తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Musi Row : ముషీరాబాద్‌లో ఉద్రిక్తత.. కేటీఆర్ కారుపై దాడి!

Musi Row : ముషీరాబాద్‌లో ఉద్రిక్తత.. కేటీఆర్ కారుపై దాడి!

01 October 2024, 13:22 IST

google News
    • Musi Row : హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముషీరాబాద్‌లో కేటీఆర్ కారుపై దాడి జరిగింది. కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ.. కేటీఆర్ కారుపైకి ఎక్కారు. పోలీసులు వారిని లాక్కెళ్లారు.
కేటీఆర్ కారుపై దాడి
కేటీఆర్ కారుపై దాడి

కేటీఆర్ కారుపై దాడి

మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్ కారుపై దాడి జరిగింది. ముషీరాబాద్‌లో కేటీఆర్ కారును అడ్డుకున్నారు. కొందరు కేటీఆర్ కారుపైకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఓ వ్యక్తి కారు పైకి ఎక్కగా.. పోలీసులు లాక్కెళ్లారు. ఆందోళన చేసిన వారి చేతిలో కొండా సురేఖ ఫ్లెక్సీలు ఉన్నాయి. దీంతో ముషీరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

అటు కేటీఆర్ మూసీ బాధితుల పరామర్శ పర్యటనపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అంబర్ పేట్, గోల్నాక లో కేటీఆర్ పర్యటనను అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా వచ్చారు. అటు కాంగ్రెస్ శ్రేణులు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తల యాక్టివిటీతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా చర్యలు చేపడుతున్నారు.

మరోవైపు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇండ్ల కూల్చివేతలు ప్రారంభం అయ్యాయి. తొలి ప్రక్రియలో భాగంగా రివర్‌ బెడ్‌ లో కూల్చివేతలు చేపట్టారు. చాదర్‌ఘాట్‌లోని మూసానగర్, రసూల్‌పురా, శంకర్‌నగర్ ఏరియాలో మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఈ సమయంలో అధికారులకు, అక్కడి ప్రజలకు వాగ్వాదం జరిగింది.

'సామాన్లు తీసుకునే వరకు ఆగమంటే ఆగరెందుకు.. చెప్తే వినకుండా రాజకీయం చేస్తున్నారా.. వెళ్లిపోండి మీరు ఇక్కడి నుంచి' అంటూ ప్రజలు అధికారుల తో గొడవకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సడెన్‌గా వచ్చి ఇళ్లు కూల్చేస్తే.. ఎక్కడికి పోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేస్తోందని వాపోయారు.

అటు గచ్చిబౌలి లో అక్రమంగా నిర్మించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని కూల్చివేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు.. రామమ్మకుంట చెరువు బఫర్ జోన్‌ లో అక్రమంగా నిర్మించిన కేంద్ర ప్రభుత్వ కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. అన్ని తెలిసిన అధికారులే బఫర్ జోన్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయం నిర్మాణం జరిపితే.. ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

'మూసీ ప్రక్షాళన అనేది పెద్ద స్కాం. 2400 కిలోమీటర్లు ఉండే గంగానది ప్రక్షాళనకు కేంద్ర ప్రభుత్వం రూ.40 వేల కోట్లు ఖర్చు చేసింది. అదే 55 కిలోమీటర్ల మూసీ సుందరీకరణకు రూ. లక్షా 50 వేల కోట్లు అవుతుందంటే.. దీన్ని స్కాం అనే అంటారు. కూల్చే పరిస్థితులు వస్తే.. ముందు కూల్చాల్సింది హుస్సేన్ సాగర్ నాలా మీద ఉన్న హైడ్రా కార్యాలయాన్ని కుల్చండి' అని కేటీఆర్ సోమవారం వ్యాఖ్యానించారు.

అటు తెలంగాణ హైకోర్టులో హైడ్రాపై సోమవారం విచారణ జరిగింది. ఈ విచారణకు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్ వర్చువల్‌గా హాజరైయ్యారు. తాము అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పాలని.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే కూల్చేస్తారా అంటూ హైడ్రా కమిషనర్‌ను ప్రశ్నించింది. అటు అమీన్‌ పూర్‌ తహశీల్దార్‌ పైనా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. భవనాన్ని 48 గంటల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోపే ఎలా కూల్చుతారంటూ ధర్మాసనం సీరియస్‌ అయ్యింది.

తదుపరి వ్యాసం