Telangana Sports University : 70 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్శిటీ - 14 క్రీడలకు ప్రత్యేక హబ్, కీలక ఆదేశాలు
Telangana Sports Policy : కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. స్పోర్ట్ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని.. స్వయం ప్రతిపత్తి కూడా ఉండాలని సూచించారు. 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియంలోనే వర్శిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అద్భుతమైన క్రీడాకారులను తీర్చిదిద్దటంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణకు గుర్తింపు తెచ్చేలా కొత్త క్రీడా విధానం తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2036 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త పాలసీలో లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.
కొత్త స్పోర్ట్ పాలసీ ముసాయిదాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను ప్రధానంగా చర్చించి పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెలకొల్పనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీని యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీగా తీర్చిదిద్దాలని దిశానిర్దేశం చేశారు.
స్పోర్ట్స్ హబ్ లో 14 క్రీడలు..
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ తరహాలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీని పీపీపీ తరహాలో నిర్వహించాలని సీఎం రేవంత్ తెలిపారు. ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి చైర్మన్‌ను నియమించాలని… యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి ఉండాలని ఆదేశించారు. ఈ యూనివర్సిటీలో క్రికెట్, హాకీ, ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, టెన్నిస్, బ్యాడ్మింటన్, షూటింగ్, బాక్సింగ్, రెజ్లింగ్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, అక్వాటిక్స్ లాంటి 14 క్రీడలను స్పోర్ట్స్ హబ్‌లో చేర్చాలన్నారు.
అన్ని ఒకే గొడుకు కిందకి…
దాదాపు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ప్రాంగణంలో స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం, హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, కోట్ల విజయ భాస్కరరెడ్డి ఇండోర్ స్డేడియం, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం, ఓయూలోని వెలోడ్రోమ్ ప్రముఖ క్రీడా మైదానాలు, స్టేడియంలు అన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెచ్చి స్పోర్ట్ హబ్‌గా మార్చాలన్నారు.
తెలంగాణ భౌగోళిక పరిస్థితులతో పాటు ఇక్కడి యువతకు ఆసక్తి ఉన్న క్రీడలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శిక్షణకు దేశ విదేశాల్లో ఉన్న కోచ్‌లను రప్పించాలని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఆగస్టు నెలలోనే ముచ్చర్ల ప్రాంతంలో స్కిల్ యూనివర్శిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక్కడ కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. తెలంగాణలో అభివృద్ధి చెందుతున్న వివిధ రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎంపిక చేశారు. మొత్తం 17 ప్రాధాన్య రంగాలను గుర్తించారు.
ఫార్మా, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్, రిటైల్, యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్..తొలుత ఆరు రంగాల్లో ఉపాధి అవకాశాలున్న కోర్సులను ప్రవేశ పెడుతారు. ప్రతి కోర్సును సంబంధిత రంగంలో పేరొందిన ఒక కంపెనీ భాగస్వామ్యం ఉండేలా అనుసంధానం చేస్తారు. అందుకు సంబంధించి ప్రభుత్వం కంపెనీలతో ఎంవోయూ చేసుకుంటుంది. తొలి ఏడాది రెండు వేల మందితో ప్రారంభించి… క్రమంగా ఏడాదికి 20 వేల మందికి ఈ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.