Srisailam Gates Lifted : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద
Floods To Krishna River : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు కొనసాగుతోంది. దీంతో 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ఎగువన కురుస్తున్న వానలతో కృష్ణా నదికి భారీగా వరద వస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ జలాశయానికి 2,80,348 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా 2,27,325 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.90 అడుగుల వరగు నీరు ఉంది. మొత్తం 215.8070 టీఎంసీలకుగాను 215.3263 టీఎంసీల ఉంది.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సోమశిల రిజర్వాయర్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 42,213 క్యూసెక్కులుగా నమోదు అయింది. ఆరు క్రెస్ట్ గేట్ల ద్వారా 60,453 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సోమశిల పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 77.9 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 69.1 టీఎంసీలుగా ఉంది. మరోవైపు కర్నూలులోని సుంకేసుల జలాశయం 13 గేట్లను ఎత్తివేసి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. సుంకేసుల ఇన్ ఫ్లో 54,087 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 52,832 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.
వందేళ్ల తర్వాత..
మరోవైపు గతంలో ఎప్పుడూ లేనంతగా.. వేదవతి నది పొంగిపొర్లుతోంది. అనంతపురం, కర్నూలు జిల్లాల గుండా ప్రవహించే ఈ నదికి వందేళ్లలో ఎన్నడూ లేనంతగా వరద నీరు వస్తోంది. ఈ నదిపై కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా దశాబ్దాలుగా ప్రవాహం లేకుండా అయింది. కొన్నిరోజుల ముందు చూసుకుంటే.. నది ఆనవాళ్లు కూడా మారిపోయే పరిస్థితి కనిపించింది.
1982, 1996లో కొద్దిగా ప్రవాహం వచ్చినట్టుగా స్థానికులు చెబుతున్నారు. అనంతరం.. నదిలో నీరు అనేదే కనిపించలేదు. ఇప్పుడు భారీ వర్షాలు పడుతుండటంతో వేదవతి నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి కారణంగా వేదవతిపై నిర్మించిన భైరవానితిప్ప ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ఎన్నడూ లేని విధంగా 66 వేల క్యూసెక్కుల నీటిని వదలడం ఇదే మెుదటిసారి. వరదతో నదీ పరివాహక ప్రాంతాల్లో వేసిన పంట కొట్టుకుపోయింది.