Godavari Floods : భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ-godavari floods 2022 third alert issued at bhadrachalam ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Godavari Floods : భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Godavari Floods : భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ

HT Telugu Desk HT Telugu

భద్రాచలం వద్ద గోదావరికి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇటీవల వచ్చిన వరదలు మరిచిపోకముందే.. గోదావరి ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. మళ్లీ భయపెట్టిస్తోంది.

పెరుగుతున్న గోదావరి వరద

భద్రాచలం వద్ద గోదావరి వరద మళ్లీ పెరిగింది. ప్రస్తుత నీటిమట్టం 53 అడుగులుగా ఉంది. ఈ కారణంగా అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ముంపు వాసులు, యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

ప్రస్తుతం గోదావరికి 14 లక్షల 26 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ముంపు మండలాలు నీటిలోనే ఉన్నాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలకు వెళ్లే రహదారిపై నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోదావరి నీటిమట్టం 56 అడుగులకు చేరే అవకాశముందని అధికారులు అంచనా వేస్తు్న్నారు. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

గోదావరికి వరద మరోసారి పోటెత్తడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం, బూర్గంపాడు, సారపాక, అశ్వారావుపేట, పినపాక, ఏడూళ్లబయ్యారం తదితర గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్‌ అనుదీప్‌ కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు.

ఇటీవలే గోదావరి నదికి చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. గ్రామాలు, పట్టణాలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. సాధారణంగా ప్రాణహిత నుంచి మాత్రమే వరద వస్తుంది. కానీ ఆ మధ్య కురిసిన వర్షాలతో అన్ని ఉపనదుల నుంచి వరద వచ్చింది. మహారాష్ర్ట, ఛత్తీస్ ఘడ్, తెలంగాణ ప్రాంతాల్లోని పట్టణాలు, పల్లెలు వరదమయమయ్యాయి. భద్రాచలం వద్ద 70 అడుగులకుపైగా వరద నీరు వచ్చింది. కరకట్టను తాకింది. అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. ప్రాణ నష్టం పెద్దగా జరగకుండా కాపాడారు. ప్రభుత్వం కూడా ఆ సమయంలో బాధితులకు అండగా నిలిచింది.

1986లో గోదావరి నదికి వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీగా కరకట్ట నిర్మించాలని ప్రణాళిక వేశారు. ఆ తర్వాత దాదాపు 80 అడుగుల మేర వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించారు. రూ.53 కోట్లతో ఎటపాక నుంచి సుభాష్ నగర్‌ వరకు 10 కిలోమీటర్ల వరకు ఈ కరకట్టను నిర్మాణం జరిగింది. అయితే ఈ కరకట్టకు లీకేజీ లోపాలు ఉండటంతో నీరు బయటకు వస్తుంది. 36 ఏళ్ల తర్వాత ఇటీవల గోదావరికి భారీగా వరద రావడంతో నీరు కరకట్టను తాకింది. మరోవైపు కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన స్లూయిస్‌ నుంచి లీకులతో నీరు భద్రాచలంలోకి వెళ్తోందనే అభిప్రాయలు వచ్చాయి.

సంబంధిత కథనం