Raj Bhavan Vs Pragathi Bhavan: వివాదాలు సరే.. రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయత అంతేనా?
26 January 2023, 17:40 IST
- తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు సరికొత్త వివాదానికి కేరాఫ్ గా మారాయి. ఇదంతా కూడా గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ అన్నట్లు సాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో పరేడ్ గ్రౌండ్ వేదికగా ప్రభుత్వం వేడుకలు జరిపింది. కానీ రాజ్ భవన్ - ప్రగతి భవన్ మధ్య గ్యాప్ మాత్రం మరింత పెరిగినట్లే అయింది. రెండు కీలకమైన వ్యవస్థల మధ్య వివాదం క్రమంగా బలపడుతుండటం చూస్తుంటే రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడుతున్నాయా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణలో గణతంత్ర వేడుకల వివాదం
Republic Day controversy in Telangana: రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్.... ఇదీ తెలంగాణలో గత కొంతకాలంగా నడుస్తున్న చర్చ..! కేవలం చర్చనే కాదు.. చోటు చేసుకుంటున్న పరిణామాలు...చేస్తున్న కామెంట్స్ ఇందుకు బలం చేకూరుస్తున్నాయి . కొంత కాలంగా రెండు ప్రధాన రాజ్యాంగ వ్యవస్థల మధ్య క్రమంగా దూరం పెరుగుతున్న వేళ... తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి గణతంత్ర వేడుకలు ఇందుకు సందర్భమయ్యాయి. అయితే ఈ తరహా పరిణామాలు చర్చనీయాంశంగా మారటమే కాదు రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయతను కూడా సన్నగిల్లేలా చేస్తున్నాయనే వాదనలకు కూడా బలం చేకూరుస్తున్నాయి.
రెండేళ్లుగా గ్యాప్…!
అసలు విషయానికొస్తే… గత రెండేళ్లుగా ప్రగతి భవన్ - రాజ్ భవన్(ముఖ్యమంత్రి - గవర్నర్) మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా గణతంత్ర వేడుకల నేపథ్యంలో కూడా మరోసారి తెరపైకి వచ్చింది. ఇదీ కాస్త తెలంగాణ హైకోర్టు వరకు చేరింది. ఇదే విషయంపై దాఖలైన పిటిషన్ పై విచారించిన కోర్టు... వేడుకలను ఘనంగా నిర్వహించాలని... కొవిడ్ సాకుగా చూపి తప్పుకోవటం సరికాదని స్పష్టం చేసింది. ఫలితంగా వేడుకలను పరిమితంగా నిర్వహించాలనుకున్న తెలంగాణ ప్రభుత్వం... హైకోర్టు ఆదేశాలతో వేడుకలను జరపాల్సి వచ్చింది. అయితే ఇదంతా కూడా నాటకీయ పరిణామాల మధ్య పూర్తి అయినట్లు అనిపించింది. కోర్టు ఆదేశాలతో పరేడ్ గ్రౌండ్ వేదికగా నిర్వహించే గణతంత్ర వేడుకల గురించి గురువారం ఉదయం వరకు సంబంధిత అధికారులకు కనీసం సమాచారం ఇవ్వలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. రాజ్ భవన్ లో జరిగిన వేడుకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాలేదు. ఫలితంగా సీఎం కేసీఆర్.. కోర్టు ఆదేశాలను ఏదో ఒక రూపంలో దాటవేశారనే వాదన వినిపిస్తోంది. మరోవైపు వేడుకల సందర్భంగా సర్కార్ ను కార్నర్ చేస్తూ రాజ్ భవన్(గవర్నర్) నుంచి సౌండ్ కాస్త గట్టిగానే వచ్చింది. ఇందుకు బదులుగా ప్రభుత్వ వ్యవస్థలోని వ్యక్తుల నుంచి రీసౌండ్ కూడా మొదలైంది. ఫలితంగా రెండు ప్రధానమైన రాజ్యాంగ వ్యవస్థల మధ్య వార్ మరింత ముదిరినట్లు అయింది.
అయితే గణతంత్ర వేడుకల విషయంలో టీ సర్కార్... రాజ్ భవన్ కు ముందుగానే లేఖ రాసింది. కొవిడ్ దృష్ట్యా గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రాజ్‌భవన్‌లోనే ఉత్సవాలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఫలితంగా పరేడ్ గ్రౌండ్ వేదికగా పోలీసుల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వచ్చే నెల (ఫిబ్రవరి 3)వ తేదీన ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం అనవాయితీగా వస్తోంది. అయితే గత బడ్జెట్ సందర్భంగానే ప్రభుత్వం... గవర్నర్ ప్రసంగాన్ని పక్కనపెట్టేసింది. దీనిపై ఓ రేంజ్ లోనే చర్చ జరిగింది. అయితే గణతంత్ర వేడుకలను ఘనంగా జరపాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చిన నేపథ్యంలో... గవర్నర్, ముఖ్యమంత్రి ఒకే వేదికపైకి వస్తారని.. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య ఉన్న వైరం కాస్త తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. కానీ బుధవారం సాయంత్రం నుంచి గురువారం వరకు జరిగిన పరిణామాలు చూస్తే మాత్రం... ఆ దిశగా ఏ మాత్రం అడుగులు పడలేదు. రాజ్ భవన్ వేదికగా గవర్నర్ తమిళిసై… ప్రభుత్వంపై తీవ్రస్థాయిలోనే విమర్శలు చేశారు. రాజ్యాంగాన్ని అగౌవరపరించారంటూ కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ప్రభుత్వంలోని వ్యక్తుల నుంచి డైలాగ్ లు పేలుతున్నాయి. తద్వారా ప్రగతి భవన్ - రాజ్ భవన్ మధ్య వైరం మరింత పెరిగే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
గణతంత్ర వేడుకల వివాదం విషయంలో సీఎం కేసీఆర్ టార్గెట్ గా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. గణతంత్ర వేడుకలను ఘనంగా జరపకపోవడమంటే.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను అవమానించినట్లే అంటూ తెలంగాణ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. కాంగ్రెస్ తో పాటు ఇతర పక్షాలు కూడా కేసీఆర్ తీరును ఖండించాయి. అయితే ఇక్కడ గమనిస్తే.. రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించటం కేసీఆర్ కు ఇష్టం లేకపోవటం, అంబేడ్కర్ ను గౌవరవించటంలేదనే వాదన పక్కన పెడితే... మొత్తంగా మాత్రం... రాజ్యాంగ వ్యవస్థను బలహీనపర్చే నిర్ణయం తీసుకున్నారనే సంకేతం మాత్రం గట్టిగానే ప్రతిబింబించినట్లు అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గవర్నర్లు వర్సెస్ ప్రభుత్వాలు...
గత కొంత కాలంగా చూస్తుంటే... పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వర్సెస్ ప్రభుత్వాలు అన్నట్లు పరిస్థితులు మారాయి. జరుగుతున్న పరిణామాలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఫలితంగా గవర్నర్ వ్యవస్థ మరోసారి చర్చనీయాంశంగా మారింది. అయితే తెలంగాణ విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం కొత్తగా ఏం లేదు. నిజానికి తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసైని... తెలంగాణ గవర్నర్ గా కేంద్రం నియమించటం, ఆ తర్వాత ఒక్కో పరిణామం చోటు చేసుకోవటంతో... రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గవర్నర్ ను కార్నర్ చేసే అవకాశం దొరికినట్లు అయింది. తమిళిసై గవర్నర్ గా వ్యవహరించకుండా.. బీజేపీ ప్రతినిధిగా పని చేస్తున్నారంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. గవర్నర్ గా ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు కూడా విస్మయానికి గురి చేస్తున్నాయని ప్రభుత్వంలోని వ్యక్తులు కూడా విమర్శిస్తున్నారు. రాజకీయంగా జోక్యం చేసుకునే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారని... రాజ్యాంగపరమైన అధికారాలను కూడా అతిక్రమించే దిశగా పని చేస్తున్నారని అంటున్నారు. గవర్నర్ చర్యలు చూస్తుంటే.. కేంద్రం డైరెక్షన్ లోనే పని చేస్తున్నట్లు కనిపిస్తోందంటూ పలువురు విశ్లేషకులు కూడా చెప్పటం గమన్హారం.
గవర్నర్ బహిరంగ వ్యాఖ్యలు...
ప్రగతి భవన్ - రాజ్ భవన్ మధ్య వైరం కొనసాగుతున్న వేళ... గవర్నర్ తమిళిసై సమయం దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రోటోకాల్ తో పాటు పలు అంశాల్లో బీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ డిఫెన్స్ లో పడేస్తున్నారు. ఓ మహిళ గవర్నర్ గా కూడా తనకు మర్యాద ఇవ్వటం లేదంటూ పదేపదే చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి(కేసీఆర్)తో కలిసి పని చేయటం చాలా కష్టమని అంటున్నారు. అయితే దీనిపై మరో వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీని రాజకీయంగా గట్టిగా ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తున్న కేసీఆర్ ను... అధికారం నుంచి పడగొట్టేందుకే ఈ తరహా ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రభుత్వంలోని వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్ భవన్ వేదికగా నిర్వహించే కార్యక్రమాలను సీఎంతో పాటు మంత్రులు కూడా దాటవేస్తున్నారు. దీనికి అనుబంధంగానే రాజ్ భవన్ వేదికగా జరిగిన రిపబ్లిక్ వేడుకలకు కూడా దూరమయ్యారనే చర్చ వినిపిస్తోంది.
తాజా పరిణామాలు చూస్తుంటే... రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్ కేంద్రంలోని బీజేపీ మధ్య మరింత విబేధాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తున్న బీజేపీ.. ఈ తరహా విధానాలను (గవర్నర్ వ్యవస్థను)ఎంచుకుంటుందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అయితే ఒక్క తెలంగాణలోనే కాదు... పలు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గవర్నర్ల తీరు, వారి నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్న సందర్భాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం తమిళనాడు, కేరళతో పాటు తెలంగాణ కూడా ఒకటి అని చెప్పొచ్చు. ఆయా ప్రభుత్వాలు.. గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరును సూటిగా ఖండిస్తున్నాయి. ఇక తాజాగా తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ వెళ్లిపోవటం వంటి ఘటనతో పాటు పలు అంశాలాల్లో గవర్నర్లపై వస్తున్న విమర్శలకు మరింత బలం చేకూర్చినట్లు కనిపిస్తోంది. కేంద్రం ఆదేశాల మేరకు గవర్నర్లు పని చేస్తున్నారనే వాదన మరింత బలపడినట్లు అనిపిస్తోంది.
నిజానికి గవర్నర్లకు , రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొత్తేమీ కాదు. భారత రాజకీయ వ్యవస్థలో గవర్నర్ల వ్యవస్థ వచ్చిన నాటి నుంచి ఏదో ఒక విధంగా చర్చకు దారి తీస్తూనే వస్తోంది. అయితే ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎటువైపు వెళ్తాయనేది మాత్రం కాస్త ఆందోళనకరమనే చెప్పొచ్చు. అయితే మొత్తం ఎపిసోడ్ లో చూస్తే… వివాదాలు రావటం, సఖ్యత కుదరటం పక్కనబెడితే… గవర్నర్, ముఖ్యమంత్రి వంటి ప్రధానమైన రాజ్యాంగ వ్యవస్థల విశ్వసనీయత కూడా దెబ్బతినే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రాజ్యాంగం ప్రసాదించిన మహనీయులతో పాటు రాజ్యాంగ గొప్పతనాన్ని స్మరించుకునే గణతంత్ర దినోత్సవ వేళ... ఈ తరహా పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకోవటం ఏ మాత్రం సరికాదేమో…!