Hyderabad : హోంగార్డు మృతి.. హైడ్రా బలి తీసుకుందనడం సరికాదు : రంగనాథ్‌-hydra commissioner av ranganath key comments on the death of the home guard ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad : హోంగార్డు మృతి.. హైడ్రా బలి తీసుకుందనడం సరికాదు : రంగనాథ్‌

Hyderabad : హోంగార్డు మృతి.. హైడ్రా బలి తీసుకుందనడం సరికాదు : రంగనాథ్‌

Basani Shiva Kumar HT Telugu
Sep 29, 2024 10:30 PM IST

Hyderabad : ఇటీవల సంగారెడ్డి జిల్లాలో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. అప్పుడు అపశ్రుతి జరిగింది. ఓ హోంగార్డుకు గాయాలయ్యాయి. అతను చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై తాజాగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. అతన్ని హైడ్రా బలి తీసుకుందనడం సరికాదన్నారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామంలో పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన మూడు అంతస్తుల భవనాన్ని.. బాంబులతో కూల్చేశారు అధికారులు. అయితే.. కూల్చివేత సమయంలో శిథిలాలు తగిలి హోం గార్డ్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే.. హోంగార్డును హైడ్రా బలి తీసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు.

'కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టవద్దు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదు. హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదు. సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. సంగారెడ్డిలో హోంగార్డు గాయపడి చనిపోతే హైడ్రా బలి తీసుకుందనడం సరికాదు' అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ వ్యాఖ్యానించారు.

చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద ఆదివారం రాత్రి సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చంచల్‌గూడలో కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్‌లను ఇస్తామని చెప్పింది. దీంతో ముందుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్‌రూమ్‌ల పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారు గొడవకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

హైడ్రాను బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు సపోర్ట్ చేశారు. చెరువులో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అది నాగార్జున అయినా, రఘునందన్ రావు, ఎన్టీఆర్ అయినా సరే.. చెరువు కబ్జా చేస్తే కూలగొట్టేయాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారులకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 'హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించకండి. సంగారెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల పేరిట అధికారులు అతుత్సాహం ప్రదర్శించకండి. హైడ్రా ఔటర్ రింగ్ రోడ్డు లోపలికే పరిమితం. ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి. నేను ముఖ్యమంత్రితో మాట్లాడుతా. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు హైడ్రా విషయంలో ఎలాంటి భయాందోళనలు అక్కర్లేదు.. నేను మీతో ఉన్నా' అని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సోమవారం మూసీ పరివాహక ప్రాంత బాధితుల దగ్గరకు వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి.. మొదట రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హైదర్ గూడలో పర్యటించనున్నారు. అనంతరం అత్తాపూర్‌లోని కిషన్ బాగ్ ప్రాంతాల్లోని మూసీ ప్రాజెక్ట్ వలన నష్టపోతున్న ప్రజలను కలవనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డిపై మాజీమంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నారు. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కుంటలో ఉంది. సర్వే నంబర్ 1138 రెడ్డికుంటలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉంది. అతని తమ్ముడి ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉంది. ముందు మీ ఇండ్లు కూల్చుకోండి.. తర్వాత పేద ప్రజల దగ్గరికి రండి' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.