TS Cabinet Decisions : ధాన్యం కొనుగోళ్ల బాధ్యత కలెక్టర్లకే, సన్న వడ్లకే రూ.500 బోనస్- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే!
20 May 2024, 21:07 IST
- TS Cabinet Key Decisions : తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 2న నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే
TS Cabinet Key Decisions : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతులకు పెట్టుబడి సాయంతో సహా పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ఆహ్వానించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అదే విధంగా ధాన్యం కొనుగోళ్ల బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైతులకు నష్టం జరగకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
సన్న వడ్లకే రూ.500 బోనస్
కేబినెట్ నిర్ణయాలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వివరించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ధాన్యం సేకరణ జరుగుతుందన్నారు. ధాన్యం సేకరించిన 5 రోజుల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నాయన్నారు. ప్రజలకు, విద్యార్థులకు అవసరమైన 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్రంలోనే సేకరిస్తున్నామన్నారు. సన్న వడ్లకే క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు తెలిపారు. మే నెలలో అకాల వర్షాలతో ధాన్యం తడిసిన మాట వాస్తవమే అన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా సేకరిస్తామని హామీ ఇచ్చారు.
పాఠశాలల ఆధునీకరణకు రూ.600 కోట్లు
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. స్కూల్స్ ఆధునీకరణకు రూ.600 కోట్లు కేటాయిస్తామన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వ ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మత్తులపై కేబినెట్ లో చర్చించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపై చర్చించామన్నారు.రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రభుత్వం తరపున మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తామన్నారు. స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యే జూన్ 12 లోగా విద్య వ్యవస్థలో మార్పులు చూపించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. కేబినెట్ భేటీలో ధాన్యం కొనుగోలు, ఒక్క గింజ కూడా తరుగు లేకుండా సేకరించాలని నిర్ణయించామన్నారు. మూడు రోజుల్లో రైతులకు నగదు చెల్లించేలా చూస్తామన్నారు. స్టాండింగ్ క్రాప్ అంశంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. బోధన, బోధనేతర అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు.
ఎన్డీఎస్ఏ సూచనలకు అనుగుణంగా
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నిపుణుల కమిటీ సిఫార్సులను అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో నీటి నిల్వ పరిస్థితి లేదని ఎన్డీఎస్ఏ తెలిపిందన్నారు. కాళేశ్వరం విషయంలో నేషనల్ డ్యామ్ సెఫ్టీ అథారిటీ(NDSA) సూచనలకు అనుగుణంగా వ్యవహరిస్తామన్నారు. అలాగే తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి రైతులు నీరు అందిస్తామన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందన్నారు. పదేళ్లుగా ఏం చేయని బీఆర్ఎస్ ఇప్పుడు డ్రామాలు ఆడుతుందని విమర్శించారు. కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలను జూన్ 5న వెల్లడిస్తామన్నారు.