Ambati Rambabu : పరిహారం సొమ్ములో వాటా… మంత్రి అంబటిపై ఆరోపణలు…-ap irrigation minister ambati rambabu denied allegations made by janasena party ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ambati Rambabu : పరిహారం సొమ్ములో వాటా… మంత్రి అంబటిపై ఆరోపణలు…

Ambati Rambabu : పరిహారం సొమ్ములో వాటా… మంత్రి అంబటిపై ఆరోపణలు…

HT Telugu Desk HT Telugu
Dec 20, 2022 01:51 PM IST

Ambati Rambabu : ప్రభుత్వం ఇచ్చిన పరిహారంలో మంత్రి అంబటి రాంబాబు వాటా కోరారంటూ బాధితులు ఆరోపించడం సత్తెనపల్లిలో కలకలం రేపింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఐదు లక్షల రుపాయల ఆర్థిక సాయంలో సగం తనకు ఇవ్వాలని మంత్రి ఆదేశించారని బాధితులు ఆరోపించడంతో రాజకీయ దుమారం రేగింది. మరోవైపు మంత్రి అంబటి రాంబాబు తనపై వచ్చిన ఆరోపణల్ని రాజకీయ కుట్రలని తోసిపుచ్చారు. జనసేన కుట్రల్లో భాగంగా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని మండిపడ్డారు.

ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu చేతికి అంది వచ్చిన కొడుకు చనిపోయిన దు:ఖంలో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం అందించిన ఆర్ధిక సాయంలో మంత్రి అంబటి రాంబాబు వాటా కోరారనే ఆరోపణలు కలకలం రేపాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన తురక గంగమ్మ, పర్లయ్య దంపతులు, మంత్రి అంబటి రాంబాబు తమను డబ్బు డిమాండ చేశారని ఆరోపించడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రభుత్వం ఇచ్చిన ఐదు లక్షల్లో రెండున్నర లక్షలు తన వాటాగా ఇవ్వాలని ఒత్తిడి చేశారని బాధితులు వీడియోల్లో ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారంలో సగం డబ్బు రూ.2.50 లక్షలు తమకు ఇవ్వాలని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భర్త అడిగారని, దీనిపై మంత్రి అంబటి రాంబాబును కలిస్తే సొమ్ము ఇవ్వాల్సిందేనని ఆయనా గదమాయించారని బాధితులు ఆరోపించారు.

స్థానిక సిఐ సైతం అడిగిన డబ్బులు ఇవ్వాల్సిందేనని బెదిరించడంతో చచ్చి పోవాలనుకున్నామని చెప్పారు. తమ కూతురి కోసం ఆ ప్రయత్నం విరమించుకున్నట్లు చెప్పారు. కొండలరావు అనే వ్యక్తి ద్వారా తమ కొడుకు హోటల్‌లో పనికి వెళ్లి చనిపోయాడని, తర్వాత నాలుగు నెలలకు ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల సాయం వచ్చిందని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ భర్త చల్లంచర్ల సాంబశివరావు ఫోన్‌ చేసి చెప్పారని బాధితులు వివరించారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకుడు పెండెం బాబూరావును తీసుకుని సాంబశివరావు దగ్గరకు వెళితే రూ.5 లక్షల్లో రూ.2.50 లక్షలు ఇవ్వాలని అడిగారని ఆరోపించారు.

ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బుతో అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్పినా వినలేదని, న్యాయం కోసం మంత్రి అంబటి రాంబాబును కలిస్తే సాంబశివరావుకు రూ.2.50 లక్షలు ఇవ్వాల్సిందేనని చెప్పారని వీడియోలో బాధితులు ఆరోపించారు. మునిసిపల్ ఛైర్‌ పర్సన‌ వద్దన్నా తనకు డబ్బు కావాలని, ఆ డబ్బులు తానే తీసుకుంటానని చెప్పి గదమాయించి పంపారన్నారు. మంత్రి దగ్గర నుంచి వచ్చాక సీఐ పిలిచి వాళ్లు చెప్పినట్లు వినకపోతే మీకు సంక్షేమ పథకాలేమీ రావని స్టేషన్‌ చుట్టూ తిరగాల్సి వస్తుందని బెదిరించడంతో పురుగుమందు తాగి చనిపోవాలనుకున్నామని అని గంగమ్మ వాపోయారు.

డ్రైనేజీ పూడిక తీస్తూ మృత్యువాత….

గుంటూరు సమీపంలోని దాసరిపాలెం నుంచి తురక పర్లయ్య కుటుంబం బతుకుదెరువు కోసం ఏడాదిన్నర కిందట సత్తెనపల్లి వచ్చారు. రోడ్డు పక్కనే పూరిల్లు వేసుకుని జీవిస్తున్నారు. పర్లయ్య, గంగమ్మలకు కుమారుడు పదిహేడేళ్ల అనిల్‌, కుమార్తె సమ్మక్క ఉన్నారు. పర్లయ్య అనారోగ్యంతో ఇంటి దగ్గరే ఉంటున్నారు. గంగమ్మ ప్రైవేటు పాఠశాలలో పారిశుద్ధ్య పనికి వెళ్తున్నారు. వీరి కుమారుడు అనిల్‌ ఆగస్టు 20న రాత్రి పట్టణంలోని వినాయక హోటల్‌లో డ్రైనేజీ గుంతలో మురుగు తీస్తూ చనిపోయాడు. ప్రమాదవశాత్తూ చనిపోవడంతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5 లక్షల చెక్కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సొమ్ము అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించిన ఇన్స్యూరెన్స్‌కు చెందినదిగా ప్రచారం జరుగుతోంది. బాధితులకు వచ్చిన పరిహారంలో రూ.2.50 లక్షలు చెల్లిస్తేనే చెక్కు ఇస్తామని ఛైర్‌పర్సన్‌ భర్త, మంత్రి అంబటి రాంబాబు బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపించారు.

జనసేన కుట్రలని ఆరోపించిన అంబటి రాంబాబు….

రైతు ఆత్మహత్యల పరిహారంలో డబ్బులు తీసుకున్నానని సత్తెనపల్లిలో చేసిన ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేస్తే రైతులకు సంబంధం లేని వేరే ఘటనను తెరపైక తీసుకొచ్చి, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున మొత్తం రూ. 84 లక్షలను ప్రభుత్వం పరిహారంగా చెల్లించిందని ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేదని, చేతనైతే నిరూపించు అని మరోసారి పవన్ కల్యాణ్ కు సవాల్ విసురుతున్నానన్నారు. సత్తెనపల్లిలో ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ ఘటనలో మరణించిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన పంచాయితీని ముడిపెట్టి ఆరోపణలు చేయడం తగదని మంత్రి అంబటి హెచ్చరించారు.

జనసేన కోసం సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రాణాలు అర్పించిన యువకుడు మట్టం అశోక్ కుటుంబాన్ని ఆదుకుంటామని మాట ఇచ్చి, ఇక్కడకు వచ్చి కనీసం పలకరించలేని, మృతుడు తండ్రి పరిహారం కోసం వస్తే.. గెంటేసిన పవన్ కల్యాణ్ .. నాపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటన్నారు.

-శవాల మీద పేలాలు ఏరుకోవాల్సిన ఖర్మగానీ, రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిగానీ నాకు పట్టలేదని, ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల దగ్గర నుంచి నేను రూ. 2 లక్షలు రూపాయలు తీసుకున్నానని నిరూపిస్తే పదవిని తృణప్రాయంగా వదులుకోవడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని మంత్రి అంబటి స్పష్టం చేశారు.

IPL_Entry_Point

టాపిక్