MLAs Poaching Case: ఎర కేసులో హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఏం చేయబోతుంది..?
29 December 2022, 15:06 IST
- MLAs Poaching Case Updates: ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
ఎమ్మెల్యేల ఎర కేసులో ప్రభుత్వం ఏం చేయబోతుంది
TS HC On MLAs Poaching Case: సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఏకంగా సిట్ ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వటమే కాకుండా... కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ మేరకు 98 పేజీలతో కూడిన తీర్పులో కీలక అంశాలను ప్రస్తావించింది. కేసును సీబీఐకి ఇవ్వడానికి గల కారణాలను 45 అంశాల రూపంలో వివరించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణ కాస్త సీబీఐ పరిధిలోకి వెళ్లటంతో... తెలంగాణ సర్కార్ ఏం చేయబోతుందనేది ఆసక్తిని రేపుతోంది.
ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి బెంచ్ తీర్పునిచ్చింది. అయితే ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ కు వెళ్లొచ్చు. ఈ క్రమంలో అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే మళ్లీ సిట్ ఉనికిలోకి వస్తుంది. లేకపోతే కేసు విచారణ కాస్త సీబీఐ పరిధిలోకి వెళ్తోంది. అయితే తెలంగాణ సర్కార్... ఈ విషయంలో ఎలా ముందుకెళ్లే అవకాశం ఉందనేది ఆసక్తికరంగా మారింది. తీర్పును సవాల్ చేస్తుందా..? అప్పీల్ కు వెళ్తుందా..? లేదా..? అనేది కూడా చూడాలి.
మరోవైపు ఈ కేసులోకి సీబీఐ ఎంట్రీ ఇవ్వటంతో ఏం జరగబోతుందనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రోహిత్ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. గుట్కా కేసుతో పాటు ఎమ్మెల్యేల ఎర కేసులోని పలు అంశాలపై విచారించినట్లు వార్తలు బయటికి వచ్చాయి. ఇదిలా ఉండగానే సీబీఐ తెరపైకి రావటంతో... నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సిట్ రద్దు కావటంతో ఆధారాలన్నీ కూడా సీబీఐకి అప్పగించాల్సి ఉంటుంది. వీడియోలకు సంబంధించి పెన్ డ్రైవ్ లు సహా మిగతా అన్ని వివరాలు సీబీఐకి అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా ఇప్పటికిప్పుడే జరిగే పరిస్థితి కనిపించటం లేదు. ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేయటం, తీర్పు రావటం వంటి జరిగిపోతే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.
మొత్తంగా ఎమ్మెల్యేల ఎర కేసు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఓవైపు బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈడీ విచారణకు హాజరైన రోహిత్ రెడ్డి కూడా బీజేపీ టార్గెట్ గా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఫిర్యాదు చేసిన తనపై కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీబీఐ రంగంలోకి దిగితే మరెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి.