Telangana Congress : సీనియర్ నేత అడ్డాలో కాక రేపే కామెంట్స్.. అసలేం జరగబోతుంది?
11 March 2023, 5:15 IST
- Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్న వేళ... తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేత చేసిన కామెంట్స్... ఓ నియోజకవర్గంలో కాక పుట్టిస్తున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్
Congress Leader Mohammed Azharuddin Comments: తెలంగాణ కాంగ్రెస్... ఇప్పుడిప్పుడే ప్రజల్లోకి గట్టిగా వెళ్తోంది. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రతో ముందుకెళ్తుండగా... సీనియర్ నేతలు కూడా రంగంలోకి దిగుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో ఉన్నారు. బీఆర్ఎస్ ను ఢీకొట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. మరోవైపు టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. అయితే పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ బరిలో ఉంటానని అనటమే కాదు...ఏకంగా నియోజకవర్గం పేరును కూడా చెప్పి తన మనసులోని మాటను చెప్పారు. అంతే... టీ కాంగ్రెస్ లో టికెట్ల రచ్చ షురూ అయిందన్న చర్చ మొదలైంది…!
అజహరుద్దీన్.... ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. గతంలో కాంగ్రెస్ తరపున యూపీలోని మొరాదాబాద్ నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఆ తరువాత ఆయన తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పార్టీ కార్యక్రమాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు. అయితే శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన.... సంచలన కామెంట్స్ చేశారు. హైకమాండ్ ఛాన్స్ ఇస్తే... కామారెడ్డి నుంచి పోటీ చేస్తానంటూ తన మనసులోని చెప్పేశారు. లింగంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో... అజహరుద్దీన్ సమక్షంలో పలువురు హస్తం పార్టీలోకి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన అజహరుద్దీన్ ఈ కామెంట్స్ చేశారు.
వ్యూహాం మొదలైందా..?
అజహరుద్దీన్ కామెంట్స్ వెనక వ్యూహాం ఉందా అన్న చర్చ మొదలైంది. ఓ వర్గం ప్లాన్ ప్రకారమే పావులు కదుపుతుందా అన్న వాదన తెరపైకి వస్తోంది. నిజంగా పోటీ చేయాలని భావిస్తున్నారా..? ఇప్పటికే గ్రౌండ్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నారా..? అన్న చర్చ నడుస్తోంది. నిజానికి ఈ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నేత షబ్బీర్ అలీ ఉన్నారు. సీనియర్ నేతగా పేరున్న ఆయన.... ఇక్కడ అన్నీ తానై నడిపిస్తున్నారు. 2004లో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన.. వైఎస్ఆర్ మంత్రివర్గంలో బాధ్యతలు నిర్వర్తించారు. అయితే అనంతరం జరిగిన ఎన్నికల్లో.... 2009, 2014, 2018 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఇన్నిసార్లు ఇక్కడ్నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ... ఆయనకే టికెట్ ఇస్తూ వచ్చింది హైకమాండ్. ఇదే సమయంలో ప్రస్తుతం ఆయన రేవంత్ రెడ్డి వర్గంలో గట్టిగా పని చేస్తున్నారు. మొదట్నుంచి రేవంత్ కు మద్దతు ఇస్తూ వస్తున్నారు. సీన్ కట్ చేస్తే... రేవంత్ వర్గం కూడా షబ్బీర్ కు వ్యతిరేకంగా పావులు కదిపే పనిలో ఉందన్న టాక్ వినిపిస్తోంది అయితే.ఈసారి ఆయనకు సీటు దక్కకుండా చూడాలని ఓవర్గం భావిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అజహరుద్దీన్ కామెంట్స్ చేశారా..? షబ్బీర్ కు చెక్ పెట్టేలా హైకమాండ్ ను ఒప్పించే పనిలో పడ్డారా..? పార్టీలోని పలువురి సీనియర్ నేతల మద్దతూనే మంత్రాంగం షురూ చేయనున్నారా..? అన్న చర్చ మొదలైంది.
అజహరుద్దీన్ కామెంట్స్ తో షబ్బీర్ అలీ వర్గంలో అలజడి మొదలైనట్లు తెలుస్తోంది. ఫలితంగా కామారెడ్డి కాంగ్రెస్ లో కాక పుట్టినట్లు అయింది. ఇదీ కాస్త ఎక్కడి వరకు వెళ్తుంది..? షబ్బీర్ అలీకి చెక్ పెట్టడం సాధ్యమేనా....? అజహరుద్దీన్ అనుకున్నది సాధిస్తారా..? అన్నది తేలాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే...!