Adilabad Rains: అకాల వర్షాలకు ఆదిలాబాద్‌లో అపార పంట నష్టం, ధాన్యం తడిచిపోవడంతో రైతుల ఆందోళన
14 May 2024, 7:21 IST
- Adilabad Rains: ఉమ్మడి ఆదిలాబాద్ లో గత రెండు రోజులుగా వీచిన గాలి, అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. పండించిన ధాన్యం తడిచిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ఆదిలాబాద్‌లో ధాన్యం తడిచిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం
Adilabad Rains: ఉమ్మడి ఆదిలాబాద్ లో గత రెండు రోజులుగా వీచిన గాలి, అకాల వర్షాలకు భారీగా పంట నష్టం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, జిల్లా లోని పలు మండలాలలో కురిసిన భారీ వర్షానికి కోత కు వచ్చిన వరి పంట నేలకొరిగింది.
పలు గ్రామాల్లో ఐకేపీ, పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా కొం దరు రైతులు తీసుకువచ్చిన వరిధాన్యం కొనుగోళ్లలో జాప్యమైంది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసిపోయింది. తడిసిన వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరారు.
పిడుగుపడి ఒకరు మృతి..
గిమ్మ గ్రామంలో ఆదివారం ఈదురుగాలుల వర్షంతో పిడుగు పడి ఒకరు మృతి చెందగా, అందులో తీవ్ర గాయాలు పాలైన మరొకరు మృతి చెందారు. గిమ్మ గ్రామానికి యువ రైతు మందస సంటెన్న పొలం పనులకు వెళ్లి వస్తుండగా పిడుగు పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. గాయపడిన సంటెన్నను హుటాహుటిన రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో పరిస్థితి విషమించే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న మండల పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.
సోమవారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదు రుగాలులకుతోడు ఉరుములు, మెరుపులతో కూడిన వాన గంటకుపైగా కురవడంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. పట్టణంలోని తహ సీల్దార్ కార్యాలయం ఎదుట గల పోలింగ్ కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని పోలింగ్ కేంద్రాల వద్ద వర్షపు నీరు నిలిచింది.
మార్కెట్ యార్డులో ధాన్యం కుప్పలపై కవర్లు కప్పి ఉంచినప్పటికీ భారీ వర్షం ధాటికి పలువురు రైతుల ధాన్యం కొట్టుకు పోవడంతో కాపాడుకునేందుకు రైతులు వర్షంలోనే అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. వారసంతలో చిరువ్యాపారులు వాన ధాటికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కుభీరు మండలంలోని సిర్పెల్లి తండా, గొడిసెర్చ్, తదితర గ్రామాల్లో ఆదివారం ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. కోసి ఆరబెట్టిన మొక్కజొన్న, నువ్వు పంటలు తడిసి ముద్దయ్యాయి. సిర్పెల్లి తండాలో విద్యుత్తు ట్రాన్స్ఫర్మర్ గద్దె పై నుంచి పడిపోయింది పలుచోట్ల స్తంభాలు వంగిపోయి విద్యుత్తు సరఫ రాకు అంతరాయం ఏర్పడింది.
రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడిదలాబాద్ జిల్లా ప్రతినిధి.