Crop Damage: 3 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలి.. ప్రభుత్వానికి చంద్రబాబు డెడ్ లైన్, కార్యాచరణ ప్రకటన-tdp chief chandrababu fires on cm jagan over crop damage due to rains ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Crop Damage: 3 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలి.. ప్రభుత్వానికి చంద్రబాబు డెడ్ లైన్, కార్యాచరణ ప్రకటన

Crop Damage: 3 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలి.. ప్రభుత్వానికి చంద్రబాబు డెడ్ లైన్, కార్యాచరణ ప్రకటన

HT Telugu Desk HT Telugu
May 06, 2023 07:52 AM IST

Chandrababu in East Godavari Dist:తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. అకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్నారు. చంద్రబాబు. ఇవాళ కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటన కొనసాగనుంది.

చంద్రబాబు
చంద్రబాబు

Chandrababu East Godavari Dist Tour Updates: అకాల వర్షాల కారణం దాదాపు 70 నియోజకవర్గాల్లో పంటలకు నష్టం జరిగిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన శుక్రవారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. రెండు రోజుల పాటు పలు నియోజకవర్గాల్లో పర్యటించానని....రైతులతో మాట్లాడాను.. వారి బాధలు చూశానని చెప్పారు. తన పర్యటన ఖరారు అయిన తర్వాకే ప్రభుత్వం నుంచి స్పందన మొదలైందన్నారు. నిర్థిష్టంగా ఏం చేస్తాం అనేది చెప్పకుండా....అధికారులు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యారని విమర్శించారు. అన్నదాతలు కష్టాల్లో ఉంటే ముఖ్యమంత్రి జగన్ వచ్చి పరామర్శించాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. సీఎం రాలేదు...మంత్రులు కదలలేదని... రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతుల పంటలకు బీమా చేయించలేదని... ప్రీమియం చెల్లించలేదని ఆరోపించారు.

"ఉభయ గోదావరి జిల్లాల్లో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుంది. 40 నుంచి 50 శాతం పంట ఇంకా పొలాల్లో ఉంది. వచ్చిన పంటలో 15 నుంచి 20 శాతం కొన్నారు....మిగిలిన పంట కల్లాల్లోనే ఉంది. నేను వచ్చాను అని ప్రభుత్వం ఇప్పుడు సేకరణ అంటూ అధికారులను పంపుతోంది. శనివారం కొవ్వూరు, నిడదవోలు నియోజకవర్గాల్లో పర్యటిస్తాను. జిల్లాలో రైతుల పరిస్థితి చూసి నా పర్యటన మరో రోజు పొడిగించుకున్నాను. పొలంలో ఉన్న దెబ్బతిన్న పంటకు 40 శాతం పరిహారం ఇవ్వాలి, ఇన్ స్యూరెన్స్ ఉంటే ఎంత పరిహారం వస్తుందో అంత పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు అని పెట్టి వ్యవస్థను చిన్నా భిన్నం చేసింది. రైతుల ధాన్యాన్ని ప్రభుత్వం తమకు కావాల్సిన మిల్లులకే పంపుతుంది. దగ్గరలో మిల్లులు ఉన్నా.....తమకు కావాల్సిన మిల్లులకే పంపి రైతుల్ని దోచుకుంటోంది. నూక వస్తుందని మిల్లర్లు రైతుల నుంచి మండే డబ్బులు వసూలు చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో తూకం వేసిన తరువాత మళ్లీ మిల్లు దగ్గర బస్తాకు 5 కేజీలు తరుగు తీస్తున్నారు. ఇలా రకరకాల విధానాల వల్ల బస్తాకు రైతు...రూ. 300 రూపాయాలు నష్టపోతున్నాడు. ప్రభుత్వం చెప్పినట్లు బస్తాకు రూ.1530 రావడం లేదు. ప్రభుత్వం సకాలంలో సేకరణ చేయలేకపోయింది. కనీసం గోతాలు కూడా ఇవ్వలేకపోయారు. రంద్రాలు పడ్డ గోతాలు ఇవ్వడం వల్ల కూడా రైతులు నష్టపోయారు. నేడు రాష్ట్రంలో 75 నుంచి 80 శాతం కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతుల్లో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాపులు వీరంతా పేద వర్గాలు. పంట పొలంలో ఉంటేనే పరిహారం ఇస్తామంటున్నారు, ఏప్రిల్ 1న సేకరణ ప్రారంభించి ఉంటే ఇప్పుడు ఈ నష్టం ఉండేది కాదు. ధాన్యం అకాల వర్షాల భారిన పడేది కాదు. నేటి ఈ సమస్యకు పూర్తి కారణం సిఎం జగన్ రెడ్డి. రోమ్ తగలబడుతుంటే చక్రవర్తి పిడేల్ వాయించినట్టు జగన్ వైఖరి ఉంది. కష్టాల్లో ఉన్న రైతుల్ని గాలికొదిలి, ఇంట్లో కూర్చుని వివేకా హత్య హంతకులను కాపాడే పనిలో జగన్ బిజీగా ఉన్నాడు. హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు పరిహారం పెంచి జీవోలు ఇచ్చాను. నాడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి పరిహారం అందజేశాం" అని చంద్రబాబు గుర్తు చేశారు.

ప్రభుత్వం వెంటనే చేలో ఉండే పంటకు పరిహారం ఇవ్వాలని.. ఎంత పరిహారం ఇస్తారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. కోసిన పంట వర్షాలకు దెబ్బతింది. వాటిని పూర్తిగా సేకరిస్తారా లేదా చెప్పాలి ? అని ప్రశ్నించారు. ధాన్యం రవాణా ఉచితంగా చేయాలన్నారు. "మిల్లర్లు రైతు దగ్గర ధాన్యం విరిగిపోతుంది అని డబ్బులు వసూలు చేస్తున్నారు.ప్రభుత్వ వైఖరితో ఒక్కో బస్తాపై రైతు రూ. 300 నష్టపోతున్నాడు. రాష్ట్రంలో వరితో పాటు మొక్కజోన్న, వాణిజ్య పంటలకు నష్టం జరిగింది. వాణిజ్య పంటలకు సాగుపెట్టుబడి లక్ష రూపాయలు అవుతుంది....వారికి జరిగిన నష్టాన్ని ఇవ్వాలి. ప్రభుత్వం ఎప్పటిలోపు ఈ ధాన్యం కొంటారో స్పష్టమైన ప్రకటన చేయాలి. వర్షాలకు నష్టపోయిన రైతులకు ఏం సాయం చేస్తారో ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాలి 72 గంటల్లో ప్రభుత్వం ధాన్యం అంతా కొనాలి, ఇదే ప్రభుత్వానికి డెడ్ లైన్. మళ్లీ తుఫాను వచ్చే అవకాశం ఉంది. అందుకే వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలి జగన్ పాలనలో వరి వేసుకున్న రైతులు ఉరివేసుకునే పరిస్థితి వచ్చింది, మూడు రోజుల్లో ప్రభుత్వం ధాన్యం సేకరణ పూర్తి చేయాలి. ధాన్యం కొనకపోతే 9వ తేదీ ఎమ్మార్వో ఆఫీసుల వద్ద మొమోరాండం ఇస్తాం. 'మా పంట మునిగింది...పరిహారం ఇవ్వండి' అనే స్లోగన్ తో పోరాటం చేస్తాం. ప్రభుత్వం అప్పటికీ స్పందిచకపోతే.....13వ తేదీ నిరసన దీక్ష చేపడతాం...నేను కూడా నిరసనలో పాల్గొంటా. రైతులు కూడా కదలి రావాలి....చైతన్యంతో ముందుకు రావాలి. పోరాడాలి. లేకపోతే ఈ ప్రభుత్వం స్పందించదు. రైతులు తమ సమస్యలు...ధాన్యం అమ్మకంలో పడుతున్న ఇబ్బందులపై వీడియోలు, ఫోటోలు పెట్టండి. ప్రభుత్వం బాధ్యత గుర్తుచేద్దాం" అని పిలుపునిచ్చారు చంద్రబాబు.

WhatsApp channel