CM Revanth Reddy : త్వరలోనే యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ - కీలక ప్రకటన
14 November 2024, 19:11 IST
- త్వరలోనే యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బాలల దినోత్సవ వేడుకల్లో మాట్లాడిన ఆయన.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కులగణన సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వే కోసం అధికారులు ఇంటింటికి వస్తున్నారని చెప్పారు. విద్యార్థులంతా తల్లిదండ్రులకు చెప్పాలని... కులగణనకు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అందాలంటే కులగణన సర్వే జరగాలని స్పష్టం చేశారు.
బాధ్యత విద్యార్థులదే…!
బాలల దినోత్సవ వేడుకల్లో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సామాజిక న్యాయం జరగాలంటే కులగణన సర్వే జరగాలన్నారు. కొంతమంది కుట్ర పూరితంగా కులగణన సర్వేపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఇది ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని తొలగొంచడానికి కాదని స్పష్టం చేశారు. కులగణన సర్వే మెగా హెల్త్ చెకప్ లాంటిదని పునరుద్ఘాటించారు. కులగన సర్వేకు అడ్డు వస్తే వారిని ద్రోహులుగా భావించండని వ్యాఖ్యానించారు.
“తెలంగాణ ప్రభుత్వం మొదటి ఏడాది ఉత్సవాలను ఇక్కడ బాలల దినోత్సవంతో ప్రారంభించుకోవడం సంతోషం. ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తీసుకొచ్చి అందరికి విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత జవహర్ లాల్ నెహ్రూ గారిది. ఉచిత నిర్బంధ విద్య ద్వారా పేదలకు విద్యను అందించేందుకు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో 7శాతం పైగా విద్యా శాఖకు కేటాయించింది. 20వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాం 35 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి చేశాం. డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి విద్యకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకున్నాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
త్వరలోనే ఉద్యోగాల భర్తీ…
త్వరలోనే యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. “విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి విద్యా కమిషన్ నియమించుకున్నాం. 26,854 ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల ప్రతిష్టను పునరుద్ధరించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారంలో రెండు రోజులు ప్రభుత్వ పాఠశాలల ను పర్యవేక్షించాలని ఇప్పటికే కలెక్టర్స్ ను ఆదేశించాం. హస్టల్స్ లో కలుషిత ఆహారం సరఫరా చేసే వారిని కఠినంగా శిక్షిస్తాం. నాసిరకం సరుకులు సరఫరా చేస్తే ఊచలు లెక్కబెట్టాల్సిందే” అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
“తెలంగాణ సమాజం వ్యసనాల వైపు వేగంగా పరుగెత్తుతోంది. చదువుకునే విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ కు బానిసలు అవుతున్న పరిస్థితి. వ్యసనాలకు బానిసలం కామని విద్యార్థులంతా నాకు మాట ఇవ్వండి. సమాజంలో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థానాలకు చేరతామని చెప్పండి. వచ్చే ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. చదువుతో పాటు క్రీడల్లో రాణించండి” అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు 25ఏళ్ల వయసు నిబంధన ఉందని ముఖ్యమంత్రి రెడ్డి గుర్తు చేశారు. 21 ఏళ్లకు ఎమ్మెల్యేగా పోటీ చేసే హక్కు కోసం అసెంబ్లీలో రెజల్యూషన్ మూవ్ చేయాలని మంత్రి శ్రీధర్ బాబుని కోరారు. దీనివల్ల రాజకీయాల్లో యువతరానికి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.