేరిన అరెస్టులు

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు, వందకు చేరిన అరెస్టులు

HT Telugu Desk HT Telugu
Nov 05, 2023 03:41 PM IST

TSPSC Paper Leak : టీఎస్పీఎస్పీ పేపర్ల లీకేజీ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టులు 100కు చేరారు.

టీఎస్పీఎస్సీ
టీఎస్పీఎస్సీ

TSPSC Paper Leak : తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో తాజాగా మరొక వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ చేసిన వారి సంఖ్య వందకు చేరుకుంది. కాగా సిట్ అధికారులు అరెస్ట్ చేసిన వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉండటం విశేషం. వీరందరిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 381,409,420,411,120 ( బి) ,201 తో పాటు ఐటీ యాక్ట్ లోని వివిధ సెక్షన్ల కింద సిట్ అధికారులు కేసులు నమోదు చేశారు.

న్యూజిలాండ్ నుంచి వచ్చిన వ్యక్తి అరెస్ట్

టీఎస్పీఎస్సీ కార్యాలయంలో నెట్వర్క్ అడ్మిన్ గా పని చేస్తున్న రాజశేఖర్ రెడ్డి న్యూజిలాండ్ లో ఉద్యోగం చేస్తున్న తన బావమరిది సాన ప్రశాంత్ (31) కు ప్రశ్నపత్రం చెరవేసినట్లు పోలీసులు గుర్తించారు. న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్ కు వచ్చి గ్రూప్ 1 పరీక్ష కూడా ప్రశాంత్ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం న్యూజిలాండ్ నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి నిందితుడు ప్రశాంత్ వచ్చాడు. పక్కా సమాచారం అందుకున్న సీసీఎస్ పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసి శనివారం కోర్టు ఎదుట హాజరు పరిచారు. విచారించిన కోర్టు ప్రశాంత్ కు రిమాండ్ విధించడంతో అతన్ని చంచల్ గూడా జైలుకు తరలించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు.

తీగ లాగితే డొంక కదిలింది

ఈ కేసులో రాజశేఖర్ రెడ్డి, ప్రవీణ్ లను కీలక నిందుతులుగా పోలీసు దర్యాప్తులో గుర్తించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పలువురు అభ్యర్థులకు ఎక్కువ మొత్తానికి ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే ప్రశ్నాపత్రాలను అమ్మినవారిని, కొనుగోలు చేసిన వారందరినీ ఇప్పటికే పోలీసులు జైల్లో పెట్టారు. కాగా న్యూజిలాండ్ లో ఉండే రాజశేఖర్ రెడ్డి బావ మరిదికి సాన ప్రశాంత్ కు తెలంగాణ పోలీసులు గతంలో నోటీసులు పంపగా అతని దగ్గర నుంచి సరైన సమాధానం రాకపోవడంతో లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు. దీంతో అతను తాజాగా హైదరాబాద్ కు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడు రమేష్ ఏఈఈ, డీఏఓ పరీక్షలకు సంబంధించి సుమారు 25 ప్రశ్నాపత్రలను లీక్ చేశాడని దర్యాప్తులో వెల్లడైంది. అంతే కాకుండా ఏఈఈ పరీక్షల్లో ఏడుగురు అభ్యర్థులకు పరీక్షా హాల్ లోకి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా డీఈ రమేష్ సమాధానాలు అందచేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విధంగా పేపర్ లీక్ కేసులో తీగ లాగే కొద్ది డొంక కదులుతుంది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

Whats_app_banner