TG Caste Census : తెలంగాణ స్థానిక సమరానికి కులగణనే అసలు సమస్యా?
TG Caste Census : తెలంగాణ స్థానిక ఎన్నికలకు సందిగ్దత కొనసాగుతోంది. కుల గణన పూర్తి చేశాకే ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా కామారెడ్డి డిక్లరేషన్ లో కులగణన చేపడతామని ప్రకటించింది. కులగణన జరిగాక 42 శాతం రిజర్వేషన్ తో ఎన్నికలు నిర్వహించాలని నేతలు అంటున్నారు.
TG Caste Census : గ్రామ పంచాయతీల పదవీ కాలం పూర్తై ఏడు నెలలు కావొస్తోంది. ఇప్పటికీ పంచాయతీల ఎన్నికలపై ఒక స్పష్టత రాలేదు. రాష్ట్రంలో కుల గణన జరిగాకే, కొత్త రిజర్వేషన్లు నిర్ణయించి ఎన్నికలు జరపాలన్న డిమాండ్ ఆయా కుల సంఘాల నుంచి ఉంది. మరో వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే గ్రామీణ ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేయాలని, అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ లిస్టులు ఆధారంగా తుది డ్రాఫ్ట్ కు రూప కల్పన చేయాలని షెడ్యూలు సిద్ధం చేసింది. ఈ హడావుడి చూసి ఈ ఏడాది నవంబర్ లో, లేదంటే వచ్చే ఏడాది జనవరిలో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం ఊపందుకుంది. కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు ( గ్రామ పంచాయతీలు, మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లు) జరపాలంటే కులగణన ప్రధాన అడ్డంకింగా నిలుస్తోందన్నఅభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కామారెడ్డి డిక్లరేషన్ కు మోక్షం ఎప్పుడు?
తెలంగాణ శాసనసభకు గత ఏడాది జరిగిన ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. కామారెడ్డి డిక్లరేషన్ మేరకు తాము అధికారంలోకి వచ్చాక కులగణన చేపడతామని ప్రకటించింది. ఆ తర్వాత స్థానిక రిజర్వేషన్లను సవరించి ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కులగణనకు అనుకూలంగానే హామీలు ఇచ్చింది. జాతీయ కాంగ్రెస్ విధాన నిర్ణయంలో భాగంగానే తెలంగాణ పీసీసీ కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో కులగణన అంశాన్ని చేర్చింది. ఇటీవల సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా రాష్ట్ర రవాణ శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ‘ కుల గణన పూర్తి చేశాకే స్థానిక సంస్థలు నిర్వహిస్తాం..’ అని పేర్కొన్నారు.
మరో వైపు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.క్రిష్ణయ్య ‘ సమగ్ర కులగణన చేపట్టాలి. కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలి. స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ అమలు చేయాలి..’ అని కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల పదవీకాలం పూర్తయ్యి ఏడు నెలలు కావొస్తోంది. 2019 జనవరిలో పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది జనవరి 31వ తేదీతో పంచాయతీల పదవీ కాలం పూర్తయ్యింది. నాటి నుంచి పంచాయతీల పాలన స్పెషల్ ఆఫీసర్ల చేతుల్లోకి వెళ్లింది. మరో వైపు రెండు నెలల కిందటే జిల్లా పరిషత్, మండల పరిషత్ ల పదవీకాలం పూర్తయ్యింది. పంచాయతీ ఎన్నికల తర్వాత మండల పరిషత్ లు, జిల్లా పరిషత్ లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా 12,993 గ్రామ పంచాయతీలు, 32 జిల్లా పరిషత్ లు, 540 మండల పరిషత్ లు వీటి పరిధిలో వార్డు సభ్యలు, మండల ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) సభ్యులు, జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ (జెడ్పీటీసీ) సభ్యులు పోస్టులకు ఎన్నికలు జరగాలి. ఇంకో వైపు వచ్చే ఏడాది జనవరిలో పట్టణ స్థానిక సంస్థలైన నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవీ కాలం కూడా పూర్తి కావొస్తోంది. రాష్ట్రంలో 147 నగర పంచాయతీలు, 129 మున్సిపాలిటీలు, 17 కార్పొరేషన్లు ఉన్నాయి. దీంతో మొత్తంగా అటు గ్రామీణ, ఇటు పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ తన హామీని నిలబెట్టుకుని కులగణన త్వరగా పూర్తి చేస్తుందా? అన్న అంశంపై చర్చ జరుగుతోంది.
ఏ లెక్కల పకారం?
ప్రతీ పదేండ్లకు ఓ మారు జరిగే జనాభా లెక్కలు దేశంలో ఈ సారి జరగలేదు. 2011 తర్వాత 2021 లో జనాభా లెక్కింపు జరగాల్సి ఉన్నా ఇప్పటికీ మొదలు కాలేదు. సరైన సమయంలో జనాభా లెక్కలను పూర్తి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం దిల్లీలో మీడియాకు వెల్లడించారు. ఇప్పుడు రాష్ట్రంలో చేపట్టాల్సి ఉన్న కులగణనను మరి ఏ ప్రాతిపదికన చేస్తారన్న అంశంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవానికి కొన్ని రాజకీయ పార్టీలు, దేశంలోని కొన్ని రాష్ట్రాలు కుల గణనకు వ్యతిరేకంగా ఉన్నాయి. కులాల వారీగా జనాభా లెక్కలు తీయాలంటే ఇప్పటికిప్పుడు చేతిలో ఉన్న సమాచారం 2011 లెక్కలే. జనాభా లెక్కలు జరిగి ఇప్పటికే పదమూడేళ్లు గడిచిపోయింది.
కొత్త జనాభా లెక్కలు తీయాల్సిన ఉన్న నేపథ్యంలో, 2011 జనాభా లెక్కల జాబితాతో సంబంధం లేకుండా కొత్తగా జనాభాను ముఖ్యంగా కులాల వారీగా ప్రభుత్వం చేపడుతుందా అన్న చర్చ కూడా జరుగుతోంది. జనాభా లెక్కల కోసం అటు కేంద్రం తన బడ్జెట్ లో కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కులగణన కోసం బడ్జెట్ లో చేసిన కేటాయింపులు గానీ సంత్రుప్తికరంగా లేవన్న విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో కుల గణన ఎప్పుడు మొదలవుతుంది..? ఎన్నటికి పూర్తవుతుంది..? స్థానిక సంస్థలకు ఎప్పటికి ఎన్నికలు నిర్వహిస్తారు అన్న ప్రశ్నలకు జవాబులు దొరకాల్సి ఉంది.
( రిపోర్టింగ్: క్రాంతిపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )
సంబంధిత కథనం