AP MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు.. 5 స్థానాల్లో వైకాపా విజయం ఖరారు -unanimous wins for ysrcp in 5 local body mlc constituencies in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Unanimous Wins For Ysrcp In 5 Local Body Mlc Constituencies In Andhra Pradesh

AP MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు.. 5 స్థానాల్లో వైకాపా విజయం ఖరారు

HT Telugu Desk HT Telugu
Feb 25, 2023 04:11 PM IST

AP MLC Elections : ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవ విజయాలు నమోదు చేస్తోంది. స్థానిక సంస్థల కోటాలో 9 స్థానాలకు ఎన్నికలు జరుగుతోండగా.. నామినేషన్ల పరిశీలన అనంతరం 5 చోట్ల కేవలం వైఎస్సార్సీపీ అభ్యర్థులే బరిలో నిలిచారు. దీంతో వారి విజయం దాదాపు ఖరారైంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు

AP MLC Elections : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఏకగ్రీవ విజయాలు నమోదు చేస్తోంది. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో 9 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.... వీటిలో 5 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించనున్నారు. వైయ‌స్ఆర్‌ కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. ఫిబ్రవరి 24న నామినేషన్ల పరిశీలన అనంతరం ఈ నియోజకవర్గాల్లో కేవలం వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే రంగంలో ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 27వ తేదీ వరకు గడువు ఉంది. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తారు.

ట్రెండింగ్ వార్తలు

వైయ‌స్ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ పత్రాల్లో బలపరిచిన వారి సంతకాలు ఫోర్జరీవని తేలడంతో ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు.

అనంతపురం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి వేలూరు రంగయ్య నామినేషన్‌ను అధికారులు స్క్రూటినీలో తిరస్కరించారు. దీంతో ఈ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎస్‌.మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిపాయి సుబ్రహ్మణ్యం ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మేరిగ మురళి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్‌ అభ్యర్థిత్వాన్ని తాను బలపరచలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని సూళ్లూరుపేట కౌన్సిలర్‌ చెంగమ్మ రిటర్నింగ్‌ ఆఫీసర్‌కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరించారు. ఇక్కడ మురళి ఎన్నిక ఏకగ్రీవం కానుంది.

తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా కుడుపూడి సూర్యనారాయణరావు ఎన్నిక లాంఛనమే కానుంది. టీడీపీకి చెందిన కడలి శ్రీదుర్గ, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించారు. బరిలో కుడుపూడి సూర్యనారాయణరావు మాత్రమే ఉన్నారు.

మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి. 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు.. 137 నామినేషన్లు.. రెండు టీచర్ల నియోజకవర్గాలకు 25 నామినేషన్లు ఫైల్ అయ్యాయి. స్థానిక సంస్థలు, పట్టభద్రులు, టీచర్ల స్థానాల్లో ఫిబ్రవరి 27 వరకు నామినేషన్ల ఉపససంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల చేస్తారు. ఏకగ్రీవమైన నియోజకవర్గాల్లో విజేతలను ప్రకటిస్తారు. ఏకగ్రీవం కాని స్థానిక సంస్థలు, పట్టభద్రులు, టీచర్ల స్థానాలకు మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు.

IPL_Entry_Point