Michael Neser catch: బౌండరీ లైన్ బయట క్యాచ్ పట్టినా ఔటిచ్చారు.. ఎలా? మీరైనా చెప్పగలరా?
Michael Neser catch: బౌండరీ లైన్ బయట క్యాచ్ పట్టినా ఔటిచ్చారు. అదెలాగో తెలియక కొందరు తికమక పడుతున్నారు. బిగ్ బాష్ లీగ్‌లో ఓ ఫీల్డర్ పట్టిన ఈ క్యాచ్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో కొత్త చర్చకు దారి తీసింది.
Michael Neser catch: టీ20 క్రికెట్ వచ్చిన తర్వాత బౌండరీల దగ్గర ఫీల్డర్ల విన్యాసాలు ఎన్నో చూస్తున్నాం. బ్యాట్స్‌మన్ కొట్టిన బాల్ కచ్చితంగా సిక్స్ వెళ్తుందని అనుకుంటున్న సందర్భంలో బౌండరీ దగ్గర ఉన్న ఫీల్డర్ గాల్లోకి ఎగిరి ఒడిసిపట్టుకోవడం.. ఆ క్రమంలో పట్టతప్పి బౌండరీ లైన్ బయటకు వెళ్లినా బంతిని గాల్లోకి విసిరి మళ్లీ లోపలికి వచ్చి క్యాచ్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
అయితే ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మైకేల్ నెసెర్ అనే ఫీల్డర్ పట్టిన క్యాచ్ మరోలా ఉంది. అతడు బౌండరీ లైన్ బయటకు వెళ్లిన తర్వాత కూడా అతని చేతుల్లో బంతి ఉంది. అయినా బ్యాట్స్‌మన్‌ను అంపైర్లు ఔట్‌గా ప్రకటించారు. ఇదెలాగో తెలియక కొందరు క్రికెట్ ఫ్యాన్స్ తికమకపడుతున్నారు.
ట్విటర్‌లో ఈ వీడియో షేర్ చేసి ఇదెలా ఔట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. బౌండరీ లైన్ దగ్గర ఉన్న నెసెర్ బంతిని అందుకున్నాడు. కానీ బౌండరీ లైన్ బయటకు వెళ్తున్నానని తెలుసుకొని బంతిని మళ్లీ గాల్లోకి విసిరాడు. బౌండరీ లైన్ బయటకు వెళ్లిన తర్వాత కూడా మరోసారి గాల్లోకి ఎగురుతూ క్యాచ్ పట్టుకున్నాడు. మళ్లీ నేలపై కాళ్లు పెట్టేలోపు బంతిని మరోసారి గాల్లోకి విసిరాడు.
ఆ తర్వాత బౌండరీ లైన్ లోపలికి వచ్చి దానికి అందుకున్నాడు. దీంతో అంపైర్లు దీనిని ఔట్‌గా ప్రకటించారు. మొదట్లో ఇది కొందరిని అయోమయానికి గురి చేసినా.. తర్వాత రీప్లేల్లో చూస్తే ఎందుకు ఔటిచ్చారన్నది స్పష్టంగా తెలిసిపోయింది. నెసెర్ బౌండరీ లైన్ బయట క్యాచ్ అందుకున్నా కూడా బంతి తన చేతుల్లో ఉన్న సమయంలో అతని కాళ్లు నేలపై లేవు.
గాల్లోకి ఎగిరి అందుకుంటూ మళ్లీ గ్రౌండ్‌పై కాలు పెట్టేలోపు గాల్లోకి విసిరాడు. దీంతో సాంకేతికంగా చూస్తే ఇది ఔటే. మొదట్లో కామెంట్రీ ఇస్తున్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా ఇదెలా ఔట్ అంటూ వ్యాఖ్యానించాడు. కానీ రీప్లేలు చూసిన తర్వాత ఇది న్యాయమైన నిర్ణయమే అని, క్రికెట్ నిబంధనల ప్రకారం ఔటే అని గిల్లీ తేల్చాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సంబంధిత కథనం
టాపిక్