August 09 Telugu News Updates | శ్రీశైలం జలాశయానికి వరద.. 6 గేట్లు ఎత్తిన అధికారులు
- సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరపాల్సిన చర్చలు వాయిదా పడటంతో కార్మికులు సమ్మె నోటీసు ఇచ్చారు. ఒప్పంద కార్మికుల వేతనాాలు, ఇతర సమస్యల పరిష్కారానికి హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో జరగాల్సిన చర్చలకు సింగరేణి యాజమాన్య ప్రతినిధులు ఎవరు రాకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కార్మిక శాఖకు నోటీసులు ఇచ్చారు.
Tue, 09 Aug 202202:00 PM IST
శ్రీశైలం జలాశయానికి వరద.. 6 గేట్లు ఎత్తిన అధికారులు
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 884.80 అడుగులు, నీటి నిల్వ 214.3637 టీఎంసీలుగా నమోదైంది. స్పిల్ వే ద్వారా లక్షా 67వేల 898 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. జూరాల, సుంకేసుల నుంచి లక్షా 60 వేల 901 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలానికి వస్తోంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 63,046 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
Tue, 09 Aug 202211:28 AM IST
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని సిద్ధిపేట జిల్లాకు చెందిన రాజశేఖరరెడ్డి అనే వ్యక్తి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రెండేళ్ల తర్వాత ఈ కేసుపై పోలీసులు స్పందించారు. తాజాగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 209, 506 సెక్షన్ల కింద రసమయిపై కేసు నమోదైంది.
Tue, 09 Aug 202211:26 AM IST
యువత భాగ్యస్వామ్యంపై పార్టీలో కమిటీ
టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీలో యువతకు భాగస్వామ్యంపై కమిటీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. జగన్ రెడ్డి డర్టీ గ్యాంగ్ వల్ల మహిళల భద్రత ప్రమాదంలో ఉందని మండిపడ్డారు.
Tue, 09 Aug 202207:51 AM IST
మూడున్నరేళ్ల చిన్నారికి హెచ్‌ఐవి రక్తం ఎక్కించిన బ్లడ్ బ్యాంక్…
హైదరాబాద్‌లో దారుణ సంఘటన వెలుగు చూసింది. తలసేమియాతో బాధత పడుతున్న మూడున్నరేళ్ల చిన్నారికి హెచ్‌ఐవి సోకిన రక్తాన్ని ఎక్కించినట్లు చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రెండున్నరేళ్లుగా చిన్నారికి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకున్న రక్తాన్ని ఎక్కిస్తున్నామని, ఇటీవల వైద్య పరీక్షల్లో హెచ్‌ఐవి బయటపడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఆరోపణల్ని ఖండించింది. తమ వద్ద 42సార్లు చిన్నారి కోసం రక్తం తీసుకున్నారని వాటిని పూర్తిగా పరీక్ష చేసిన తర్వాతే చిన్నారి కోసం వినియోగించామని చెబుతున్నారు. మరెక్కడైనా పొరపాటు వల్ల చిన్నారికి హెచ్‌ఐవి సోకి ఉండొచ్చని రెడ్ క్రాస్ డైరెక్టర్ పిచ్చిరెడ్డి చెబుతున్నారు.
Tue, 09 Aug 202207:51 AM IST
జయసుధతో బీజేపీ సంప్రదింపులు
బీజేపీలో చేరాలని నటి జయసుధకు ఆహ్వానం లభించినట్లు ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జయసుధ ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఆమెకు పార్టీలోకి ఆహ్వానం పలికినట్లు ప్రచారం జరుగుతోంది.
Tue, 09 Aug 202206:15 AM IST
క్యాబ్ డ్రైవర్‌పై దాడి కేసులో నిందితుడి లొంగుబాటు
హైదరాబాద్ బిఎన్‌రెడ్డి నగర్లో క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు వివేక్ రెడ్డి పోలీసులకు లొంగిపోయారు. క్యాబ్ బుక్ చేసుకుని ప్రయాణించిన తర్వాత డబ్బులు అడగడంతో డ్రైవర్‌తో పాటు కారు యజమానిపై నిందితులు విచక్షణారహితంగా క్రికెట్ బ్యాట్‌లతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ వెంకటేష్ కోమాలోకి వెళ్లిపోయాడు. మరోవైపు ఈ ఘటనలో నిందితుల్ని తప్పించిన పోలీసులు బాధితుల్నే పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టడంతో తీవ్ర గాయాలపాలైన బాధితుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. ఈ ఘటన నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది.
Tue, 09 Aug 202206:15 AM IST
దుండిగల్ బహుదూర్ పల్లిలో హత్య
దుండిగల్ బహదూర్‌పల్లిలో సెక్యూరిటీ హెడ్ అరవింద్ హత్యకు గురయ్యాడు. విధుల కేటాయింపు విషయంలో సెక్యూరిటీ గార్డుతో జరిగిన వివాదంలో హత్య జరిగింది. సెక్యూరిటీ హెడ్ అరవింద్, గార్డు రవిల మధ్య వాగ్వాదం జరగడంతో ఆవేశంతో సెక్యూరిటీ గార్డు కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాల పాలైన అరవింద్‌ను కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.
Tue, 09 Aug 202201:51 AM IST
వరద ముంపు ప్రాంతాల్లో సీఎల్పీ పర్యటన
గోదావరి వరదల్లో ముంపుకు గురైన ప్రాంతాల్లో తెలంగాణ సిఎల్పీ బృందం పర్యటించనుంది. ఆగష్టు 16 నుంచి మూడ్రోజుల పాటు నేతలు ముంపు ప్రభావిత ప్రాంతాాల్లో పర్యటిస్తారు. పోలవరం ఎత్తు పెంచడం వల్లే ముంపు ఎక్కువైందనే ఆరోపణలపై త్వరలో ప్రాజెక్టును పరిశీలిస్తామని సిఎల్పీ నేతలు ప్రకటించారు.
Tue, 09 Aug 202201:51 AM IST
ఆ రోజు పుడితే ఆర్టీసీలో ఫ్రీ జర్నీ
స్వాతంత్య్ర దినోత్సవం రోజు పుట్టిన వారికి 12ఏళ్ల వయసు వచ్చే వరకు ఉచిత ప్రయాణాలకు అనుమతించాలని టిఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. 75ఏళ్లు పైబడిన వారికి తార్నాక ప్రభుత్వాసుపత్రిలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
Tue, 09 Aug 202201:51 AM IST
బాసర ట్రిపుల్ ఐటీలో చీకట్లు
బాసర ట్రిపుల్ ఐటీలో చీకట్లు అలుముకున్నాయి. సోమవారం మధ్యాహ్నం ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రాత్రంతా విద్యార్ధులు చీకట్లో ఉండిపోయారు. హాస్టల్ గదుల్లో మొబైల్ లైట్ల వెలుగులో విద్యార్ధులు గడపాల్సి వచ్చింది. మంగళవారానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని యూనివర్శిటీ అధికారులు చెబుతున్నారు.
Tue, 09 Aug 202201:51 AM IST
వర్గీకరణతో మాదిగలకు న్యాయం
ఎస్సీ వర్గీకరణతోనే మాదిగలు, అనుబంధ కులాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ కోరుతూ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించారు. మాదిగల హక్కులపై బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వర్గీ కరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
Tue, 09 Aug 202201:51 AM IST
బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడిగా శ్రీనివాస గౌడ్
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడిగా జాజుల శ్రీనివాస గౌడ్ ఎన్నికయ్యారు. ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో శ్రీనివాస్ గౌడ్‌ను జాతీయాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.