Nalgonda Collecter Transfers : పదే.. పదే కలెక్టర్ల బదిలీలు..! ఎందుకిలా..?-repeated transfer of collectors in nalgonda district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda Collecter Transfers : పదే.. పదే కలెక్టర్ల బదిలీలు..! ఎందుకిలా..?

Nalgonda Collecter Transfers : పదే.. పదే కలెక్టర్ల బదిలీలు..! ఎందుకిలా..?

HT Telugu Desk HT Telugu
Nov 02, 2024 06:01 AM IST

నల్గొండలో కలెక్టర్ల బదిలీ చర్చనీయాంశంగా మారుతోంది. పాలనపై పట్టు దొరకకుండానే కలెక్టర్లు బదిలీ అవుతున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలలు తిరగకుండానే ముగ్గురు అధికారులకు స్థానం చలనం కలిగింది. పరిపాలనా సౌలభ్యం కోసమే నిర్ణయాలు ఉంటున్నాయా? లేక ఇతర కారణాలా..? అన్న చర్చ జోరుగా జరుగుతోంది.

కలెక్టర్ల బదిలీలు
కలెక్టర్ల బదిలీలు

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది నిండలేదు. డిసెంబరు 9వ తేదీ నాటికి ఏడాది అవుతోంది. అంటే మరో నెల రోజులు మిగిలి ఉన్నట్టే. అంటే పాలన పగ్గాలు చేపట్టి పదకొండు నెలలు. పరిపాలన సౌలభ్యం పేర కొనసాగుతున్న ఐఏఎస్ ల బదిలీలు జిల్లాల పరిపాలనపై ప్రభావం చూపిస్తున్నాయి.

నల్గొండ జిల్లాలో కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఏ అధికారీ నిండా ఆరు నెలలు పనిచేయలేదు. 2023 డిసెంబరు 9వ తేదీన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబరు నెలాఖరుకు నల్గొండ జిల్లాలో ఏకంగా ముగ్గురు కలెక్టర్లకు స్థాన చలనం కలిపించింది. కాగా, ఇపుడు నాలుగో అధికారి కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు.

ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్న కలెక్టర్లు…!

కారణాలు ఏవైనా.. జిల్లా పరిపాలనపై పట్టు సాధించి జిల్లాను ప్రగతి పథంలో పరుగులు పెట్టించాలంటే ఇక్కడి దీర్ఘకాలిక సమస్యలు, భౌగోళిక స్వరూపం, రాజకీయాలను అవగాహన పెంచుకుని అధికార యంత్రాంగంపై పట్టు సాధించడానికి ఏ ఉన్నతాధికారికైనా కొంత గడువు ఇవ్వాలి. కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ ల బదిలీలు జరిగిన ప్రతీ సారీ జిల్లా కలెక్టర్లకూ స్థానచలనం కలగడం వల్ల జిల్లాలో పేరుకుపోతున్న పెండింగ్ సమస్యలకు మోక్షం దొరకడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో స్థానిక ప్రభుత్వ యంత్రాంగం సైతం సరైన దిశా నిర్దేశం లేకుండా పని చేస్తోందన్న అభిప్రాయం ఉంది.

ఎన్నికల కమిషన్ చేపట్టిన బదిలీల్లో భాగంగా గత ఏడాది (2023) జులై 26వ తేదీ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న ఆర్.వి.కర్ణన్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వెంటనే డిసెంబరు 19వ తేదీ (2023)న బదిలీ అయ్యారు. అంటే కాంగ్రెస్ పాలన పగ్గాలు చేపట్టిన పది రోజులకే ఆయన బదిలీపై వెళ్లిపోయారు. ఆర్.వి.కర్ణన్ స్థానంలో జిల్లా కలెక్టర్ గా దాసరి హరిచందన ఈ ఏడాది (2024) జనవరి 8వ తేదీన జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు. ఆమె విధుల్లో చేరిన వెంటనే లోక్ సభ ఎన్నికల విధులకు పరిమితం కావాల్సి వచ్చింది.

ఎంపీ ఎన్నికలు ముగిసి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజులకే జూన్ 16వ తేదీన ఆమె బదిలీ అయ్యారు. కేవలం ఎన్నికల నిర్వహణ కోసమే అన్నట్టుగా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆర్.వి.కర్ణన్, పార్లమెంటు ఎన్నికల కోసం దాసరి హరిచందన కలెక్టర్లుగా నియమితులయ్యారా అన్న వ్యాఖ్యలు వినిపించాయి. హరిచందనకు జూన్ 16వ తేదీన బదిలీ కాగా, ఆమె స్థానంలో సి. నారాయణ రెడ్డి నల్గొండకు కలెక్టర్ గా వచ్చారు. గతంలో ఆయనకు ఇక్కడ జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉండడం, ఇక్కడి సమస్యలపై అవగాహన కూడా ఉండడం, గతంలో ములుగు, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాలకు కలెక్టర్ గా పనిచేసిన అనుభవంతో జిల్లా పాలన గాడిలో పడుతుందని అంతా ఆశించారు.

కానీ, ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ఐఏఎస్ ల బదిలీల్లో అక్టోబరు 28న ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్ళారు. ఆయన స్థానంలో టూరిజం శాఖ నుంచి ఇలా త్రిపాఠి జిల్లా కలెక్టర్ గా వచ్చారు. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పాటైన పదకొండు నెలల కాలంలో నల్గొండకు కలెక్టర్ గా వచ్చిన మూడో అధికారి, మొత్తంగా నాలుగో అధికారి కావడం గమనార్హం.

దాసరి హరి చందన కలెక్టర్ గా కేవలం అయిదు నెలల ఏడు రోజులు మాత్రమే పనిచేస్తే, సి.నారాయణ రెడ్డి కేవలం నాలుగు నెలల 12 రోజులు మాత్రమే కలెక్టర్ గా పనిచేశారు. వచ్చే ఏడాది గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ లకు, మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత కలెక్టర్ ఇలా త్రిపాఠీ సైతం ఎన్నికల విధులకే పరిమితం కావాల్సి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వరసగా కలెక్టర్లు బదిలీ కావడం వెనుక పరిపాలనా పరమైన కారణాలు ఉన్నాయా..? లేక, రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

Whats_app_banner

సంబంధిత కథనం