Telangana Irrigation : సాగునీటి ప్రాజెక్టులకు పూడిక సమస్య.. తెలంగాణలో అన్ని చోట్లా అదే పరిస్థితి!
21 September 2024, 16:10 IST
- Telangana Irrigation : కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టుల్లో సాగునీటి నిల్వ సామర్ధ్యం పడిపోతుంది. సాగునీటి ప్రాజెక్టులు పూడిక సమస్యను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో అన్ని ప్రాజెక్టులదీ దాదాపు అదే పరిస్థితి. ముఖ్యంగా నాగార్జునసాగర్ పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు
సాగునీటి ప్రాజెక్టుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించి.. ఆ పూడిక మట్టిని విక్రయించడం ద్వారా వచ్చే సొమ్మును సంబంధిత ప్రాజెక్టు మెయింటెనెన్స్‌కు వినియోగించాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేసింది. దీనికోసం క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సాగునీటి శాఖా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావులు ఉన్నారు.
ఈ నీటి సంవత్సరం ( వాటర్ ఇయర్ )లో అటు కృష్ణా నదికి, ఇటు గోదావరి నదికి విపరీతమైన వరద వచ్చింది. ఈ రెండు నదులపై ఉన్న ప్రాజెక్టులు ఇపుడు పూర్తి స్థాయి నీటిమట్టంతో కళకళలాడుతున్నాయి. ఏటేటా ఈ ప్రాజెక్టుల్లోకి వస్తున్న వరద నీటితో పాటే పూడిక సైతం వచ్చి చేరుతోంది. ఫలితంగా ఆయా ప్రాజెక్టుల నీటినిల్వ సామర్ధ్యం గణనీయంగా పడిపోతోంది.
ఇలా పేరుకుపోయిన పూడికను తొలగించేందుకు ఇప్పటి దాకా ప్రభుత్వాల నుంచి జరిగిన ప్రయత్నాలు స్వల్పంగానే ఉన్నాయి. సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) నివేదికలు సైతం పేరుకుపోతున్న పూడిక, పడిపోతున్న నీటినిల్వ సామర్ధ్యం గురించే వివరిస్తున్నాయి.
ఆందోళన కలిగిస్తున్న నాగార్జునసాగర్..
దక్షిణ తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న నాగార్జున సాగర్ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఈ వర్షాకాల సీజన్ లో గడిచిన నెలరోజులకు పైగా నాగార్జున సాగర్ కు వరద పోటెత్తుతోంది. లక్షల క్యూసెక్కుల నీరు నదిలోకి దిగువకు వదిలేశారు.
ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు 112 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యాన్ని కోల్పోయిందని చెబుతున్నారు. సాగర్ లక్షిత నీటి నీల్వ 408.24 టీఎంసీలు. కానీ, 2010 నాటికే 312.1456 టీఎంసీలకు పడిపోయింది. ప్రతీ అయిదు, లేదా పదేళ్లకోమారు జరుగుతున్న సర్వేల ద్వారా సాగర్ సామర్ద్యంపై అంచనాలకు వస్తున్నారు.
1967లో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగా, 1967-1974 మధ్య జరిగిన సర్వేలో 14.4 టీఎంసీల సామర్ధ్యం తగ్గితే, 2024 నాటికి 112 టీఎంసీలకు తగ్గిపోయిందని అధికారిక నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి. ప్రాజెక్టుకు గరిష్ఠంగా వరద ప్రవాహం 10.60 లక్షల క్యూసెక్కులు. దీంతో ఎగువ నుంచి అపరిమితంగా వచ్చి చేరుతున్న పూడికతో సాగర్ నీటినిల్వ పడిపోతోందని నిపుణులు చెబుతున్నారు.
పడిపోతున్న నిల్వ సామర్ధ్యం..
కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టుల్లో పూడిక సమస్య తీవ్రంగానే ఉంది. సీడబ్ల్యూసీ రిపోర్టులు, ప్రభుత్వం సేకరించిన గణాంకాల మేరకు ఆయా సంవత్సరాల్లో జరిపిన సర్వేల ప్రకారం.. శ్రీశైలం ప్రాజెక్టు 29.96శాతం సామర్ధ్యాన్ని కోల్పోయింది. నిజాం సాగర్ 60 శాతానికిపైగా, శ్రీరామ్ సాగర్ 28.50శాతం, కడెం ప్రాజెక్టు 50 శాతం నీటి నిల్వ సామర్ధ్యాన్ని కోల్పోయాయి.
ఈ ప్రాజెక్టుల కాలపరమితి ఇంకా దగ్గరపడక ముందే పూడిక సమస్యతో సతమతమవుతున్నాయి. సాధారణంగా సాగునీటి ప్రాజెక్టులకు వందేళ్ల కాలపరిమితి, విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు 70 ఏళ్ల కాలపరిమితితో నిర్మిస్తారని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. కడెం ప్రాజెక్టు 7.20 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మిస్తే ఇపుడు 4.7 టీఎంసీలకు తగ్గిపోయింది.
నిజాంసాగర్ 25.6 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మిస్తే ఇపుడు ఆ ప్రాజెక్టు నిల్వ సామర్ధ్యం 17.8టీఎంసీలకు పడిపోయింది. 112 టీఎంసీల నిల్వ కోసం నిర్మించి శ్రీరామ్ సాగర్ 80 టీఎంసీలకు పడిపోయింది. ఈ కారణంగానే 2017లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం రూ.2వేల కోట్లతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నవీకరించాలని అనుకున్నా.. అది కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాజెక్టు మీద సీడబ్ల్యూసీ నాలుగు పర్యాయాలు హైడ్రో గ్రాఫిక్ సర్వేలు నిర్వహించింది.
(రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )