Bathukamma Festival | తీరొక్క పూల బతుకమ్మ.. తెలంగాణ ప్రకృతి పండగ!
Bathukamma festival significance: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో మహిళలంతా కలిసి జరుపునే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండగ వచ్చిందంటే తెలంగాణా పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తుంది. బతుకమ్మ పండుగ భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని తెలియజేస్తుంది.
Bathukamma Festival Significance: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో మహిళలంతా కలిసి జరుపునే పండుగ బతుకమ్మ. బతుకమ్మ పండగ వచ్చిందంటే తెలంగాణా పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అది ఒక పెద్ద సంబరంగా భావిస్తారు. మెట్టినింటికి వెళ్లిన ఆడబిడ్దలని పుట్టింటికి తీసుకు వస్తారు. కొత్తగా పెళ్ళైన ఆడపడుచులకు అత్తగారి ఇంటి నుంచి కాగితపు పూలతో చేసిన బతకమ్మను వాయినంగా పంపుతారు. అత్తగారింట్లో ఉండే ప్రతి ఆడపడుచూ ఎప్పుడు తమ పుట్టినింటికి వెళ్ళాలా? కన్నవారి పిలుపు ఎప్పుడు వస్తుందా? తనను తీసుకువెళ్ళడానికి అన్న ఇంకా రాలేదే అనే భావోద్వేగాన్ని వ్వక్తపరుస్తారు.
Bathukamma -Floral Festival: పూలతో పూలనే పూజ..
పూలతో పూలనే పూజిస్తూ ప్రకృతిని అరాధించే పండుగ బతుకమ్మ. పూలు బాగా వికసించే కాలంలో, జలవనరులు సమృధ్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఇవి తొమ్మిది రోజులపాటు సాగే ఉత్సవాలు. బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు. ఈ సంబరాల్లో భాగంగా ఆడపడుచులంతా కలిసి గౌరమ్మను (పసుపుతో చేస్తారు) బతుకమ్మతో పాటూ నిమజ్జనం చేస్తారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. ఈ సంబరాలు జరుపుకునే తొమ్మిది రోజులూ ఆడపడుచులు తీరొక్క పువ్వులతో బతుకమ్మను అందంగా పేర్చి, అందులో "బొడ్డెమ్మ" ను ప్రతిష్టించి, అలంకరించిన బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ, వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. ఏరోజుకారోజు నిమజ్జనం చేస్తారు. ప్రతీరోజుకూ ఓ ప్రత్యేకత ఉంటుంది.
తొమ్మిది రోజుల సాగే బతుకమ్మ ప్రత్యేక రోజులు
మొదటి రోజు - ఎంగిలి పూల బతుకమ్మ:
మహా అమావాస్యరోజు బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రమాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
రెండో రోజు - అటుకుల బతుకమ్మ:
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడ పప్పు, బెల్లం, అటుకులతో నైవేధ్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
మూడో రోజు - ముద్దపప్పు బతుకమ్మ:
ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.
నాలుగో రోజు - నానబియ్యం బతుకమ్మ:
నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.
ఐదో రోజు - అట్ల బతుకమ్మ:
అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆరో రోజు- అలిగిన బతుకమ్మ:
ఈరోజు ఆశ్వయుజ పంచమి. బతుకమ్మ అలకగా చెప్తారు. నైవేధ్యమేమి సమర్పించరు.
ఏడవ రోజు -వేపకాయల బతుకమ్మ:
బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేధ్యంగా సమర్పిస్తారు.
ఎనిమిదవ రోజు -వెన్నముద్దల బతుకమ్మ:
నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేధ్యం తయారు చేస్తారు.
తొమ్మిదవ రోజు - సద్దుల బతుకమ్మ:
ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నువ్వులన్నం తదితర నైవేధ్యాలు సమర్పిస్తారు.
ఇది బతుకమ్మ పండగలో చివరి రోజు, మహిళలంతా తమ బతుకమ్మలతో శోభయాత్రగా వెళ్లి పోయిరా బతుకమ్మా అంటూ ఊరి చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేస్తారు. నైవేధ్యాలను ఒకరికొకరు పంచుకుంటూ ప్రసాదంగా స్వీకరిస్తారు.