తెలుగు న్యూస్  /  Telangana  /  Do Or Die Fight For Congress In Telangana Assembly Elections 2023

Munugode Impact: కాంగ్రెస్‌కు జీవన్మరణ పోరాటం

HT Telugu Desk HT Telugu

07 November 2022, 7:27 IST

    • Munugode Impact: తెలంగాణలో అత్యంత బలంగా ఉండే పార్టీ కాంగ్రెస్ రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. మరో 10 నెలల్లో ఎన్నికలను ఎదుర్కోబోతోంది.
కాంగ్రెస్‌కు జీవన్మరణ పోరాటంగా 2023 ఎన్నికలు
కాంగ్రెస్‌కు జీవన్మరణ పోరాటంగా 2023 ఎన్నికలు (ANI)

కాంగ్రెస్‌కు జీవన్మరణ పోరాటంగా 2023 ఎన్నికలు

Munugode Impact: తెలంగాణలో రానున్న ఎన్నికలు కాంగ్రెస్‌‌కు జీవన్మరణ పోరాటంగా మారనున్నాయి. రాష్ట్రంలో బతికి బట్టకట్టాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంటుంది. మునుగోడులా మూడోస్థానానికే పరిమితమయ్యేలా ఉంటే మాత్రం ఇక రాష్ట్రంలో ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. 2014లో, 2018లో ఓడిపోయినా పార్టీ ఉనికిలో ఉండడానికి కారణం మరో విపక్ష పార్టీ బలంగా లేకపోవడమే. కానీ ఇప్పుడు పలు ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం, మునుగోడులో రెండోస్థానంలో నిలవడం చూస్తుంటే ఇక 2023 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉండబోతోందని అవగతం అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

మునుగోడులో మొత్తం 2,25,874 ఓట్లు పోలైతే కాంగ్రెస్‌కు పడిన ఓట్లు 23,906 మాత్రమే. కేవలం 10.58 శాతం ఓట్లకు పరిమితమైంది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి 97,006 ఓట్లు (42.95 శాతం), బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 86,697 ఓట్లు (38.38 శాతం) లభించగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు లభించాయి.

అయితే ఉప ఎన్నిక ఫలితం మొత్తంగా సాధారణ ఎన్నికల్లో ప్రతిబింబిస్తుందని అంచనా వేయడానికి లేదు. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును బీజేపీ, కాంగ్రెస్ పంచుకుంటే అంతిమంగా అధికార పార్టీ టీఆర్ఎస్ లాభపడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను బలంగా లేని చోట్ల కాంగ్రెస్ విజయావకాశాలను బీజేపీ దెబ్బతీస్తుంది. అలాగే కాంగ్రెస్ కూడా బలంగా లేని చోట్ల బీజేపీ అవకాశాలను దెబ్బతీస్తుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎప్పుడూ బలమైన, గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థికి మళ్లుతుంది. పార్టీ ఓటు బ్యాంక్ పెద్దగా చెక్కుచెదరకపోయినప్పటికీ.. తటస్థ ఓటరు మాత్రం ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పుడు స్థానికంగా బలంగా ఉన్న పార్టీ అభ్యర్థికి వేస్తారు.

సాంప్రదాయక ఓటు బ్యాంకుతో తెలంగాణలోని సుమారు 30 నుంచి 40 నియోజకవర్గాల్లో మెరుగైన అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఇక్కడ బీజేపీ కూడా పంచుకునే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

ఇక ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే కనీసం 20 నుంచి 25 స్థానాల్లో బీజేపీ బలంగా ఉంటుందని అంచనా. కానీ ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు‌ను కాంగ్రెస్ చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో బీజేపీకి కూడా ఆయా సీట్లలో విజయావకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇటీవలి ఉప ఎన్నికల్లో చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉన్నట్టు ఫలితాల సరళి చూపలేదు. హుజురాబాద్, దుబ్బాక నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపు‌ను అక్కడి అభ్యర్థులపై ఉన్న సానుభూతి బాగా పనిచేసింది. ముఖ్యంగా ఈటెల రాజేందర్‌‌ను అవమానకరంగా పంపించేశారని, తెలంగాణ ఉద్యమ నేతగా, బీసీ నేతగా ఉన్న రాజేందర్‌కు అవమానం జరిగిందని స్థానికుల్లో బలంగా నాటుకుంది.

అలాగే దుబ్బాకలో రఘునందన్ రావు విజయానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఆయనపై ఉన్న సానుభూతి కొంత ఫలించింది. అలాగే అనారోగ్యంతో మరణించిన సోలిపేట రామలింగారెడ్డి భార్య అభ్యర్థిత్వం బలహీనంగా కనిపించడంతో ఓటర్లు రఘునందన్ రావుకు మొగ్గు చూపారు. ఇక నాగార్జున సాగర్ విషయంలో కూడా కాంగ్రెస్‌కు బలమైన అభ్యర్థిగా జానారెడ్డి బరిలో ఉన్నప్పటికీ అక్కడ అధికార పార్టీ అభ్యర్థి గెలిచారు. తాజాగా మునుగోడులో బీజేపీ అన్ని కోణాల్లో పనిచేసినప్పటికీ, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అక్కడ బలమైన నేతగా ఉన్నప్పటికీ ఫలితం దక్కలేదు. అయినా అధికార పార్టీ గెలిచింది. ఈ ఉదంతాలు ప్రభుత్వ వ్యతిరేకత అంతగా లేదని, ఉన్నా దానిని రెండు విపక్షాలు చీల్చివేస్తాయని, అంతిమంగా తమదే విజయమని అధికార పార్టీ భావిస్తుంది.

ఇలాంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో ఇక టీఆర్ఎస్ తప్ప గత్యంతరం లేదన్న పరిస్థితిని కల్పిస్తాయి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ మూడోస్థానానికి పరిమితమైతే ఉనికి లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగిలి ఉన్న 10 నెలలు ఆ పార్టీకి జీవన్మరణ పోరాటంగా కనిపిస్తోంది. కానీ ఆ పార్టీ నేతలు జనం కోసం కొట్లాడడానికి బదులు తమలో తామే కొట్టుకుంటారని ఉన్న పేరు జనంలో ఇంకా పలుచన చేస్తోంది. కాంగ్రెస్ భవితవ్యం తేలాలంటే మరో 10, 12 నెలలు ఆగాల్సిందే.