Hyderabad : గచ్చిబౌలిలో రేవ్ పార్టీపై రైడ్ - అదుపులో యువతి, యువకులు!-hyderabad city police bust rave party seize ganja and liquor ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : గచ్చిబౌలిలో రేవ్ పార్టీపై రైడ్ - అదుపులో యువతి, యువకులు!

Hyderabad : గచ్చిబౌలిలో రేవ్ పార్టీపై రైడ్ - అదుపులో యువతి, యువకులు!

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 11, 2024 12:55 PM IST

హైదరాబాద్ SOT పోలీసులు గచ్చిబౌలిలో రేవ్​ పార్టీని భగ్నం చేశారు. గంజాయి ప్యాకెట్లు, ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. 20 మందికిపైగా యువతి, యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

రేవ్ పార్టీ..!representative image
రేవ్ పార్టీ..!representative image (image source from unsplash.com )

రేవ్ పార్టీలపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా గచ్చిబౌలి పరిధిలో ఓ గెస్ట్ హౌస్ లో తలపెట్టిన రేవ్ పార్టీపై ఎస్‌ఓటీ పోలీసులు రైడ్ చేశారు. 20 మందికిపైగా యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరి వద్ద నుంచి గంజాయి, మద్యం, ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పార్టీ నిర్వహించిన వారికి, పాల్గొన్న వారికి నోటీసులు జారీ చేశారు. దొరికిన వారిలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా వివరాలను వెల్లడించాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

కొద్దిరోజులుగా  తెలంగాణలో డ్రగ్స్, గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా డ్రగ్స్  ను నిర్మూలించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని పదే పదే చెప్పారు.  గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల నిర్మూలన కోసం న్యాబ్ విభాగాన్ని పటిష్టంచేసి ఏకంగా యుద్ధం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. 

కేరళలో విజయవంతమైన పోలీసింగ్ సర్వీస్ విధానాన్ని తెలంగాణలోనూ అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అన్ని ఇంటర్ , డిగ్రీ కళాశాలల్లో కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కొద్దిరోజుల కిందట సీఎం రేవంత్ రెడ్డి… పోలీస్ అధికారులను కూడా ఆదేశించారు. ఆ దిశగా కూడా పోలీశ్ శాఖ ప్రయత్నాలు షురూ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవాళ తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు . కొందరు వ్యసనాలకు అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. మాదకద్రవ్యాలకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

 

టాపిక్