Bandi Sanjay On KCR : ఆ కారణంగా సీఎం కేసీఆర్ భయపడుతున్నారు
06 September 2022, 18:17 IST
- Bandi Sanjay Comments On CM KCR : ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిని బాధ్యుడిని చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తన కొడుకు, కుమార్తెపై వస్తున్న అవినీతి ఆరోపణలతో సీఎం కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొన్నారు.
బండి సంజయ్(ఫైల్ ఫొటో)
తెలంగాణలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు ప్రజలు భయపడే పరిస్థితికి తెచ్చారని బండి సంజయ్ అన్నారు. ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని నలుగురు మహిళలు చనిపోయారన్నారు. భారతదేశంలో ఎక్కడా జరగని ఘటన అని బండి సంజయ్ అన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం వాళ్లని ఆదుకోలేదని ఆరోపించారు. గంట లోపల 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడమేంటని బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళా డాక్టర్ కూడా లేకుండా సర్జరీలు చేయడం దారుణమని పేర్కొన్నారు.
'ఇబ్రహీంపట్నం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల ఘటనలో ఆరోగ్యశాఖ మంత్రిని బాధ్యుడిని చేయాలి. తన కొడుకు, కుమార్తెపై వస్తున్న అవినీతి ఆరోపణలతో సీఎం కేసీఆర్ భయపడుతున్నారు. మునుగోడు ఉపఎన్నికలో ఓడిపోతామనే భయం కేసీఆర్‌కు పట్టుకుంది. ఈ కారణంగా సీఎం బాగా డిప్రెషన్‌లోకి వెళ్లారు. ఎన్నికలు వస్తేనే మోటార్లకు మీటర్లు గుర్తొస్తాయి. మా పేరు చెప్పి మీటర్లు పెడితే ఊరుకోం.' అని బండి సంజయ్ అన్నారు.
గంటలోగా 34 మందికి కు.ని శస్త్రచికిత్సలు చేశారని బండి సంజయ్ అన్నారు. శస్త్రచికిత్సల తర్వాత బెడ్‌లు లేకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. మృతులు అందరూ.. పేద కుటుంబాలకు చెందిన కూలీలు అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలను ఎవరూ పరామర్శించలేదని తెలిపారు. పేదలు, రైతులు చనిపోవడం రాష్ట్రంలో సర్వసాధారణంగా మారిందని విమర్శించారు. ఘటనకు బాధ్యత వహిస్తూ మంత్రి హరీశ్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. హెల్త్ డైరెక్టర్ పైనా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు.