Zampa Run Out: అశ్విన్‌లాగే జంపా రనౌట్‌ చేశాడు.. కానీ నాటౌట్‌ ఇచ్చారు.. ఎందుకో చెప్పగలరా?-zampa run out non striker in big bash league but third umpire given not out ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Zampa Run Out: అశ్విన్‌లాగే జంపా రనౌట్‌ చేశాడు.. కానీ నాటౌట్‌ ఇచ్చారు.. ఎందుకో చెప్పగలరా?

Zampa Run Out: అశ్విన్‌లాగే జంపా రనౌట్‌ చేశాడు.. కానీ నాటౌట్‌ ఇచ్చారు.. ఎందుకో చెప్పగలరా?

Hari Prasad S HT Telugu
Jan 03, 2023 07:34 PM IST

Zampa Run Out: అశ్విన్‌లాగే జంపా రనౌట్‌ చేశాడు. కానీ థర్డ్‌ అంపైర్‌ మాత్రం నాటౌట్‌ ఇచ్చాడు. బిగ్‌బాష్‌ లీగ్‌లో జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది. ఆ రనౌట్‌ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

నాన్ స్ట్రైకర్ ను రనౌట్ చేస్తున్న ఆడమ్ జంపా
నాన్ స్ట్రైకర్ ను రనౌట్ చేస్తున్న ఆడమ్ జంపా (Twitter/@Big Bash League (BBL))

Zampa Run Out: నాన్‌ స్ట్రైకర్‌ను ఓ బౌలర్‌ బాల్ వేయక ముందే రనౌట్‌ చేయడాన్ని గతంలో మన్కడింగ్‌ అనే వాళ్లు. ఇది చాలాసార్లు వివాదాస్పదమైంది. అయితే క్రికెట్‌లో కొత్త రూల్స్‌ రావడంతో దీనిని కూడా ఓ సాధారణ రనౌట్‌గా పరిగణిస్తున్నారు. గతంలో ఓసారి ఇండియన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ కూడా ఐపీఎల్‌లో జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ ద్వారా ఔట్‌ చేయడం తీవ్ర దుమారం రేపింది.

ఇప్పుడు బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా అచ్చూ అశ్విన్‌లాగే నాన్‌ స్ట్రైకర్‌ను రనౌట్‌ చేశాడు. తాను బౌలింగ్‌ చేయడానికి వెళ్తూ నాన్‌ స్ట్రైకర్‌ క్రీజు వదలడం చూసి వికెట్లను గిరాటేశాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు. రీప్లేలు చూసిన మూడో అంపైర్ దీనిని నాటౌట్‌గా ప్రకటించాడు. ఇప్పుడు కొత్త రూల్స్‌ ప్రకారం ఇది సాధారణ రనౌటే కదా అని అనుకున్న స్టేడియంలోని ప్రేక్షకులకు షాక్‌ తగిలింది.

అసలు ఇది ఎలా నాటౌట్‌ అన్నది చాలా మందికి అంతుబట్టలేదు. అయితే ఇక్కడ థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా డిక్లేర్‌ చేయడానికి ఓ కారణం ఉంది. అప్పటికే బౌలర్‌ బాల్‌ వేయడానికి తన చేతిని పూర్తిగా తిప్పాడు. ఆ సమయంలో బాల్‌ డెలివర్‌ చేయకుండా వెనక్కి వచ్చి వికెట్లను గిరాటేశాడు. ఒకవేళ బౌలర్‌ తన బౌలింగ్‌ యాక్షన్‌ను పూర్తి చేయకపోయి ఉంటే అది ఔట్‌.

ఇప్పుడు జంపా అలా చేయకపోవడంతో థర్డ్‌ అంపైర్‌ దీనిని నాటౌట్‌ ఇచ్చాడు. బిగ్‌ బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌, మెల్‌బోర్స్‌ స్టార్స్‌ మ్యాచ్‌లో జరిగిన ఈ ఘటనపై మరోసారి చర్చ మొదలైంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌ కూడా దీనిని నాటౌట్‌గా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించాడు. "రోజర్స్‌ అడ్వాంటేజ్‌ తీసుకోవడం లేదని ఎలా చెబుతారు? బౌలర్‌ బాల్‌ను రిలీజ్‌ చేయకముందే అతడు క్రీజును వదిలాడు. బౌలింగ్‌ యాక్షన్‌ పూర్తయిందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా అది ఔట్. జంపాకు పూర్తి హక్కు ఉంది" అని హాగ్‌ ట్వీట్‌ చేశాడు.

ఇదే బిగ్‌ బాష్‌ లీగ్‌లో రెండు రోజుల కిందట మైకేల్‌ నెసర్‌ అనే ఫీల్డర్‌ కూడా బౌండరీ లైన్‌ బయట క్యాచ్‌ పట్టినా ఔటివ్వడంపై కూడా చర్చ జరిగిన విషయం తెలిసిందే. బౌండరీ లైన్‌ బయట క్యాచ్‌ పట్టుకుంటే ఎలా ఔటిస్తారని చాలా మంది ప్రశ్నించారు.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్