Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వానలు
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరదలు బీభత్సం సృష్టించాయి. అయితే ఇప్పుడు కాస్త కుదుటపడినట్టుగా కనిపిస్తోంది. మరికొన్ని రోజులు వర్షాలు ఉండనున్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీ, తెలంగాణలో వానలు విపరీతంగా పడ్డాయి. గోదావరి నదికి గతంలో ఎన్నడూ లేనంతంగా వరద వచ్చింది. ఇప్పుడు కాస్త శాంతించినట్టుగా కనిపిస్తోంది. మరికొన్ని రోజులు వర్షాలు పడనున్నట్టుగా వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉన్నట్టుగా తెలిపింది. మరికొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా వర్షాలు పడనున్నట్టు వెల్లడించింది.
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్(రూరల్), వరంగల్ అర్బన్, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జూలై 20 వరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం.
గోదావరి నదికి గతంలో ఎన్నడూ లేనంతగా జులై నెలలో వరదలు వచ్చాయి. జనజీవనం అల్లకల్లోలమైంది. ఇప్పుడు కాస్త గోదారమ్మ శాంతించింది. గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ, రేపు ఏరియల్ సర్వే నిర్వహించి, వరద పరిస్థితిని పరిశీలిస్తారు. రెండు, మూడు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సమీక్ష చేస్తారు. వరద బాధితులను పరామర్శించనున్నారు. ఇప్పటికే కేసీఆర్ శనివారం రాత్రి వరంగల్ వచ్చారు.
మరోవైపు ఏపీలోనూ వర్షాలు దంచికొట్టాయి. ఒడిశా తీరంలో అల్పపీడనం బలపడటంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు పడనున్నాయి. మరో రెండు రోజులపాటు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు యానాంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడనున్నాయి. ధవళేశ్వరం వద్ద గోదారమ్మ కాస్త శాంతించింది.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోనూ అల్పపీడనం ప్రభావం తక్కువగానే ఉంది. దక్షిణ కోస్తాంధ్రలోని ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలు, వరద ఉన్నాయని.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలను అధికారులు హెచ్చరించారు.