Floods In Telangana : భారీ వర్షాలు.. ప్రాజెక్టులకు వరద నీరు
13 September 2022, 21:03 IST
- Godavari Floods 2022 : భారీ వర్షాలు కురుస్తుండటంతో నీటిపారుదల ప్రాజెక్టులు, నదులకు వరదలు వస్తున్నాయి. గోదావరి, కృష్ణా నదులకు వరద నీరు కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.
గోదావరి వరదలు(ఫైల్ ఫొటో)
ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రాష్ట్రంలోని వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ కారణంగా ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి అధికారులు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మరోవైపు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతోపాటుగా పై నుంచి వరద పోటెత్తుతోంది. మంగళవారం ఉదయానికి 50 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం దగ్గర గోదావరిలో 12,51,999 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది.
గోదావరి ఉద్ధృతికి అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఇతర జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశాలు ఇచ్చారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో 08744-241950, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08743-232444 నంబర్లతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.
ఆదిలాబాద్ మండలంలోని అంకోలి, తంతోలి గ్రామాల్లో వ్యవసాయ పొలాల్లోకి వరదనీరు చేరి పంటలు నీటమునిగాయి. కెరమెరి, ఆసిఫాబాద్‌తో పాటు పలు మండలాల్లోనూ వరదలు పోటెత్తాయి. వరదల పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. దహెగాం మండలం దిండా గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వేమనపల్లి, కోటపల్లి మండలాల్లోని గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరడంతో బతుకమ్మ వాగు చెన్నూరు వద్ద ఎన్‌హెచ్-63 అప్రోచ్ రోడ్డుపైకి వెళ్లింది. సంబంధిత అధికారులు ట్రాఫిక్‌ను ఇతర మార్గాల్లో మళ్లించారు.
ఇంకోవైపు ధవళేశ్వరం ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. బ్యారేజీ వద్ద 11.20 అడుగులకు నీటిమట్టం చేరింది. బ్యారేజీ 175 గేట్లు ఎత్తేసి 9.9 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఏపీ విపత్తుల సంస్థ వరద ప్రభావిత ప్రాంతాలను అలర్ట్ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.