Cricket Rules | క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. ప్రకటించిన ఎంసీసీ-mcc bans use of saliva to shine ball and mankad no longer unfair play says new rules ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Cricket Rules | క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. ప్రకటించిన ఎంసీసీ

Cricket Rules | క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. ప్రకటించిన ఎంసీసీ

Hari Prasad S HT Telugu
Mar 09, 2022 11:22 AM IST

Cricket Rules.. క్రికెట్‌ కోడ్‌ ఆఫ్‌ లాస్‌లో బుధవారం కీలక మార్పులు చేసింది మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ). గతవారం సమావేశమైన ఎంసీసీ లాస్‌ సబ్‌ కమిటీ 2022 కోడ్‌ ఆఫ్‌ లాకు కొన్ని మార్పులు చేసింది.

మన్కడింగ్ ఇక సాధారణ రనౌటే
మన్కడింగ్ ఇక సాధారణ రనౌటే (Twitter)

లండన్: క్రికెట్‌లో ఇక బంతి మెరుపు కోసం లాలాజలం ఉపయోగించకూడదు.. మన్కడింగ్‌ ఇక ఏమాత్రం అన్‌ఫెయిర్‌ ప్లే కాదు.. ఎంసీసీ తాజాగా క్రికెట్‌ నిబంధనల్లో చేసిన మార్పుల్లో ఇవి కీలకమైనవిగా చెప్పొచ్చు. క్రికెట్‌ నిబంధనలను రూపొందించే మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ బుధవారం 2022 కోడ్‌ ఆఫ్‌ లాను విడుదల చేసింది. ఇందులో కొన్ని మార్పులు చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

- ఇన్నాళ్లూ మన్కడింగ్‌ (బౌలర్‌ బాల్‌ వేయకుండా క్రీజు వదిలిన నాన్‌స్ట్రైకర్‌ను రనౌట్‌ చేయడం) వివాదాస్పదంగా ఉండేది. పైగా ఇది అన్‌ఫెయిర్‌ ప్లేను సూచించే లా 41లో ఉండేది. ఎంసీసీ ఇప్పుడు దీనిని 41వ నిబంధన నుంచి తీసి సాధారణ రనౌట్‌ల నిబంధనలు ఉండే లా 38లో చేర్చింది. ఈ రనౌట్‌ నిబంధనలు మాత్రం అలాగే ఉంటాయి.

- క్రికెట్‌లో బంతి మెరుపు కాపాడటానికి ప్లేయర్స్‌ లాలాజలాన్ని ఉపయోగించడం సాధారణం. కొవిడ్‌ కారణంగా ఇలా చేయకుండా నిషేధించారు. ఇప్పుడు దానిని శాశ్వతంగా నిషేధించారు. లాలాజలం స్థానంలో ప్లేయర్స్‌ చెమటను ఉపయోగిస్తున్నారు. ఇది కూడా బంతి మెరుపు కోసం, స్వింగ్‌ కోసం బాగానే ఉపయోగపడుతోందని ఎంసీసీ స్పష్టం చేసింది. ఇక నుంచి లాలాజలం వాడితే బంతి ఆకారాన్ని మార్చడానికి ప్రయత్నించడం కిందకే వస్తుంది.

- క్రికెట్‌ నిబంధనల్లోని లా 18.11లో కీలకమైన మార్పు చేసింది ఎంసీసీ. ఇక నుంచి ఓ బ్యాటర్‌ క్యాచ్‌ ద్వారా ఔటైతే.. తర్వాత వచ్చే బ్యాటర్‌ స్ట్రైకర్‌ ఎండ్‌లోనే(ఓవర్‌ పూర్తయి సందర్భాల్లో తప్ప) బ్యాటింగ్‌ ప్రారంభిస్తాడు. ఇన్నాళ్లూ ఫీల్డర్‌ క్యాచ్‌ పట్టేలోపు నాన్‌స్ట్రైకర్‌ పిచ్‌లో సగం దూరం దాటితే నాన్‌స్ట్రైకరే తర్వాతి బంతి ఎదుర్కొనేవాడు. అప్పుడు కొత్త బ్యాటర్‌ నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉండాల్సి వచ్చేది. కొత్త రూల్‌ ప్రకారం నాన్‌స్ట్రైకర్‌తో సంబంధం లేకుండా కొత్తగా వచ్చే బ్యాటరే స్ట్రైక్‌ తీసుకుంటాడు.

- ఇక డెడ్‌ బాల్‌ నిబంధనల్లోనూ మార్పులు చేశారు. ఎవరైనా వ్యక్తి, జంతువు, ఏదైనా వస్తువు గ్రౌండ్‌లోకి వచ్చినప్పుడు.. అది ఇరు జట్లలో ఎవరికైనా దాని వల్ల నష్టం కలిగిందని అంపైర్ భావిస్తే.. ఆ బాల్‌ను డెడ్‌ బాల్‌గా ప్రకటించవచ్చని ఎంసీసీ స్పష్టం చేసింది.

- బౌలర్‌ బాల్‌ వేయకముందే బ్యాటర్‌ను రనౌట్‌ చేయడానికి స్ట్రైకర్‌ వైపు బంతి విసిరితే అది డెడ్‌బాల్‌గా ప్రకటించాలని కొత్తగా ఎంసీసీ ప్రకటించింది. ఇన్నాళ్లూ చాలా అరుదుగా జరిగే ఈ సందర్భాల్లో బంతిని నోబాల్‌గా ప్రకటించేవారు.

- ఓ బాల్‌ను వైడ్‌గా ప్రకటించే నిబంధనల్లోనూ మార్పులు చేశారు. ఈ మధ్య కాలంలో బ్యాటర్లు కొత్త కొత్త షాట్లు ఆడటానికి క్రీజులో అటూఇటూ కదులుతున్నారు. దీనివల్ల అంపైర్లు కొన్ని బాల్స్‌ను వైడ్‌గా ప్రకటిస్తున్నారు. అయితే అలా కాకుండా ఓ బౌలర్‌ రనప్‌ ప్రారంభించినప్పుడు బ్యాటర్‌ ఏ స్థానంలో ఉన్నాడో దాన్ని బట్టే అంపైర్‌ బాల్‌ను వైడ్‌గా ప్రకటిస్తాడు. షాట్లు ఆడటానికి అటుఇటూ కదిలిన సందర్భాల్లోనూ మొదట బ్యాటర్‌ నిల్చున్న స్థానాన్ని బట్టే వైడ్‌ ఇస్తారు.

- కొత్త రూల్‌ ప్రకారం.. పిచ్‌ బయట పడిన బంతిని కొట్టే అనుమతి కూడా బ్యాటర్‌కు ఇచ్చింది. అయితే అలాంటి బంతిని కొట్టే సందర్భాల్లో బ్యాటర్‌ శరీరం లేదా బ్యాట్‌ కొంత భాగమైనా క్రీజులో ఉండాలి.

- బంతి విసిరే సమయంలో ఫీల్డింగ్‌ టీమ్‌లో ఎవరైనా అటూఇటూ కదిలితే బ్యాటింగ్‌ టీమ్‌కు 5 పెనాల్టీ రన్స్‌ ఇస్తారు. ఇప్పటి వరకూ ఇలాంటి బాల్‌ను డెడ్‌బాల్‌గా ప్రకటించేవారు. ఇది బ్యాటింగ్‌ జట్టుకు ప్రతికూలంగా ఉండేది. ఈ కొత్త రూల్‌ వల్ల ఫీల్డింగ్‌ టీమ్‌ మరింత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్