Godavari Floods 2022 : వరద గోదావరి.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
11 August 2022, 11:46 IST
- భారీ వర్షాలతో ధవళేశ్వరం వద్ద గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. బ్యారేజీ ప్రస్తుత నీటిమట్టం 13.75 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు.
ధవళేశ్వరం బ్యారేజీ(ఫైల్ ఫొటో)
ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గోదావరి నదికి భారీగా వరద వచ్చి చేరుతోంది. బ్యారేజీ ప్రస్తుత నీటిమట్టం 13.75 అడుగుల వద్ద ఉంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13.19 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాజమహేంద్రవరంలోని ఘాట్లను మూసివేశారు.
గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది. ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. సహాయక చర్యల్లో పాల్గొనేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 NDRF, 3 SDRF బృందాలను మోహరించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, వీఆర్‌పురంలో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మరోవైపు తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 52 అడుగులకు చేరుకుంది. మూడో ప్రమాద హెచ్చరికకు చేరువలో నీటిమట్టం ఉండడంతో ముంపు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది. ఎలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
గతంలో జరిగిన వరద నష్టంపై అంచనా వేసేందుకు కేంద్ర బృందాలు వచ్చాయి. తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందాలు పర్యటిస్తున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు రవినేష్ కుమార్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందాలు పరిశీలిస్తోంది. బుధవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేశారు. గురువారం కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. సీఎం జగన్ తో భేటీ కానున్నారు.