తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kcr : ఈ నెల 31న బీహార్ కు వెళ్తున్న సీఎం కేసీఆర్...జాతీయ రాజకీయాలే టార్గెట్..!!

KCR : ఈ నెల 31న బీహార్ కు వెళ్తున్న సీఎం కేసీఆర్...జాతీయ రాజకీయాలే టార్గెట్..!!

HT Telugu Desk HT Telugu

30 August 2022, 6:23 IST

google News
    • తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాలపై ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఇప్పటికే పంజాబ్ రైతులకు ఆర్థిక సాయం చేసిన సీఎం కేసీఆర్ తాజాగా బీహార్ లో కూడా వలస కార్మికులకు సాయం చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 31న సీఎం కేసీఆర్ పాట్నా వెళ్లనున్నారు.
బీహార్‌ వెళ్లనున్న కేసీఆర్
బీహార్‌ వెళ్లనున్న కేసీఆర్

బీహార్‌ వెళ్లనున్న కేసీఆర్

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీ నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు సాయం అందించిన కేసీఆర్ ఇప్పుడు బీహార్ వలస కార్మికులకు సాయం అందించేందుకు సిద్ధమవుతున్నారు.

బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో పాట్నాకు బ‌య‌ల్దేరి వెళ్ల‌నున్న కేసీఆర్. అక్కడ సీఎం నితీష్ కుమార్ తో భేటీ కానున్నారు. ఇటీవలే ఎన్డీఎతో తెగదెంపులు చేసుకున్న నితీష్ కుమార్ తో సీఎం కేసీఆర్ భేటీ కానుండటంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. అంతే కాదు ఈ పర్యటన సందర్బంగా గాల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల్లో అమ‌రులైన బీహార్‌కు చెందిన ఐదుగురు భార‌త సైనికుల కుటుంబాల‌కు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అంద‌జేయ‌నున్నారు.

ఇటీవ‌ల సికింద్రాబాద్ టింబ‌ర్ డిపో అగ్నిప్ర‌మాదంలో చ‌నిపోయిన 12 మంది బీహార్ వ‌ల‌స కార్మికుల కుటుంబాల‌కు కూడా కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అంద‌జేయ‌నున్నారు. బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్‌తో క‌లిసి కేసీఆర్ చెక్కుల‌ను అంద‌జేస్తారు. అనంత‌రం నితీశ్ కుమార్ తో కలిసి కేసీఆర్ లంచ్‌కు వెళ్ల‌నున్నారు. అక్కడ జాతీయ రాజకీయాలపై ఇరువురు సీఎంలు చర్చించనున్నారు.

అయితే ఈ భేటీలో ఇటీవల బీహార్ లో చోటు చేసుకున్న పరిణామాలు, అలాగే జాతీయ స్థాయిలో బీజేపీని ఎలా కట్టడి చేయాలనే అంశంపై కేసీఆర్, నితీష్ తో కలిసి సమాలోచనలు చేయనున్నారు. ప్రస్తుతం బీజేపీయేతర, కాంగ్రేసేతర ఫ్రంట్ తయారీలో కలిసి వచ్చే పార్టీలను సైతం సీఎం కేసీఆర్ సమాయత్తం చేసే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు తెలంగాణలో మాత్రం బీజేపీ ఇప్పటికే బండి సంజయ్ పాదయాత్రతో దూకుడు పెంచింది. వరుసగా మునుగోడు, వరంగల్ సభలతో సత్తా చాటింది. అయితే మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా విజయం దక్కించుకోవాలని కమల దళం పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టుగానే గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం సైలెంటుగా గ్రౌండ్ వర్క్ చేస్తోంది. ముఖ్యంగా నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి బలమైన నేతను పోటీగా నిలిపే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు వీలైతే మునుగోడును కైవసం చేసుకొని బీజేపీ జైత్రయాత్రకు చెక్ పెట్టాలని ప్రయత్నం చేస్తోంది.

జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ తో కలిసి వచ్చే ప్రాంతీయ పార్టీలు, ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నాయి. మొన్న మహారాష్ట్రలో కేసీఆర్ భేటీ అనంతరం ఉద్ధవ్ థాక్రే సర్కారు కూలగా, నేడు జార్ఖండ్ లో సీఎం హేమంత్ సోరెన్ సీటు కిందకు నీళ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో బీజేపీయేతర శక్తులను వెతకడం సీఎం కేసీఆర్ కు రాను రాను కష్టతరం అవుతోంది. కేసీఆర్‌ను కట్టడి చేసేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చుకుంటోంది. బీజేపీ విషయంలో కేసీఆర్‌ కూడా వెనక్కి తగ్గడం లేదు.

తదుపరి వ్యాసం