ఇబ్రహీంపట్నం కాల్పుల ఘటన.. ఫ్రొఫెషనల్ షూటర్లు వచ్చినట్లుగా పోలీసుల అనుమానం
ఇబ్రహీంపట్నం కాల్పుల కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారుల మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కర్ణంగూడ కాల్పుల కేసు దర్యాప్తును పోలీసులు చాలా సీరియస్ గా చేస్తున్నారు. కేసు గురించి వివరాలను రాచకొండ సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఈ కేసు లో మీడియా సమన్వయం పాటించాలని కోరారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో నిందితులు తప్పించుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కార్లు, గన్స్ స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ కేసు లో పూర్తి వివరాలు వెల్లడయ్యాక మీడియా సమావేశం నిర్వహిస్తామని మహేష్ భగవత్ చెప్పారు.
ఈ కేసులో భూ తగాదాలే కాల్పులకు కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు శ్రీనివాస్ రెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. రాఘవేందర్ రెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. కాల్పులకు లేక్ వ్యూ విల్లా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ కు ఎలాంటి సంబంధం లేదని అసోసియేషన్ సభ్యులు చెబుతున్నారు.
గతంలో మృతుల ఇద్దరిపై పలు కేసులు, వివాదాలు ఉన్నట్టు తెలుస్తోంది. అన్నీ కోణాల్లోనూ రాచకొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి డ్రైవర్ తో పాటు, పక్క పొలానికి చెందిన మట్టా రెడ్డి, మరికొంత మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రొఫెషనల్ షూటర్లు కాల్పులు జరిపినట్లుగా అనుమానిస్తున్నారు. రెక్కీ నిర్వహించి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి పై కాల్పులు జరిపి హత్య చేసినట్లు భావిస్తున్నారు. సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించి ఉండొచ్చని కోణంలో ఆరా తీస్తున్నారు.
మొబైల్ సెల్ టవర్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్వోటీ, ఐటీ సెల్, సీసీఎస్, ఎస్బీ, ఇంటెలిజెన్స్ పోలీసులు బృందాలుగా ఏర్పాటు అయ్యారు. కాల్పుల కోసం రెండు గన్స్ వాడినట్టు గుర్తించారు. రెండు వేరు వేరు బుల్లెట్లుగా తేల్చారు. షార్ట్ వెపన్ తో శ్రీనివాస్ రెడ్డిని, పిస్టల్ తో రఘుని కాల్చి చంపారు. షార్ప్ షూటర్ ఉన్నట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. సంఘటనా స్థలం లో మరో ముగ్గురు ఉన్నట్టు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఘటనాస్థలంలోనే శ్రీనివాస్ రెడ్డి చనిపోయారు. చికిత్స పొందుతూ రాఘవేందర్ రెడ్డి మరణించారు. తమపై కాల్పులు జరిపింది ఎవరో తెలియదని చెప్పిన రాఘవేందర్ రెడ్డి.. కాసేపటికే పరిస్థితి విషమించి చనిపోయారు. దీంతో కాల్పుల గురించి తెలుసుకుందామనుకునే సమయంలోనే.. ఆయన చనిపోవటంతో కేసు విచారణ కాస్త సవాల్‌గా మారింది. ఇక సాంకేతిక ఆధారాలపైనే దృష్టి పెట్టారు పోలీసులు. మృతుల కాల్‌డేటా, సెల్‌ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా విచారణ జరుపుతున్నారు.