MCC on Mankading: మన్కడింగ్ రనౌటేనా.. షమి చేసిన రనౌట్ చెల్లుతుందా.. ఎంసీసీ వివరణ ఇదీ
MCC on Mankading: మన్కడింగ్ రనౌటేనా.. షమి చేసిన రనౌట్ చెల్లుతుందా.. ఈ ప్రశ్నలకు ఎంసీసీ గురువారం (జనవరి 19) వివరణ ఇచ్చింది. ఈ నిబంధనకు చేసిన మార్పుల గురించి కూడా మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ స్పష్టత ఇచ్చింది.
MCC on Mankading: మన్కడింగ్.. క్రికెట్ లో కొన్ని దశాబ్దాలుగా వివాదస్పదమైన పదం ఇది. ఓ బౌలర్ తాను బాల్ వేసే ముందే క్రీజుల దాటిన నాన్ స్ట్రైకర్ ను రనౌట్ చేయడాన్ని చాలా రోజుల పాటు మన్కడింగ్ అని పిలిచారు. తొలిసారి ఇలా చేసిన వ్యక్తి పేరు మీదుగానే దీనికా పేరు వచ్చింది. అయితే గతేడాది క్రికెట్ నిబంధనలను రూపొందించే మెరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఇందులో మార్పులు చేసింది.
మన్కడింగ్ ను కూడా ఇక నుంచి సాధారణ రనౌట్ గానే గుర్తించాలని స్పష్టం చేసింది. అయినా ఈ మధ్యకాలంలో ఇలాంటి రనౌట్లు వివాదానికి కారణమవుతూనే ఉన్నాయి. ఈ మధ్య టీమిండియా బౌలర్ షమి.. శ్రీలంక కెప్టెన్ శనకను ఇలాగే రనౌట్ చేయాలని చూసినా.. తర్వాత రోహిత్ అప్పీల్ ను ఉపసంహరించుకున్నాడు. తర్వాత బిగ్ బాష్ లీగ్ లో బౌలర్ ఆడమ్ జంపా కూడా ఇలాగే ప్రత్యర్థి బ్యాటర్ ను రనౌట్ చేశాడు.
అయితే ఆ సమయానికి జంపా దాదాపు బాల్ ను విసిరే దశలో ఉన్నందువల్ల నాటౌట్ గా ప్రకటించారు. దీంతో ఈ నిబంధనపై నెలకొన్న అయోమయానికి తాజాగా ఎంసీసీ వివరణ ఇచ్చింది. నిబంధనల్లోని 38.3 కి చేసిన మార్పులపై స్పష్టత ఇచ్చింది. ఆటగాళ్లలో నెలకొన్న అయోమయాన్ని దూరం చేసే ఉద్దేశంతోనే తాము ఈ నిబంధనలో కీలక మార్పులు చేసినట్లు తెలిపింది.
"ఈ నిబంధనను ప్లేయర్స్, అంపైర్లు బాగానే అర్థం చేసుకుంటున్నా.. ఇందులోని అస్పష్టత అయోమయానికి దారి తీస్తోంది. అందుకే ఎంసీసీ 38.3 నిబంధనలోని పదాలకు మార్పులు చేసింది. ఈ పదాల్లో మార్పుల వల్ల నిబంధనలో ఎలాంటి మార్పు లేదు. ఓ బౌలర్ బంతి విసిరే అత్యున్నత స్థాయికి చేరేలోపు అంటే బంతిని చేతి నుంచి రిలీజ్ చేసే సమయం లోపు ఓ నాన్ స్ట్రైకర్ క్రీజు వదిలితే అతన్ని రనౌట్ చేయవచ్చు" అని ఎంసీసీ తన వివరణలో చెప్పింది.
ఓ బౌలర్ తన బౌలింగ్ యాక్షన్ ను పూర్తి చేసే లోపు అతనికి నాన్ స్ట్రైకర్ ను రనౌట్ చేసేందుకు పూర్తి హక్కు ఉంటుంది. ఇక్కడ జంపా చేసిన రనౌట్ ఎందుకు నాటౌట్ గా ఇచ్చారో దీనిని బట్టి స్పష్టమవుతోంది. తాజాగా ఎంసీసీ ఈ కొత్త నిబంధనలో చేసిన మార్పులు జనవరి 19, 2023 నుంచే అమల్లోకి వస్తాయని కూడా ఎంసీసీ స్పష్టం చేసింది.
సంబంధిత కథనం
టాపిక్