Sourav Ganguly returns to IPL: ఐపీఎల్‌కు తిరిగొచ్చిన గంగూలీ.. ఢిల్లీ క్యాపిటల్స్‌తో డీల్
Sourav Ganguly returns to IPL: ఐపీఎల్‌కు తిరిగొచ్చాడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. బోర్డు ప్రెసిడెంట్ పదవీకాలం ముగిసిన తర్వాత మరో అవకాశం దక్కకపోవడంతో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో డీల్ కుదుర్చుకున్నాడు.
Sourav Ganguly returns to IPL: ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెట్టాడు. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమితుడైనట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయని పీటీఐ తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా ముగిసినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.
"అవును. సౌరవ్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వస్తున్నాడు. ఇప్పటికే చర్చలు, అందుకు సంబంధించిన విధివిధానాలు పూర్తయ్యాయి. గతంలోనూ అతడు ఫ్రాంఛైజీకి పని చేశాడు. ఓనర్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. అతడు ఐపీఎల్‌కు తిరిగి వస్తే అది ఢిల్లీ క్యాపిటల్సే అవుతుంది" అని ఐపీఎల్ వర్గాలు చెప్పినట్లు పీటీఐ తన రిపోర్ట్‌లో వెల్లడించింది.
ఈ ఫ్రాంఛైజీకి సంబంధించిన మొత్తం క్రికెట్ వ్యవహారాలను గంగూలీ పర్యవేక్షించనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తోపాటు ఐఎల్‌టీ20 టీమ్ దుబాయ్ క్యాపిటల్స్, ఎస్‌ఏటీ20 టీమ్ ప్రిటోరియా క్యాపిటల్స్ వ్యవహారాలను గంగూలీ చూసుకుంటాడు. ఐపీఎల్‌లో ఆడిన సమయంలో గంగూలీ కోల్‌కతా నైట్‌రైడర్స్, పుణె వారియర్స్ కెప్టెన్‌గా ఉన్నాడు.
గతేడాది బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పదవీకాలం ముగిసింది. అప్పుడే ఐపీఎల్ ఛైర్మన్ పదవి ఆఫర్ వచ్చినా.. అందుకు దాదా అంగీకరించలేదు. ఇక ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌తో ఉన్న రికీ పాంటింగ్‌తో గంగూలీ కలిసి పని చేయనున్నాడు. ఐపీఎల్‌లో ఈ ఇద్దరూ తొలి సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆడారు. ఆ తర్వాత 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు పాంటింగ్ హెడ్ కోచ్‌గా, గంగూలీ మెంటార్‌గా నియమితులయ్యారు.
ఇప్పుడు మరోసారి అదే టీమ్‌కు కలిసి పని చేయబోతున్నారు. ఈ టీమ్‌లో వాళ్లు చేయాల్సిన మొదటి పని ఓ కొత్త కెప్టెన్‌ను వెతకడమే. ఎందుకంటే ఈ మధ్యే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో అతని స్థానంలో మరో కెప్టెన్‌ను నియమించాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం