తెలుగు న్యూస్  /  Telangana  /  Jana Reddy Supports Revanth Reddy Leadership Says Leaders Should Unite To Win In Next Elections

Jana Reddy on Revanth : రేవంత్ కు మద్దతుగా జానారెడ్డి కీలక వ్యాఖ్యలు..

HT Telugu Desk HT Telugu

27 February 2023, 10:16 IST

    • Jana Reddy on Revanth : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీకి నాయకత్వం వహించేందుకు రేవంత్ కంటే గట్టి నేత ఎవరున్నారని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. రేవంత్ రెడ్డి స్థానంలో మరో నేతను నియమించి పార్టీని ముందుకు తీసుకెళ్లడం కష్టమని.. అందుకు సమయం కూడా లేదని స్పష్టం చేశారు. 
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (facebook)

కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి

Jana Reddy on Revanth : తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పదవి నిర్వహణ.. కత్తిమీద సాములాంటిదే. భిన్నాభిప్రాయాలు కలిగిన నేతలు ఉన్న పార్టీని ఏకతాటిపై నడిపేందుకు చాలా కష్టపడాలి. ఈ క్రమంలో.. అనేక విమర్శలూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ చేపడుతున్న కార్యక్రమాలకు.. సీనియర్ల నుంచి అంతగా సహకారం అందడం లేదన్నది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో.. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని మించిన గట్టి నేత ఎవరూ లేరని వ్యాఖ్యానించారు. పార్టీలో కొందరు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని.. కానీ వారిలో నాయకత్వం చేపట్టే సామర్థ్యం ఉంటుందని తాను అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. రాయ్ పూర్ లో జరుగుతోన్న కాంగ్రెస్ ప్లీనరీ సందర్భంగా.. జానారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

తెలంగాణలో ఎన్నికల సన్నద్ధతపై మాట్లాడిన జానారెడ్డి.. ఎన్నికలకు ఇంకా కొంచమే సమయం ఉందని.. అంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో మరో నేతను నియమించి పార్టీని ముందుకు తీసుకెళ్లడం కష్టమని.. అందుకు సమయం కూడా లేదని స్పష్టం చేశారు. పార్టీలో అసంతృప్తులు ఉంటూనే ఉంటాయని.. ఏ రాజకీయ పార్టీలో అయినా అవి సర్వ సాధారణమే అని చెప్పారు. ప్రతి నేత అసంతృప్తికి చిన్న చిన్న కారణాలు ఎన్నో ఉంటాయని... తనతో మాట్లాడలేదని, తనకు చెప్పి చేయలేదని అంటూనే ఉంటారని.. వాటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోలేమన్నారు. ప్రగతి భవన్ ను కూల్చివేస్తానన్న రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన జానారెడ్డి... కేసీఆర్ కూడా అలాగే మాట్లాడారని.. ప్రగతి భవన్ జోలికి వస్తే కాళ్లూ చేతులు విరగ్గొడతా అని కేసీఆర్ అన్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజకీయాల్లో మాట్లాడే భాష మారిపోయిందని చెప్పారు. ఈ అంశంలో ఎవర్నీ తప్పుపట్టలేమన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జానారెడ్డి చెప్పుకొచ్చారు.

రాష్ట్రంలో బీజేపీ పుంజుకున్నా... ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బలమైన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే అని జానారెడ్డి స్పష్టం చేశారు. రానున్న కొద్ది నెలలు కలిసికట్టుగా కాంగ్రెస్ నేతలు పనిచేయాలని.. గట్టిగా కష్టపడితే గెలుపు సాధ్యమన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అవసరం ఉంటుందని భావించి.. కేసీఆర్ ఇటీవలి కాలంలో హస్తం పార్టీపై విమర్శలు తగ్గించి ఉంటారని జానారెడ్డి వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం తీవ్రంగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన... ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పుడు ఎలాంటి జిమ్మిక్కులు కాపాడలేవని జానారెడ్డి తేల్చి చెప్పారు.