తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Mcc On Run Out: బౌలర్ విలన్ కాదు.. నాన్ స్ట్రైకర్‌దే తప్పు.. లైన్ దాటితే రనౌట్ చేయాల్సిందే: ఎంసీసీ

MCC on run out: బౌలర్ విలన్ కాదు.. నాన్ స్ట్రైకర్‌దే తప్పు.. లైన్ దాటితే రనౌట్ చేయాల్సిందే: ఎంసీసీ

Hari Prasad S HT Telugu

24 February 2023, 12:54 IST

google News
    • MCC on run out: బౌలర్ విలన్ కాదు.. నాన్ స్ట్రైకర్‌దే తప్పు.. లైన్ దాటితే రనౌట్ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది ఎంసీసీ. క్రికెట్ లో నాన్ స్ట్రైకర్ ను బౌలర్ రనౌట్ చేస్తుండటంపై నెలకొన్న వివాదానికి మరోసారి తెరదించే ప్రయత్నం చేసింది.
నాన్ స్ట్రైకర్ లైను దాటితే రనౌట్ చేయడం బౌలర్ హక్కు అన్న ఎంసీసీ
నాన్ స్ట్రైకర్ లైను దాటితే రనౌట్ చేయడం బౌలర్ హక్కు అన్న ఎంసీసీ

నాన్ స్ట్రైకర్ లైను దాటితే రనౌట్ చేయడం బౌలర్ హక్కు అన్న ఎంసీసీ

MCC on run out: ఓ బౌలర్ బాల్ విసరక ముందే నాన్ స్ట్రైకర్ క్రీజు వదిలి పరుగు తీయడానికి ప్రయత్నించడం ఎంతోకాలంగా చూస్తూనే ఉన్నాం. అలాంటి బ్యాటర్లను ఓ బౌలర్ ఔట్ చేస్తే మన్కడింగ్ అనే పిలిచేవాళ్లు. చాలా కాలంగా ఇది వివాదాస్పదంగా మారడంతో క్రికెట్ నిబంధనలను రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రంగంలోకి దిగి దీనిని కూడా సాధారణ రనౌట్ గా పరిగణించాలని స్పష్టం చేసింది.

తాజాగా ఎంసీసీలో ఈ నిబంధనలను పరిరక్షించే వరల్డ్ క్రికెట్ కమిటీ మరోసారి నాన్ స్ట్రైకర్ల రనౌట్ పై వివరణ ఇచ్చింది. ఈ కమిటీలో గంగూలీ, సంగక్కర, లాంగర్, కుక్, గ్యాటింగ్ లాంటి లెజెండరీ క్రికెటర్లు ఉన్నారు. ఈ కమిటీ ప్రకారం.. అన్ని ఏజ్ గ్రూప్ లలోనూ ఓ బౌలర్ ఇలా నాన్ స్ట్రైకర్ ను ఔట్ చేయడాన్ని తప్పనిసరి చేయాలి. అంతేకాదు ఈ విషయంలో ఇక వివాదం ఉండకూడదు.

నాన్ స్ట్రైకర్‌దే తప్పు

ఇక్కడ బౌలర్ విలన్ కాదు.. నాన్ స్ట్రైకర్ కచ్చితంగా బంతి విసిరే వరకూ క్రీజులో ఉండాల్సిందే.. వాళ్లు లైన్ దాటితే బౌలర్ ఎలాంటి వార్నింగ్ ఇవ్వకుండా ఔట్ చేసే హక్కు ఉంది అని కూడా ఈ కమిటీ స్పష్టం చేసింది. గత నెలలో బిగ్ బాష్ లీగ్ లో ఆస్ట్రేలియా బౌలర్ ఆడమ్ జంపా.. నాన్ స్ట్రైకర్ టామ్ రోజర్స్ ను రనౌట్ చేసిన తర్వాత ఎంసీసీ ఈ నిబంధనల్లోని పదాలలో మార్పులు చేసి మరింత స్పష్టత తీసుకొచ్చింది.

ఎంసీసీ వరల్డ్ క్రికెట్ కమిటీలోని సభ్యుడు సంగక్కర ప్రకారం.. ఇలాంటి సందర్భాల్లో బౌలర్ విలన్ కానే కాదు. క్రీజు వదిలిన బ్యాటర్ దే అసలు తప్పు. "ఈ విషయంలో ఎలాంటి అయోమయం, వివాదం అవసరం లేదు. ఓ బౌలర్ బంతి విసిరే వరకూ నాన్ స్ట్రైకర్ తన క్రీజు వదలకుండా ఉంటే సరిపోతుంది" అని సంగక్కర స్పష్టం చేశాడు. ఇలాంటి సందర్భాల్లో బ్యాటర్ దే తప్పు అని కమిటీలోని సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకరించినట్లు కూడా సంగక్కర వెల్లడించాడు.

వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు

ఇక ఇలాంటి రనౌట్ల విషయంలో ముందు ఒకసారి బౌలర్ వార్నింగ్ ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదని కూడా అతడు తేల్చి చెప్పాడు. ఓ నాన్ స్ట్రైకర్ తొలిసారి ఇలా చేసినా కూడా ఓ బౌలర్ కు అతన్ని రనౌట్ చేసే పూర్తి హక్కు ఉందని సంగక్కర అన్నాడు.

"ఇక్కడ బౌలర్ విలన్ కాదు. ఓ బ్యాటర్ కు క్రీజులోనే ఉండటం, లైను దాటడం అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఇందులో రెండోదానిని వాళ్లు ఎంచుకుంటే వాళ్లే నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు" అని సంగక్కర స్పష్టం చేశాడు.

తదుపరి వ్యాసం