YS Sharmila in Paleru : పాలేరులో పోటీ చేస్తా - వైఎస్ఆర్ పాలన తెస్తా : షర్మిల-ys sharmila to contest from paleru in upcoming elections ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila In Paleru : పాలేరులో పోటీ చేస్తా - వైఎస్ఆర్ పాలన తెస్తా : షర్మిల

YS Sharmila in Paleru : పాలేరులో పోటీ చేస్తా - వైఎస్ఆర్ పాలన తెస్తా : షర్మిల

HT Telugu Desk HT Telugu
Aug 07, 2023 02:22 PM IST

YS Sharmila in Paleru : పాలేరు నుంచే పోటీ చేస్తానని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పునరుద్ఘాటించారు. పాలేరులో మళ్లీ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన రావాలని ఆకాంక్షించారు.

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల

YS Sharmila in Paleru : వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఈ స్థానం నుంచి పోటీ చేస్తానని ఇటీవల చెప్పిన ఆమె... ఇవాళ ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా పాలేరు నుంచే పోటీ చేస్తానని పునరుద్ఘాటించారు. మట్టి చేతపట్టుకుని.. పాలేరు మట్టి సాక్షిగా చెబుతున్నా.. ఇక్కడి నుంచే పోటీ చేయాలని వైఎస్ఆర్ బిడ్డగా నిర్ణయం తీసుకున్నానని భావోద్వేగంగా ప్రకటించారు. ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి వద్ద పార్టీ కార్యాలయ నిర్మాణానికి తల్లి విజయమ్మతో కలిసి షర్మిల భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పాలేరు ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరారు.

“కేవలం 5 ఏళ్లు పరిపాలించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఏ సీఎం సాధించనంత ఘనత సాధించారు. సంక్షేమం, అభివృద్ధి, జలయజ్ఞం, రుణమాఫీ, 108 అంబులెన్స్ వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. ఉచిత విద్యుత్ ఆలోచన చేసిన మొట్ట మొదటి నాయుకుడు వైఎస్ఆర్. ఫీజు రీయంబర్స్ మెంట్ తో పేద బిడ్డలను డాక్టర్లు, ఇంజినీర్లుగా చేశారు. ఆరోగ్య శ్రీతో పేదలకు పైసా ఖర్చు లేకుండానే కార్పొరేట్ వైద్యం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చారు. పాలేరు నియోజకవర్గానికి సాగు, తాగునీరు ఇచ్చిన ఏకైక నాయుకుడు రాజశేఖర్ రెడ్డి. పాలేరులో మళ్లీ రాజశేఖర రెడ్డి సంక్షేమ పాలన రావాలి. ప్రతి నిరుపేదకు ఇల్లు.. పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ .. మహిళలకు ఆర్థిక చేయూత.... వ్యవసాయాన్ని పండగ చేసే ప్రభుత్వం రావాలి" అని షర్మిల అన్నారు.

పాలేరు ప్రజల ప్రతి కష్టంలో తోడుంటానని ఈ సందర్భంగా వైఎస్ షర్మిల హామీ ఇచ్చారు. నియోజకవర్గ ప్రజల హక్కుల కోసం ఎంతవరకైనా కొట్లాడతానని అన్నారు. మాట ఇస్తే వెనక్కి తీసుకోని రాజశేఖర్ రెడ్డి బిడ్డగా చెబుతున్నానని.. ఇప్పుడు పాలేరు బిడ్డగా అడుగుతున్నానని.. ఆశీర్వదించాలని కోరారు.

వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానంలో ఈ రోజు చాలా ముఖ్యమైనదని.. ప్రజల భవిష్యత్తుని నిర్ణయించే ఒక పునాది రాయి ఖమ్మం నుంచి మొదలైందని వైఎస్ విజయమ్మ అన్నారు. ఖమ్మం జిల్లా రాబోయే కొత్త ప్రభుత్వానికి గుమ్మం అని వ్యాఖ్యానించారు. షర్మిల తెలంగాణ బిడ్డ కాదుని విమర్శించే వారందరికీ పాలేరు నుంచే జవాబు చెప్పాలని విజయమ్మ కోరారు. రాజశేఖర్ రెడ్డికి పులివెందుల లాగే షర్మిల పాలేరు గడ్డ సింహద్వారం అవుతుందని వ్యాఖ్యానించారు. షర్మిల ఏం తప్పు చేసిందని అరెస్టు చేశారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన బిడ్డను ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని స్పష్టం చేశారు.

Whats_app_banner